టెక్కలి టు ఒడిశా...
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:24 PM
ration rice travel to odissa జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. టెక్కలి నుంచి ఒడిశా రాష్ట్రం బరంపురానికి ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 11 టన్నుల రేషన్ బియ్యం కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడ్డాయి.
11 టన్నుల రేషన్ బియ్యం అక్రమ రవాణా
కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడిన వైనం
పలాస, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. టెక్కలి నుంచి ఒడిశా రాష్ట్రం బరంపురానికి ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 11 టన్నుల రేషన్ బియ్యం కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడ్డాయి. బియ్యం అక్రమ రవాణాపై పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి లక్ష్మీపురం టోల్‌ప్లాజా వద్ద సీఐ పి.సూర్యనారాయణ, ఎస్‌ఐ నర్సింహమూర్తి, పోలీసులు తనిఖీ చేశారు. టెక్కలి నుంచి ఒడిశా వెళ్తున్న ఓ ఐచర్ వాహనంలో గోనెసంచుల మూటలు కనిపించాయి. అందులో 11 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్టు గుర్తించారు. వ్యాన్‌తోపాటు బియ్యాన్ని కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌కు తరలించారు. వాటిని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. పౌరసరఫరాలశాఖ డిప్యూటీ తహసీల్దార్ ఎన్.తిరుపతిరావు, వీఆర్వోలు సంఘటన స్థలానికి చేరుకొని బియ్యం ఎక్కడ నుంచి ఎక్కడకు రవాణా చేస్తున్నారో సంబంధిత వాహనం డ్రైవర్ సంజయ్‌కుమార్‌సమాల్‌ను అడిగి తెలుసుకున్నారు. బియ్యం అక్రమ రవాణాపై 6ఏ కేసు నమోదు చేశామని తహసీల్దార్ టి.కళ్యాణచక్రవర్తి తెలిపారు. జేసీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సమీపంలో ఉండే డీలర్ స్టాక్‌పాయింట్‌కు తరలిస్తామని తెలిపారు. సీఐ పి.సూర్యనారాయణ మాట్లాడుతూ రెవిన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు తాము కూడా కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
టెక్కలి, కోటబొమ్మాళి ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని వివిధ వర్గాల ద్వారా కొనుగోలు చేసి.. ఒడిశాలో విక్రయించేందుకు తరలిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక్కడ కిలో రూ.18కు కొనుగోలు చేసి ఒడిశాలో రూ.40వరకూ విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో చాలామంది వ్యాపారులు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ లాభపడుతున్నారు. దీని నియంత్రణపై అధికారులు మరింత నిఘా ఏర్పాటు చేయాల్సి ఉందని పలువురు పేర్కొంటున్నారు.