Share News

మాది.. అడ్డదారి!

ABN , Publish Date - Sep 28 , 2025 | 12:00 AM

Illegal gold trade నరసన్నపేటలో కొందరు దొడ్దిదారిలోనే బంగారం వ్యాపారాలు చేస్తూనే ఉన్నారు. నరసన్నపేటలో బంగారం వ్యాపారాలపై ఓ కన్ను వేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఇటీవల క్రైం మీటింగ్‌లో ఆదేశాలు జారీ చేసినా.. దొడ్డిదారిలోనే చాపకింద నీరులా వ్యాపారాలు సాగిస్తున్నారు. చాలామంది జీరో ట్యాక్స్‌ వ్యాపారం కొనసాగిస్తున్నారు.

మాది.. అడ్డదారి!

  • నరసన్నపేటకు అక్రమంగా బంగారం దిగుమతి

  • గుప్త హత్య జరిగినా.. వెనక్కి తగ్గని వ్యాపారులు

  • ఆదాయపు పన్ను ఎగ్గొట్టేలా క్రయవిక్రయాలు

  • నరసన్నపేట, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి):

  • గత నెల 26న నరసన్నపేటకు చెందిన బంగారం వ్యాపారి పొట్నూరు రామేశ్వర గుప్త హత్యకు గురయ్యారు. ఈయన దొడ్డిదారిన బంగారం వ్యాపారం చేసి.. కొద్దికాలంలోనే కోటీశ్వరుడిగా ఎదిగారు. ఈ క్రమంలో విశాఖ నుంచి బంగారం కొనుగోలు చేసి వస్తుండగా.. కారుడ్రైవర్‌ అత్యాశకుపోయి గుప్తను పథకం ప్రకారం హతమార్చాడు. ఆ బంగారాన్ని కాజేసేందుకు యత్నించి.. కొన్నిరోజుల తర్వాత కటకటలా పాలయ్యాడు. అదే బంగారం వ్యాపారాన్ని సక్రమంగా అంటే బిల్లుమీద కొనుగోలు చేస్తే.. కారుడ్రైవర్‌లో దుర్బుద్ధి పుట్టేదికాదు. గుప్త హత్యకు గురయ్యేవారు కాదు.

  • ఇటీవల నరసన్నపేటకు చెందిన ఒక బులియన్‌ వ్యాపారి ఒడిశాకు చెందిన వ్యాపారులకు బంగారం ఆభరణాలను విక్రయించారు. ఎటువంటి బిల్లులు ఇవ్వలేదు. దీంతో ఒడిశా వ్యాపారులు తమకేమీ బంగారం విక్రయించలేదని బుకాయించారు. ఈ క్రమంలో వారి చేతిలో నరసన్నపేట వ్యాపారి సుమారు రూ.60లక్షల వరకూ పోగొట్టుకున్నారు.

  • 2018లో ఒక బులియన్‌ హోల్‌సేల్‌ దుకాణదారుడు తన కుమారుడ్ని నరసన్నపేట నుంచి విశాఖపట్నం కారులో బంగారం కొనుగోలు కోసం పంపించారు. కారుడ్రైవర్‌ తన స్నేహితులతో కలిసి.. బంగారం వ్యాపారిని బెదిరించి సుమారు రూ.కోటి చోరీ చేశారు. అప్పట్లో ఈ సంఘటనపై నరసన్నపేట పోలీసుస్టేషన్‌లో పంచాయితీ పెట్టి... హోల్‌సేల్‌ వ్యాపారి చోరీదారుల నుంచి కొంత డబ్బును రాబెట్టుకున్నారు. ఈ వ్యవహారం బయట పడకుండా సెటిల్‌ చేశారు.

  • ..ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా.. నరసన్నపేటలో కొందరు దొడ్దిదారిలోనే బంగారం వ్యాపారాలు చేస్తూనే ఉన్నారు. నరసన్నపేటలో బంగారం వ్యాపారాలపై ఓ కన్ను వేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఇటీవల క్రైం మీటింగ్‌లో ఆదేశాలు జారీ చేసినా.. దొడ్డిదారిలోనే చాపకింద నీరులా వ్యాపారాలు సాగిస్తున్నారు. చాలామంది జీరో ట్యాక్స్‌ వ్యాపారం కొనసాగిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు బంగారం ధరలు మరింత పెరుగుతాయనే ఉద్దేశంతో కొందరు వ్యాపారులు విశాఖపట్నం, విజయవాడ, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, కోయంబత్తూరు, చైన్నై నుంచి బంగారాన్ని, ఆభరణాలను నరసన్నపేటకు దిగుమతి చేశారు. తమ వద్ద పనిచేసే నమ్మకం కలిగిన వ్యక్తులను ఈ పనికి వినియోగిస్తున్నారు. కొంతమంది ట్రావెల్స్‌, ఆర్టీసీ బస్సుల్లో కూడా బంగారాన్ని ప్యాకింగ్‌ చేసి.. బ్యాగ్‌లో పెట్టి.. దిగుమతి చేస్తున్నారని సమాచారం.

  • దొడ్దిదారినే ఎందుకంటే...

