ఉజ్జుడుమెట్ట పాయే!
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:56 PM
gravel excavations పలాస-మందస మండలాల సరిహద్దులో ఉన్న ఉజ్జుడుకొండపై కంకర అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ కొండభాగం మొత్తం 30 ఎకరాలకుపైగా విస్తరించి ఉంది. రెండున్నరేళ్ల కిందట చరణ్ రియల్‌ఎస్టేట్ సంస్థ కొంతమంది పట్టాలు ఉన్న రైతుల వద్ద భూమిని కొనుగోలు చేసింది.
30 ఎకరాల్లో కంకర అక్రమ తవ్వకాలు
రాత్రివేళ యథేచ్ఛగా వాహనాల్లో తరలింపు
పలాస, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): పలాస-మందస మండలాల సరిహద్దులో ఉన్న ఉజ్జుడుకొండపై కంకర అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ కొండభాగం మొత్తం 30 ఎకరాలకుపైగా విస్తరించి ఉంది. రెండున్నరేళ్ల కిందట చరణ్ రియల్‌ఎస్టేట్ సంస్థ కొంతమంది పట్టాలు ఉన్న రైతుల వద్ద భూమిని కొనుగోలు చేసింది. ప్లాట్లు వేయడానికి అందులో ఉన్న మొక్కలు తొలగించింది. కాగా దీనిపై తమకు సర్వహక్కులు ఉన్నాయని, ఆ ప్రాంతంలో కొంతమంది మాజీ మావోయిస్టులకు కూడా అక్కడ పట్టాలు ఉన్నాయంటూ ఉద్దానం ప్రజలతో పాటు ప్రజాసంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఉజ్జుడుమెట్ట అమ్మకాల్లో మాజీమంత్రి హస్తం ఉందంటూ ఆయనతోపాటు వైసీపీ నాయకుడి పేరుతో మావోయిస్టులు హెచ్చరికలతో కూడిన కరపత్రాలు విడుదల చేశారు. తక్షణం స్పందించిన రాష్ట్రప్రభుత్వం చరణ్ గ్రూపునకు అక్కడ ఎటువంటి రియల్‌ఎస్టేట్లు నిర్వహించవద్దని ఆదేశించింది. దీంతో చదునుచేసిన ఈ భూమిని యథాతథంగా విడిచిపెడుతూ ఈ సంస్థ వెనుదిరిగింది. ఉజ్జుడుమెట్టపై రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులు అటువైపే చూడడం మానేశారు. కాగా ఇదే అదనుగా అక్రమార్కులు ఈ కొండపై కన్నేశారు. కొద్దిరోజుల క్రితం వరకూ రాజగోపాలపురం, లొద్దభద్ర అటవీప్రాంతానికి చెందిన కొండలు కొల్లగొట్టారు. ప్రస్తుతం వారంతా ఉజ్జుడుకొండపై పడ్డారు. నెల రోజుల నుంచి రాత్రి వేళ.. కంకర తవ్వకాలు చేపట్టి ట్రిప్పర్లతో తరలిస్తున్నారు. చదును చేసిన మెట్టప్రాంతమంతా మొత్తం గొయ్యిలు ఏర్పడ్డాయి. ఈ ప్రాంతమంతా కనీసం స్వరూపం లేకుండా పోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై తహసీల్దార్ టి.కళ్యాణచక్రవర్తిని వివరణ కోరగా తవ్వకాలు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. తాము ఎవరికీ తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.