పార్కు స్థలంలో అక్రమ నిర్మాణాలు
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:14 PM
పట్టణంలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. చెరువు గర్భాలు, పార్కు స్థలాలతో పాటు డ్రైనేజీ, సాగునీటి కాలువల స్థలాలను కూడా ఆక్రమించి కొందరు భారీ భవనాలు నిర్మిస్తున్నారు.
- నోటీసులు జారీచేసినా ఆగట్లే
-అధికారుల అండదండలు ఉన్నట్లు విమర్శలు
నరసన్నపేట, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. చెరువు గర్భాలు, పార్కు స్థలాలతో పాటు డ్రైనేజీ, సాగునీటి కాలువల స్థలాలను కూడా ఆక్రమించి కొందరు భారీ భవనాలు నిర్మిస్తున్నారు. సుడా అనుమతి గానీ పంచాయతీ అఽధికారుల అనుమతి గానీ తీసుకోవడం లేదు. నరసన్నపేట నడిబొడ్డున గల రాతి కర్ర చెరువులో అక్రమ నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పోస్టుమార్టం గది సమీపంలో కట్టడాలు చకచక సాగుతున్నాయి. ఈ స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగించి పార్కు ఏర్పాటుకు గత ప్రభుత్వ హయాంలో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రాంతంలో నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ కాలువ కూడా నిర్మించారు. అయితే, పంచాయతీకి పన్ను చెల్లిస్తున్నామని, పూర్వం నుంచి గేదెల పాకలు ఉన్నాయని చెప్పి కొందరు వ్యక్తులు ఈ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా నిర్మాణాలు చేపడుతున్నారు. వారి వెనుక అధికారులు ఉన్నారనే విమర్శలు ఉన్నాయి. నేషనల్ గ్రీన్ కోర్టు ఆదేశాల మేరకు ఏడాది కిందట రాతికర్ర చెరువులోని అక్రమ నిర్మాణదారులకు రెవెన్యూ, పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా ఆక్రమణలు మాత్రం ఆగడం లేదు. మారుతీనగర్ జంక్షన్‌లో ఎటువంటి అనుమతులు లేకుండా, మురికి కాలువను ఆక్రమించి ఓ వ్యక్తి భారీ భవంతిని నిర్మించారు. మారుతీనగర్-1లో ఓ వ్యాపారి వంశధార కాలువ స్థలాన్ని కబ్జా చేసి ఎవరూ వెళ్లకుండా గేటు కూడా ఏర్పాటు చేశాడు. ఆక్రమణదారులకు అధికారులు, అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై తహసీల్దార్ ఆర్.సత్యనారాయణను వివరణ కోరగా.. ‘అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వచ్చాయి. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పనులు నిలుపుదల చేశాం.’అని తెలిపారు.