Share News

Soil mafia!: మట్టి మాఫియా!

ABN , Publish Date - Apr 04 , 2025 | 11:47 PM

Illegal mining నరసన్నపేట మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. గ్రామాల్లో చెరువులు, కొండ పోరంబోకు స్థలాల్లో మట్టి అక్రమ తవ్వకాలు చేపట్టి.. ఇష్టానుసారంగా విక్రయిస్తోంది. ఇదంతా గ్రామస్థాయిలో రెవెన్యూ అధికారులకు తెలిసినా.. వారిచ్చే మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.

Soil mafia!: మట్టి మాఫియా!
దమ్మన్న చెరువులో మట్టి అక్రమ తవ్వకాలు

  • చెరువుల్లో అక్రమంగా తవ్వకాలు

  • లారీ, ట్రాక్టర్లలో తరలించి విక్రయం

  • పట్టించుకోని రెవెన్యూ అధికారులు

  • నరసన్నపేట, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. గ్రామాల్లో చెరువులు, కొండ పోరంబోకు స్థలాల్లో మట్టి అక్రమ తవ్వకాలు చేపట్టి.. ఇష్టానుసారంగా విక్రయిస్తోంది. ఇదంతా గ్రామస్థాయిలో రెవెన్యూ అధికారులకు తెలిసినా.. వారిచ్చే మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. రావులవలస, సత్యవరం రూరల్‌, కరగాం, తామరాపల్లి, నరసన్నపేట పంచాయతీల్లోని చెరువుల్లో గత వారం రోజులుగా మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అక్రమార్కులు పగలు, రాత్రివేళ మట్టి, కంకర తవ్వకాలు చేపట్టి.. అక్రమ రవాణా చేస్తున్నారు. పట్టణ పరిసర ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఈ వెంచర్లను చదును చేసేందుకుగానూ చెరువుల్లో మట్టిని తోడేస్తున్నారు. అలాగే పొలాలు ఎత్తు చేసేందుకు కూడా ఈ మట్టిని వినియోగిస్తున్నారు.

  • లారీ రూ.2వేలు.. ట్రాక్టర్‌ రూ.500

  • రావులవలస పంచాయతీ గుండువిల్లిపేట వద్ద దమ్మన్న చెరువులో భారీ యంత్రాలతో 15 రోజులుగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. ఈ మట్టిని కోమర్తి, మడపాం, రావులవలస, నరసన్నపేట, రెడ్డికపేట, గొట్టిపల్లి తదితర గ్రామాల్లో ట్రాక్టర్లు, టిప్పర్లతో విక్రయిస్తున్నారు. టిప్పర్‌ లారీ మట్టికి రూ.2వేలు, ట్రాక్టర్‌ లోడుకు రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారు. రోజుకు పదిలోడులకు పైగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

  • నరసన్నపేటలో పలు ప్రభుత్వ పనులకుగానూ తామరాపల్లి శివారు ప్రాంతంలో కొండపై కంకర, మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. నారాయణవలస, కరగాం, రెడ్డికపేట, గొట్టిపల్లి తదితర గ్రామాల్లో కూడా అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.

  • నరసన్నపేట మండలంలో పలు గ్రామాల్లో కొంతమంది తెలుగుతమ్ముళ్లు మట్టి మాఫియాతో చేతులు కలుపుతున్నారు. చెరువులు, ప్రభుత్వ భూముల్లో తవ్వకాలపై ఎవరైనా ప్రశ్నిస్తే.. పెద్దల పేర్లు చెప్పి తప్పించుకుంటున్నారు. మాఫియా సభ్యులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలతో సంబంధాలు కొనసాగించి అక్రమాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఇలా మండల పరిధిలో ప్రతిరోజూ గ్రామస్థాయి అధికారులకు మట్టి మాఫియా నుంచి ముడుపులు అందడంతో అక్రమాలు చూసీచూడనట్టు వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

  • న్యాయం చేయండి

  • ‘గుండువిల్లిపేట వద్ద దమ్మన్న చెరువు ప్రాంతంలో మా పూర్వీకుల నుంచి 40 ఏళ్లుగా సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాం. మూడు ఎకరాల విస్తీర్ణం గల ఈ ప్రాంతంలో 15 రోజులుగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా తవ్వకాలు ఆగడం లేదు’ అని దళిత రైతు అప్పలరామయ్య కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కోర్టు ఇంజక్షన్‌ రిట్‌ జారీ చేసినా తవ్వకాలు చేపడుతూనే ఉన్నారని వాపోయారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. అక్రమ తవ్వకాలు అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.

  • చర్యలు తీసుకుంటాం

  • రావులవలస పంచాయతీ గుండువిల్లిపేట చెరువు వద్ద మట్టి తవ్వకాలపై ఫిర్యాదులు అందాయి. తవ్వకాలు నిలుపుదల చేయాలని ఆదేశించాం. ఏ గ్రామంలోనైనా చెరువుల్లో తవ్వకాలు చేస్తే చర్యలు తీసుకుంటాం. గ్రామస్థాయిలో వీఆర్వో, వీఆర్‌ఏలను అప్రమత్తం చేస్తాం.

    - సత్యనారాయణ, తహసీల్దార్‌, నరసన్నపేట

Updated Date - Apr 04 , 2025 | 11:47 PM