Share News

PHC : పట్టణ ఆరోగ్య కేంద్రాలకు కొత్తరూపు

ABN , Publish Date - Aug 31 , 2025 | 11:30 PM

PHC devolopment రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పట్టణ ఆరోగ్య కేంద్రాలను మరింత బలోపేతం చేస్తోంది. అన్నిరకాల సౌకర్యాలు మెరుగుపరుస్తోంది. అవసరమైన మంచాలు, మందులను అందుబాటులో ఉంచుతోంది. ల్యాబ్‌ల్లో వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తోంది.

PHC : పట్టణ ఆరోగ్య కేంద్రాలకు కొత్తరూపు
బెల్లుపడ పట్టణ ఆరోగ్య కేంద్రం

మెరుగుపడిన వసతులు

అందుబాటులో 30 రకాల వైద్యసేవలు

పెరుగుతున్న ఓపీ సంఖ్య

ఇచ్ఛాపురం, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పట్టణ ఆరోగ్య కేంద్రాలను మరింత బలోపేతం చేస్తోంది. అన్నిరకాల సౌకర్యాలు మెరుగుపరుస్తోంది. అవసరమైన మంచాలు, మందులను అందుబాటులో ఉంచుతోంది. ల్యాబ్‌ల్లో వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తోంది. ఫలితంగా గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఈ కేంద్రాలకు ప్రస్తుతం కొత్తరూపు వచ్చింది. ఓపీ సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఇదీ పరిస్థితి..

పట్ణణాల్లో నిరుపేదలు, మురికివాడల ప్రజల కోసం పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం కార్పొరేషన్‌లో 6, ఇచ్ఛాపురంలో 2, పలాస-కాశీబుగ్గ 3, ఆమదాలవలస మునిసిపాలిటీలో 2 మొత్తం 13 కేంద్రాలు ఉన్నాయి. ప్రతీ 3 వేల కుటుంబాలకు ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం ఉంది. గత వైసీపీ ప్రభుత్వం ఈ ఆరోగ్య కేంద్రాల నిర్వహణలో పూర్తిగా విఫలమైంది. మందులు సకాలంలో వచ్చేవి కావు. ఆస్పత్రుల నిర్వహణను కూడా గాలికొదిలేసింది. ఈ తరుణంలో రోగులకు అరకొర సేవలు అందేవి. గతంలో చిన్నపాటి రోగాలకు సైతం ప్రైవేటు వైద్యాన్ని ఆశ్రయించాల్సి వచ్చేది. దీంతో వైద్యం భారంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కష్టాలన్నీ తీరుతున్నాయి. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అదనపు వసతులు సమకూర్చుతోంది. టెలీ మెడిసిన్‌, ప్రత్యేకంగా మంచాల ఏర్పాటు, రిఫరల్‌ కేసులు తగ్గించడం వంటి వాటిపై దృష్టిపెట్టింది. 30రకాల వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలు కూడా జరుగుతున్నాయి. దీంతో దాదాపు అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అవుట్‌ పేషెంట్‌ విభాగం పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. రోజుకు సగటున ఈ 13 కేంద్రాల్లో 900 నుంచి 1200మంది రోగుల వరకూ వైద్యసేవలు అందిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ఒక్కో కేంద్రంలో రోజుకు 20 నుంచి 30 మంది రోగులకు మాత్రమే వైద్యసేవలు అందేవి. ఇప్పుడు అదనపు సదుసాయాలు కల్పించడం, ల్యాబ్‌ వసతి పెరగడం, మందులు సైతం అందుబాటులోకి రావడంతో రోజుకు 60 నుంచి 70 మంది రోగులు వచ్చి వైద్యసేవలు పొందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

చురుగ్గా సర్వే..

ప్రస్తుతం పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో దీర్ఘకాలిక వ్యాధులపై చురుగ్గా సర్వే జరుగుతోంది. ప్రతీ కేంద్రం పరిధిలో 3 వేల మంది జనాభా ఉన్నారు. వీరిలో ఎంతమంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారు? ఎవరైనా బీపీతో బాధపడుతున్నారా? సుగర్‌ వ్యాధిగ్రస్తులు ఉన్నారా? చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఎటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు? అని ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు వివరాలు సేకరించి ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. సర్వే ప్రక్రియ ఆధారంగా దీర్ఘకాలిక రోగుల విషయంలో పట్టణ ఆరోగ్య కేంద్రం సిబ్బంది మరింత చొరవ చూపుతారు. వారికి నిత్యం వైద్య పరీక్షలు చేసి పర్యవేక్షిస్తారు.

ఓపీ పెరిగింది..

ఇచ్ఛాపురంలోని బెల్లుపడ కాలనీ అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో రోజువారీ ఓపీ 50కి పైగా పెరిగింది. రోగులకు కావల్సిన మందులు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ అత్యవసర మందులు అవసరమైతే వెంటనే దగ్గర్లో ఉన్న సీహెచ్‌సీలో కానీ రిమ్స్‌లో కానీ తెచ్చి ఇస్తున్నాం. ప్రస్తుతం రూ20.లక్షల విలువ చేసే మందులు అందుబాటులో ఉన్నాయి. ఉత్తమ పట్టణ ఆరోగ్య కేంద్రంగా రాష్ట్రంలోని ఒక్క ఇచ్ఛాపురం సెంటర్‌కే అవార్డు వచ్చింది. నేను ఉత్తమ ఫార్మాసిస్ట్‌ ఆఫీసర్‌గా అవార్డు అందుకున్నాను.

- రఘు, ఫార్మాసిస్ట్‌, పట్టణ ఆరోగ్య కేంద్రం, బెల్లుపడ కాలనీ, ఇచ్ఛాపురం

సద్వినియోగం చేసుకోవాలి

పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సేవలు పెరిగాయి. అదనపు సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఓపీ సంఖ్య కూడా పెరిగింది. రోగులకు అవసరమైన మందులు సైతం అందుబాటులో ఉన్నాయి. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

- అఖిల్‌ మనోహర్‌, వైద్యాధికారి, పట్టణ ఆరోగ్య కేంద్రం, ఇచ్ఛాపురం

Updated Date - Aug 31 , 2025 | 11:30 PM