Aqwa: సాగు.. ‘చేప’ట్టేదెలా?
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:54 PM
Loss-making fish pond managers విదేశీ పన్నులకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటనతో ఆక్వా రంగం ప్రమాదంలో పడింది. భారత్‌పై దిగుమతి సుంకాలు 25 శాతం పెంచుతూ ట్రంప్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం రొయ్యలు, ఇతర ఆక్వా ఉత్పత్తులపై పడింది.
ఆక్వా రంగంపై ట్రంప్ సుంకాల ప్రభావం
వ్యాపారుల సిండికేట్‌తో పతనమైన ధర
నష్టపోతున్న చేపల చెరువుల నిర్వాహకులు
ఇచ్ఛాపురం మండలం డొంకూరు తీర ప్రాంతంలో దాదాపు 50 ఎకరాల్లో చేపల చెరువులు సాగుచేస్తున్నారు. ఇక్కడ నుంచి దేశీయంగా మార్కెట్లతోపాటు విశాఖ నుంచి విదేశాలకు చేపలు తరలిస్తుంటారు. కానీ ఇప్పుడు అమెరికాలో సుంకాల పెంపు కారణంగా.. స్థానికంగా చేపల ధర తగ్గడంతో చెరువులు నిర్వాహకులు దిగులు చెందుతున్నారు. ఇలా అయితే చేపల చెరువుల సాగు కష్టమని చెబుతున్నారు.
ఇచ్ఛాపురం, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): విదేశీ పన్నులకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటనతో ఆక్వా రంగం ప్రమాదంలో పడింది. భారత్‌పై దిగుమతి సుంకాలు 25 శాతం పెంచుతూ ట్రంప్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం రొయ్యలు, ఇతర ఆక్వా ఉత్పత్తులపై పడింది. సుంకాల భారంతో ధర పెరిగి.. ఇక్కడ నుంచి అమెరికాకు ఎగుమతులు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో చేపల ధర అమాంతం తగ్గింది. రొయ్యల ధర పతనం దిశగా పయనిస్తుండడంతో చెరువుల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో రణస్థలం, ఎచ్చెర్ల, గార, సంతబొమ్మాళి, సోంపేట, ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు, పోలాకి మండలాల్లో చేపల చెరువులు సాగు చేస్తున్నారు. 11 తీర మండలాల్లో సుమారు 4వేల హెక్టార్లలో ఆక్వా సాగవుతోంది. సుమారు 1,500 మంది చేపల చెరువులు నిర్వహిస్తుండగా.. వాటిలో దాదాపు పదివేల మంది పనిచేస్తున్నారు. ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు పంచాయతీ డొంకూరు, శివకృష్ణాపురం, చిన్న లక్ష్మీపురం, పెద్దలక్ష్మీపురం గ్రామాల్లో దాదాపు 100 ఎకరాల్లో చేపల చెరువులు ఉన్నాయి. జిల్లాలో ఏడాదికి రూ.200 కోట్లకుపైగా ఆక్వా ఉత్పత్తుల విక్రయాలు సాగుతున్నాయి. ఇక్కడ లభ్యమయ్యే రొయ్య, ఇతరత్రా చేపలను వ్యాపారులు సేకరిస్తారు. శ్రీకాకుళం నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకూ ఆక్వా ఉత్పత్తులు ఎక్కువగా విశాఖ పోర్టు నుంచి ఎగుమతి అవుతుంటాయి. ఇప్పటివరకూ అమెరికాలో విదేశీ ఆక్వా ఉత్పత్తులపై 3 నుంచి 4 శాతం సుంకం మాత్రమే విధించేవారు. కానీ ఇటీవల ట్రంప్ 25 శాతం సుంకం అని ప్రకటించడంతో ఆ ప్రభావం జిల్లాలో ఆక్వా ఉత్పత్తులపై పడుతోంది. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర తగ్గించి చేపలను, రొయ్యలను అడుగుతున్నారు. 20 కౌంట్ రొయ్యలు.. సుంకాల ప్రకటనకు ముందు రూ.640గా ఉండేది. ప్రస్తుతం రూ.580కు పడిపోయింది. గతంలో 30 కౌంటు రూ.470గా ఉండగా.. ఇప్పుడు రూ.420కు చేరింది. కిలోకు సుమారు రూ.50 పతనమైంది. దీంతో టన్నుకు రూ.3 లక్షల నుంచి రూ.4లక్షల వరకూ నష్టపోవాల్సి వస్తోందని చేపల చెరువుల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు కూడా రావని, ఇలా అయితే చేపల సాగు కష్టమేనని వాపోతున్నారు.
