MacDrill: విపత్తు సంభవిస్తే....
ABN , Publish Date - May 14 , 2025 | 12:28 AM
Disaster preparedness MacDrill ఊహించని విపత్తు సంభవిస్తే.. బాంబు దాడిలో అధిక మంది క్షతగాత్రులయితే... ప్రజలను ఏవిధంగా క్షణాల వ్యవధిలో కాపాడాలన్నది స్పష్టంగా తెలిపేలా శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలో మంగళవారం ‘మాక్‌డ్రిల్’ నిర్వహించారు.
ఉగ్రదాడిని ఎదుర్కొని... ప్రజలను రక్షించేలా
ఆకట్టుకున్న అధికారుల ‘మాక్‌డ్రిల్’...
కలెక్టర్, ఎస్పీ పరిశీలన
శ్రీకాకుళం క్రైం/ కలెక్టరేట్, మే 13(ఆంధ్రజ్యోతి): ఊహించని విపత్తు సంభవిస్తే.. బాంబు దాడిలో అధిక మంది క్షతగాత్రులయితే... ప్రజలను ఏవిధంగా క్షణాల వ్యవధిలో కాపాడాలన్నది స్పష్టంగా తెలిపేలా శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలో మంగళవారం ‘మాక్‌డ్రిల్’ నిర్వహించారు. ఇటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ బృందం(ఎస్‌డీఆర్‌ఎఫ్), అటు జిల్లా పోలీసు, అగ్నిమాపక, ఆర్టీసీ, రెవెన్యూ.. ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది సంయుక్తంగా పాల్గొని మాక్‌డ్రిల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఉగ్రవాదులపై పోలీసులు, భద్రతా బలగాలు కాల్పులు జరుపుతూనే.. ప్రజలకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి స్వయంగా మాక్‌డ్రిల్‌ను పరిశీలించారు.
ఉగ్రవాదుల దుశ్చర్య.. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో పేలిన బాంబు...
ప్రస్తుతం ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ఉగ్రదాడులు జరిగితే ఎలా స్పందించాలి.. జనసంచారం ఉన్న ప్రాంతాల్లో ఉగ్రవాదులు పేల్చిన బాంబుల దాడి నుంచి ప్రజలను ఎలా రక్షించాలన్నదే మాక్‌డ్రిల్ ఉద్దేశం. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఆర్టీసీ ఉద్యోగులు, విశాఖ నుంచి వచ్చిన ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు.. ప్రజలకు మాక్‌డ్రిల్‌ను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఉగ్రవాదుల దుశ్చర్యలో భాగంగా వందలాది జన సంచారం ఉండే శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బాంబు పేలితే.. ఏరీతిన స్పందించాలో వివరించారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బాంబును ఉగ్రవాదులు అమర్చడం.. ఆ సమాచారాన్ని నేరుగా కలెక్టరేట్‌లో ఉన్న కంట్రోల్ రూమ్‌కు చేరడం.. ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది క్షణాల్లో స్పందించి సంఘటనా ప్రాంతానికి రావడం.. ఈలోగా బాంబు పేలి నలుగురు మృతి చెందగా.. 15 మందికి తీవ్రగాయాలపాలవ్వడం.. ప్రజలు భయాందోళన చెందడం దృశ్యాలను మాక్‌డ్రిల్‌లో చూపించారు. మరో 35 మంది పరిస్థితి విషమంగా మారడంతో .. క్షతగాత్రులను స్ట్రక్చర్‌పై నుంచి అంబులెన్స్‌లో ఆసుపత్రిలో చేర్పించడం.. అలాగే ఉగ్రవాదుల దాడి నుంచి ప్రజలను రక్షించడం వంటి సంఘటనలను వివరించారు. క్షతగాత్రులుగా.. ప్రమాద మృతులుగా పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది జీవించారు. ఈ దృశ్యాలను ప్రజలు చూస్తుండగా.. ఇతర శాఖల పనితీరు ఎలా ఉంది... లోపాలను కలెక్టర్ గుర్తించారు. అవసరమైన సూచనలు సిబ్బందికి తెలియజెప్పారు. ఉగ్రదాడులు.. ఇతర ప్రమాదకరఘటనలు జరిగితే ఏరీతిన చర్యలు తీసుకోవాలో వివరించారు. కలెక్టర్, ఎస్పీ విలేకర్లతో మాట్లాడుతూ ప్రజలను ప్రమాద సంఘటనలో పలు ప్రాంతాల్లో అప్రమత్తం చేసేలా పైడిభీమవరం ఫార్మా కంపెనీల ద్వారా అలారం, అలాగే పలాస, శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్‌ల వద్ద హెచ్చరికలు జారీచేశాయని చెప్పారు. లోపాలను గుర్తించి సరిచేశామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓ సాయి ప్రత్యూష, మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, డీఎస్పీ వివేకానంద, ఏఆర్ డీఎస్పీ శేషాద్రి, జిల్లా అగ్నిమాపక అధికారి మోహనరావు, ఆర్టీసీ ఆర్‌ఎం విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

