Ration rice transport : సిక్కోలు టు ఒడిశా
ABN , Publish Date - Sep 12 , 2025 | 12:22 AM
Rice sold at double price in Odisha జిల్లాలో పేదల బియ్యం పక్కదారిపట్టి అక్రమంగా తరలిపోతున్నాయి. జిల్లాలోని సరిహద్దు మండలాల నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం ఒడిశాకు రవాణా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. చిరువ్యాపారులకు కమీషన్లు ఇచ్చి బియ్యం కొనుగోలు చేయడం, వాటిని గుంపగుత్తిగా ఒడిశాకు తరలించడం పరిపాటిగా మారింది
పేదల బియ్యం అక్రమంగా తరలింపు
కార్డుదారుల నుంచి కిలో రూ.15కు కొనుగోలు
వాటిని మిల్లర్లకు రూ.20కు విక్రయం
ఒడిశాలో రెట్టింపు ధరకు అమ్మకాలు
జూలై 12న పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పి.కోనవలస చెక్‌పోస్టు వద్ద శ్రీకాకుళం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీలో 34,800 కిలోల పీడీఎస్ బియ్యం (700 బస్తాలు) పట్టుబడ్డాయి. కొత్తూరు మండలం కడుమలో రైస్‌మిల్లు నుంచి ఈ బియ్యం ఒడిశా రాష్ట్రం నవరంగపూర్‌కు అక్రమ రవాణా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ. 15,83,400 ఉంటుందని నిర్ధారించారు. పట్టుబడిన బియ్యాన్ని లారీతో సహా స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. మిల్లు యాజమానిపై కేసు నమోదు చేయించారు.
ఆగస్టు 4న సోంపేట మండలం పలాసపురంలో ఓ ఇంట్లో 950 కిలోల పీడీఎస్ బియ్యం విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డాయి. ఆ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని బాధ్యులపై కేసులు నమోదు చేశారు.
ఈ నెల 8న పలాస మండలం లక్ష్మీపురం టోల్‌ప్లాజా వద్ద 11 టన్నుల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. టెక్కలి నుంచి ఒడిశా రాష్ట్రం బరంపురానికి వ్యాన్‌లో ఈ బియ్యం తరలిస్తుండగా.. ముందస్తు సమాచారం మేరకు కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు. టెక్కలి, కోటబొమ్మాళి ప్రాంతంలో కిలో రూ.18కు కొనుగోలు చేసి ఒడిశాలో రూ.40కు అమ్ముతున్నట్టు తెలుస్తోంది.
ఇచ్ఛాపురం, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పేదల బియ్యం పక్కదారిపట్టి అక్రమంగా తరలిపోతున్నాయి. జిల్లాలోని సరిహద్దు మండలాల నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం ఒడిశాకు రవాణా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. చిరువ్యాపారులకు కమీషన్లు ఇచ్చి బియ్యం కొనుగోలు చేయడం, వాటిని గుంపగుత్తిగా ఒడిశాకు తరలించడం పరిపాటిగా మారింది. ప్రధానంగా సరిహద్దు మండలాల్లోని కొందరు మిల్లర్లు ఈ దందాకు పాల్పడుతున్నారు. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి దందా కొనసాగుతోంది. సాధారణంగా బియ్యం బస్తా బరువు 50.900 కిలోలు ఉండాలి. కానీ అక్కడే 2కిలోల తరుగు వస్తోంది. కార్డుదారుల నుంచి కిలో రూ.15కు కమీషన్ వ్యాపారులు కొనుగోలుచేస్తే.. వారి వద్ద నుంచి వ్యాపారులు రూ.20కు కొనుగోలు చేస్తుంటారు. అదే బియ్యాన్ని కిలో రూ.40 వరకూ ఒడిశాకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
భారీగా గోల్‌మాల్..
జిల్లాలో మొత్తం రేషన్‌కార్డులు 6,51,717 ఉన్నాయి. 17.95 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా సరఫరా చేస్తున్న బియ్యం 8వేల టన్నుల వరకూ ఉంటుంది. ఐదేళ్లలో అక్రమంగా తరలిస్తున్న పట్టుకున్న బియ్యం 153 టన్నులు. గడిచిన ఆరు నెలల్లో 15టన్నుల బియ్యం పట్టుబడ్డాయి. సాధారణంగా రేషన్ బియ్యాన్ని రైతు కుటుంబాలతో పాటు ఎగువ మధ్యతరగతి వారు ఎక్కువగా విక్రయిస్తుంటారు. గతంలో నేరుగా లబ్ధిదారుల నుంచి డీలర్లే కొనుగోలు చేసేవారు. ఇప్పుడు చిరు వ్యాపారులు సైతం ఇదో వృత్తిగా పెట్టుకున్నారు. గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ కిలో బియ్యాన్ని రూ.15ల వరకూ కొనుగోలు చేస్తున్నారు. వాటినే మిల్లర్లకు అప్పగించి సొమ్ము చేసుకుంటున్నారు. కిలో దగ్గర రూ.5 నుంచి రూ.10 వరకూ లబ్ధి పొందుతున్నారు.
లాభసాటి వ్యాపారం..
సాధారణంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగిస్తుంది. వారు ఏడాది పొడవునా మిల్లింగ్ చేసి పౌరసరఫరాల శాఖకు అప్పగించాలి. ఇందుకుగాను క్వింటా మిల్లింగ్ చేసేందుకు ప్రభుత్వం రూ.60 చెల్లిస్తుంది. అయితే ఇక్కడే కొందరు మిల్లర్లు దగా చేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని నేరుగా లెవీగా చూపుతున్నారు. చిరు వ్యాపారుల ద్వారా కొనుగోలు చేయించిన బియ్యాన్నే మిల్లింగ్ చేసిన బియ్యంగా చూపుతున్నారు. రూ.25 నుంచి రూ.30 వరకూ రేషన్ బియ్యాన్ని చూపి లెవీకి పంపుతున్నారు. బస్తా దగ్గర రూ.30 వరకూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు.
ఇక రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి సన్నబియ్యంగా కొందరు మిల్లర్లు చూపుతున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసే రేషన్ బియ్యాన్ని సాంబమసూరి వంటి బ్రాండెడ్ బియ్యంలో కలిపి విక్రయిస్తున్నారు. సన్నంగా మరపట్టడంతో వినియోగదారులు సైతం గుర్తించలేక మోసపోతున్నారు. అటు తూకం దగ్గర సైతం ఇదే పరిస్థితి. 25 కిలోలు ఉండే ప్యాకెట్‌లో ఉండేది 23 కిలోలే. రెండు కిలోలు తరుగును చూపిస్తుంటారు. ఇటు బియ్యం నకిలీతో పాటు తూకంలో సైతం వినియోగదారుడు నష్టపోవాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా పౌరసరఫరాల శాఖ అధికారులు కానీ.. తూనికలు కొలతలు శాఖ అధికారులు కానీ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా బియ్యం అక్రమ రవాణా నియంత్రణపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరముంది.
ముమ్మరంగా తనిఖీలు..
జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ప్రత్యేకంగా దృష్టిపెట్టాం. ఇప్పటికే విజిలెన్స్ అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతున్నారు. ఇటీవల కాశీబుగ్గలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. బాధ్యులపై కేసులు నమోదయ్యాయి. సరిహద్దు ప్రాంతాలపై మరింత నిఘా పెట్టాం.
- సూర్యప్రకాష్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, శ్రీకాకుళం