  • బంగారం కొనుగోలు చేయాలంటే ప్రభుత్వానికి 4శాతం పన్ను చెల్లించాలి. కొనుగోలు చేసిన బంగారాన్ని విక్రయించిన సందర్భంలో కూడా లెక్కలు చూపాలి. మరో 4శాతం పన్ను చెల్లించాలి. అదే జీరో ట్యాక్స్‌పై విక్రయిస్తే 100 గ్రాముల బంగారం బిస్కెట్‌కు సుమారు రూ.10వేల వరకూ వ్యాపారులకు మిగులుతుంది. పన్ను చెల్లించి కొనుగోలు చేసే బంగారం బిస్కెట్‌లో 24క్యారెట్లు ఉంటుంది. పన్ను చెల్లించకపోతే ఆ స్వచ్ఛత ఉండదు. అచ్చం స్వచ్ఛమైన బంగారం వలె బిస్కెట్‌పై బీఐఎస్‌ ముద్ర ఉంటుంది కానీ.. మిల్లీగ్రాముల్లో నాణ్యత తగ్గించి ఉంటుంది. అయినా సరే ప్రభుత్వానికి ఆదాయ పన్ను ఎగ్గొట్టేందుకు చాలామంది వ్యాపారులు దొడ్డిదారిన క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. ఏడాది టర్నోవర్‌ మేరకు బంగారం వ్యాపారం చేసేవారిపై ఆదాయపు పన్ను పడుతుంది. ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వ్యాపారులకు తెల్లరేషన్‌ కార్డు ఉండదు. ఆరోగ్యశ్రీ కార్డు వర్తించదు. పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాదు. ఇలా ప్రభుత్వ పథకాలు పొందేందుకు అన్హరులు అవుతారు. ఈ నేపథ్యంలో చాలామంది వ్యాపారులు జీరోట్యాక్స్‌ విక్రయాల వైపు మొగ్గు చూపుతున్నారు. రూ.కోట్లలో లావాదేవీలు చేసే బడావ్యాపారులు సైతం రేషన్‌ కార్డులు కలిగి.. ప్రభుత్వ పథకాలు పొందడం గమనార్హం.

  • జిల్లాలో 600కు పైగా హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారాలు ఉండగా నరసన్నపేట పట్టణంలో సుమారు వంద వరకు బంగారం దుకాణాలు ఉన్నాయి. వీటిలో 30 దుకాణాలను బడా వ్యాపారులు నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరు దొడ్దిదారిలోనే బంగారం విక్రయిస్తున్నారని సమాచారం. వారికి పోలీసుల నుంచి ఇబ్బంది లేకుండా తాను అంతా చూసుకుంటానని ఒక హోల్‌సేల్‌ బంగారం వ్యాపారి భరోసా కల్పించినట్లు తెలుస్తోంది. ఆ వ్యాపారి నరసన్నపేట పోలీసు ఉన్నతాధికారులకు ఇటీవల కలిసి.. తమ వ్యాపారాలకు సహకరించాలని కోరినట్లు సమాచారం. కాగా అక్రమ వ్యాపారాలపై అధికారులు మరింత నిఘా పెడితే.. దొడ్దిదారిలో వచ్చే బంగారం గుట్టురట్టయ్యే అవకాశం ఉంది.

  • దాడులు చేస్తేనే..

  • నరసన్నపేటలోని గుడ్ల నాగరాజుకు చెందిన జీఎన్‌ఆర్‌ బంగారం దుకాణంలో కొన్నాళ్ల కిందట బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ అధికారులు దాడులు చేశారు. నకిలీ హాల్‌మార్క్‌ బంగారం ఆభరణాలు విక్రయిస్తున్నట్టు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ హాల్‌మార్క్‌ వేసిన షాపుపై కూడా దాడులు చేపట్టారు. తాజాగా శుక్రవారం నరసన్నపేటలో బంగారం దుకాణాలపై కేంద్ర జీఎస్టీ కస్టమ్స్‌ అధికారులు సోదాలు చేశారు. తమ్మయ్యపేటలోని హోల్‌సేల్‌ బంగారం వ్యాపారి ఉప్పు గిరి ఇంట్లో సోదాలు చేసి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం పేట జంక్షన్‌లోని శ్రీగౌరీ శంకర్‌ జ్యూయలర్స్‌ షాపులో కూడా దాడులు చేశారు. ఇటీవల తమిళనాడులోని కోయంబత్తూరులో బంగారం వ్యాపారి నుంచి నరసన్నపేటకు చెందిన వ్యాపారులు భారీ మొత్తంలో జీరో ట్యాక్స్‌లో లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించారు. దీనిపై పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. ఇదే మాదిరి బీఐఎస్‌, తూనికలు కొలతలు, రెవెన్యూ, పోలీసు, జీఎస్టీ, ఆదాయపు పన్ను అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తే బంగారం వ్యాపారుల అక్రమాలు మరిన్ని బయటపడతాయని పలువురు పేర్కొంటున్నారు.

Updated Date - Sep 28 , 2025 | 12:00 AM