Excise department : మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలి
ABN , Publish Date - May 24 , 2025 | 11:43 PM
Illicit liquor Alcohol smuggling మద్యం, గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఇచ్ఛాపురంలోని పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రరావుతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
మాదకద్రవ్యాల నియంత్రణపై దృషి
ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి
ఇచ్ఛాపురం/ టెక్కలి, మే 24(ఆంధ్రజ్యోతి): మద్యం, గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఇచ్ఛాపురంలోని పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రరావుతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. చెక్‌పోస్టులో సిబ్బంది పనితీరు, రికార్డులు పరిశీలించారు. ఆంధ్రా-ఒడిశా నుంచి రాకపోకలు సాగించే వాహనాలను తనిఖీ చేశారు. సారా, గంజాయి, ఒడిశా మద్యం అక్రమ రవాణా కాకుండా అడ్డుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. అనంతరం ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో సారా నియంత్రణ కోసం సంయుక్త దాడులకుగానూ బరంపురం కార్యాలయంలో గంజాం జిల్లా ఎస్పీతో చర్చించారు.
సారా విక్రయిస్తే.. బైండోవర్..
‘సారా కేసుల్లో గతంలో అరెస్టు కానివారిని వెంటనే అరెస్టు చేయాలి. అరెస్టయిన వారికి తహసీల్దార్ కార్యాలయాల్లో బైండోవర్ చేయాలి. బైండోవర్ అయిన నిందితులు నిబంధనలు అతిక్రమిస్తే రూ.2లక్షల అపరాధ రుసుం వసూలు చేయాల’ని ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్‌రెడ్డి ఆదేశించారు. టెక్కలిలోని ఎక్సైజ్‌శాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. సారా రహిత గ్రామాలు తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. సారా తయారీకి బెల్లం సరఫరా చేస్తున్న వారికిని కూడా అరెస్టు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో టెక్కలి, ఇచ్ఛాపురం సీఐలు ఎస్‌కే మీరాసాహెబ్, జీవీ రమణ, ఇచ్ఛాపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ పి.దుర్గాప్రసాద్, ఏఈ ఎస్.గోపాలకృష్ణ, ఎస్‌ఐలు పాల్గొన్నారు.