ఎరువు.. బరువు
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:54 PM
Fertilizer prices Increase ఎరువుల ధరలు పెరిగాయి. యూరియా, డీఏపీ తప్ప మిగిలిన అన్ని రకాల ఎరువులు బస్తాపై రూ.100 నుంచి రూ.150 వరకు పెరగడంతో జిల్లా రైతులపై కోట్ల రూపాయల భారం పడనుంది.
పెరిగిన ధరలు
బస్తాపై రూ.100 నుంచి రూ.150 వరకు పెంపు
జిల్లా రైతాంగంపై రూ.కోట్ల భారం
రబీ సాగుపై ప్రభావం
నరసన్నపేట/ కోటబొమ్మాళి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఎరువుల ధరలు పెరిగాయి. యూరియా, డీఏపీ తప్ప మిగిలిన అన్ని రకాల ఎరువులు బస్తాపై రూ.100 నుంచి రూ.150 వరకు పెరగడంతో జిల్లా రైతులపై కోట్ల రూపాయల భారం పడనుంది. ఎరువుల ముడిసరుకును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడం, అంతర్జాతీయ మార్కెట్‌లో వాటి ధరలు పెరగడం ఈ పరిస్థితికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం రబీ సీజన్‌లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఇప్పుడు పెరిగిన ఎరువుల ధరలతో వారు ఆందోళన చెందుతున్నారు.
వరి, మొక్కజొన్న సాగుకే మొగ్గు
ఈ ఏడాది రబీలో ఆరుతడి పంటలు సాగు చేయాలని అధికారులు చెబుతున్నా రైతులు మాత్రం వరి, మొక్కజొన్న సాగుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో 20వేల ఎకరాల్లో వరి, 35వేల ఎకరాల్లో మొక్కజొన్న, 6వేల ఎకరాల్లో వేరశనగ, 12వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలను సాగు చేస్తున్నారు. కంది, మినుము, నువ్వు, కటిక, రాగి, కూరగాయల పంటలను కూడా పండిస్తున్నారు. ఆయా పంటలకు ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఎకరానికి ఆరు నుంచి 10 బస్తాలను పంటను బట్టి ఎరువు వేయాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. ఇందులో యూరియా 30శాతం, పొటాష్, సూపర్ ఫాస్పేట్, మిశ్రమ ఎరువులు 70శాతం వినియోగిస్తారు. మిశ్రమ ఎరువుల్లో పొటాష్, పాస్పరస్ వంటివి ఎక్కువగా ఉంటాయి. దేశీయంగా వీటి లభ్యత లేక ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అందుకే వీటితోపాటు ఇతర ఎరువుల ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. ఈ ధరల భారం రైతులపై పడింది.
యూరియా కృత్రిమ కొరత..
జిల్లాలో కొందరు డీలర్లు యూరియాను కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వారి వద్ద మొక్కజొన్న, వరి విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేసిన రైతులకు మాత్రమే యూరియాను విక్రయిస్తున్నారు. మరికొన్ని చోట్ల కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేస్తేనే రైతులకు యూరియా ఇస్తున్నారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ పోను 50 కేజీల యూరియా బస్తాను రూ.267కు విక్రయించాలి. హమాలీ ఖర్చుతో కలిపి గరిష్టంగా రూ.280కు అమ్మాలి. కానీ, కొందరు వ్యాపారులు బస్తాపై రూ.50 నుంచి రూ.100 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. యూరియా కొరత కారణంగా వ్యాపారులు చెప్పిన ధరకే రైతులు కూడా కొనుగోలు చేస్తున్నారు. అవసరం ఉన్న ప్రాంతాల్లో రైతు సేవాకేంద్రాల ద్వారా అధికారులు యూరియాను పంపిణీ చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి యూరియా సక్రమంగా పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
ధరల పెరుగుదల ఇలా..(రూపాయల్లో)
-------------------------------------------------------------------
ఎరువు ఖరీఫ్‌లో ప్రస్తుతం
-------------------------------------------------------------------
పొటాష్ 1700 1800
10:26:26 1720 1950
28:28:0 1800 1900
14:35:14 1800 1950
20:20:13 1350 1450
15:15:15 1450 1600
16:16:16 1450 1600
16.20.13 1350 1400
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
ఎరువులను కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం. జిల్లాలో 1579 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నాయి. రబీలో రైతులకు సరిపడా యూరియాను పంపిణీ చేస్తాం. వ్యాపారులు అధిక ధరలు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం.
- కె.త్రినాథస్వామి, జిల్లా వ్యవసాయాధికారి