దెబ్బతీసిన జగన్ సర్కారు..
వైసీపీ హయాంలో ఆక్వారంగం గడ్డుపరిస్థితులను ఎదుర్కొంది. అప్పట్లో కనీస ప్రోత్సాహం లేదు. రూ.1.50కే యూనిట్ విద్యుత్‌ను అందిస్తామని చెప్పారు. కానీ అమలు చేయలేదు. ఈ-షిప్ విధానంలో అనేక నిబంధనలను తెరపైకి తెచ్చారు. వంద రొయ్యల ధర టీడీపీ హయాంలో రూ.260 వరకూ ఉండేది. కానీ వైసీపీ పాలనలో అమాంతం రూ.180కు పడిపోయింది. ఉప్పు, మంచినీరు ఆక్వా జోన్లుగా విభజించారు. పది ఎకరాల్లోపు సాగుచేసిన రైతులకు మాత్రమే రూ.1.50కు యూనిట్ విద్యుత్‌ను అందించారు. దీంతో జిల్లాలో వందలాది మంది ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ అందకుండా పోయింది. పది హార్స్ పవర్ విద్యుత్ మోటారును వినియోగించేవారికి రాయితీ వర్తించదని.. ఈ-షిప్ విధానంలో చెరువుల లీజు ఒప్పందం, లైసెన్స్, విద్యుత్ మీటరు, భూమి ఆన్‌లైన్ పత్రాలు ఇవ్వాలని మెలిక పెట్టారు. వీటిలో ఏ ఒక్కటీ లేకపోయినా యూనిట్ విద్యుత్‌కు రూ.6 వరకూ కట్టాల్సి వచ్చేది. కానీ కూటమి ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు విధించకుండా చెరువులు సాగుచేసే వారికి రాయితీ విద్యుత్ అందించాలని నిర్ణయించింది. రూ.1.50కే యూనిట్ విద్యుత్‌ను అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. దీంతో జిల్లాలో చేపల చెరువులు పెరిగాయి. కానీ ఇంతలోనే అమెరికాలో సుంకాల ప్రభావంతో ఆక్వారంగం మళ్లీ ప్రమాదంలో పడిందని చేపల చెరువుల నిర్వాహకులు పేర్కొంటున్నారు.
ధర పతనం
అమెరికా ప్రకటన మా బతుకులను దెబ్బతీసింది. రెండు ఎకరాల చెరువులో కష్టపడి పెంచి చేపలకు సరైన ధర లేకుండా పోయింది. ఆక్వా రంగం దారుణంగా దెబ్బతింది. వైసీపీ పాలనలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాం. కూటమి ప్రభుత్వం విద్యుత్ రాయితీ ప్రకటించింది. ఆహార ఉత్పత్తులకు ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది. దీంతో భవిష్యత్ బాగుంటుందని ఆశించాం. కానీ ఇప్పుడు వ్యాపారులు ఒక్కటై మమ్మల్ని దెబ్బతీస్తున్నారు.
- ఎస్.గోపాల్, చేపల చెరువు నిర్వాహకుడు, బూర్జపాడు
భారీగా పెట్టుబడి
రెండున్నర ఎకరాల చెరువులో చేపల పెంపకం చేపడుతున్నాను. సముద్రంలో చేపల వేట గిట్టుబాటు కాక... తీరప్రాంతంలో మత్స్యకారులే చేపల చెరువులను తవ్వుకున్నారు. భారీగా పెట్టుబడులు కూడా పెట్టారు. ఇప్పుడు అమెరికా ప్రకటనతో ధర పతనమైంది. మాకు ఏంచేయాలో పాలుపోవడం లేదు.
- దున్న కోటేశ్వరరావు, చేపల చెరువు నిర్వాహకుడు, డొంకూరు