Illegal structures : ‘ప్లాన్’ తప్పుతోంది
ABN , Publish Date - Aug 08 , 2025 | 11:54 PM
Irregularities with the role of officials and staff శ్రీకాకుళం నగరంలో ఆక్రమణలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. ఎక్కడ చూసినా నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు నిర్మాణాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఒకలా అనుమతి పొంది.. నిర్మాణాలు మరోలా చేస్తున్నారు.
శ్రీకాకుళం నగరంలో జోరుగా అక్రమ నిర్మాణాలు
అధికారులు, సిబ్బంది పాత్రతో అక్రమాలు
దృష్టి సారించని ఉన్నతాధికారులు
శ్రీకాకుళం క్రైం, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరంలో ఆక్రమణలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. ఎక్కడ చూసినా నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు నిర్మాణాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఒకలా అనుమతి పొంది.. నిర్మాణాలు మరోలా చేస్తున్నారు. కొంతమంది అధికారులకు ముడుపులు ఇస్తే చాలు.. అక్రమాలకు అనుగుణంగా ప్లాన్ మారిపోతుందన్న ఆరోపణలున్నాయి. శ్రీకాకుళం నగర పాలక సంస్థకు పాలకవర్గం లేకపోవడంతో అక్రమార్కులకు కలిసి వస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం 200 చదరపు గజాల స్థలంలో నిర్మించే భవనానికి విధిగా సెట్‌బ్యాక్ వదలాలి. ఇంటికి ముందు, వెనుక భాగాల్లో రెండు మీటర్లు, మిగతా రెండు వైపులా 1.5 మీటర్ల స్థలాన్ని వదలాలి. సెల్లారులోనే పార్కింగ్ స్థలం ఉండాలి. అయితే నిబంధనలను నూటికి 90శాతం మంది పాటించడం లేదు. సార్వత్రిక ఎన్నికల సమయంలో నగర పాలక ఉన్నతాధికారితోపాటు కీలక అధికారులు సుమారు రెండు నెలలు ఎలక్షన్ విధుల్లో బిజీబిజీగా గడిపారు. ఇదే అదునుగా పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు, సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ నిర్మాణాలపై పర్యవేక్షణ చేయాల్సిన ప్లానింగ్ సెక్రటరీ, చైన్‌మెన్లు, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్లపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదనపు ప్లోర్‌కు, అనుమతి లేని నిర్మాణాలకు రూ.2 లక్షలు వరకు డిమాండ్ చేస్తున్నారన్న సమాచారం. ముడుపులు ఇస్తే నిర్మాణాలను సజావుగా సాగనిస్తారు. లేదంటే ఏదో ఒక రకంగా కొర్రీపెట్టి ఆపేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఎక్కువ మంది ఆ ధీమాతోనే..
గతంలో టీడీపీ ప్రభుత్వం అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రూ.700కోట్లు ఆదాయం వచ్చేలా చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కచ్చితంగా అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరిస్తుందనే నమ్మకంతో అక్రమ నిర్మాణదారులు ఉన్నారు. ఇటీవల మంత్రి నారాయణ కూడా ప్లాన్లకు మించి అదనపు శ్లాబ్ నిర్మాణాలు చేసిన వాటిని నిబంధనలకు అనుగుణంగా క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇదే అదునుగా శ్రీకాకుళంలో చాలామంది అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఏడాది కిందట నిర్మించిన వాటిని పునఃపరిశీలించి తర్వాతే క్రమబద్ధీకరిస్తారన్న విషయాన్ని మరచిపోతున్నారు.
కఠిన చట్టాలు తీసుకొచ్చినా...
కూటమి ప్రభుత్వం టౌన్ ప్లానింగ్ విషయంలో ఎన్నో రకాల సంస్కరణలు తీసుకొచ్చింది. కొత్త విధానం వల్ల పట్టణాల్లో ప్రతి బిల్డింగ్ నిర్మాణానికి నిబంధనలు పాటించాలి. తప్పు జరిగిందా...?యజమాని, ప్లానర్‌పై ఇద్దరిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. ఉదాహరణకు 300 స్క్వేర్ మీటర్‌లో భవన నిర్మాణం గతంలో చేసుకుంటే కొంత సడలింపు ఉండేది. మార్టుగేజ్ ఉండడంతో చిన్న చిన్న తేడాలు ఉన్నా పెద్దగా పట్టించుకొనేవారు కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కొత్త జీవో ప్రకారం నిబంధనలు అతిక్రమించారని గుర్తిస్తే కేసుల్లో ఇరుక్కోవాల్సిందే. ప్లానర్‌కు ఐదేళ్ల వరకు లైసెన్స్ రద్దు అవుతుంది. స్థల యజమానిపై కేసు నమోదు చేస్తారు. సడలింపు లేకపోవడంతో ఇళ్ల నిర్మాణం కష్టమంటున్నారు. గతంలో టౌన్‌ప్లానింగ్ అధికారులు ప్లాన్ ఇచ్చేవారు. ఇప్పుడు ఎల్‌టీపీలదే కావడంతో భయపడాల్సి వస్తోంది. ఎకరం లోపు అపార్ట్‌మెంట్ విషయంలోనూ ఇదే పరిస్థితి. జీ ప్లస్-5కు గతంలో టౌన్‌ప్లానింగ్ ఆర్డీ పరిశీలించి ఆమోదం తెలిపినా ఏమైనా అభ్యంతరాలుంటే మార్పులు చేసి ప్లాన్ ఇచ్చేవారు. ఇప్పుడది ఉండదు. అంతా ఎల్‌టీపీలదే బాధ్యత. స్థలానికి సంబంధించి ఎవరైనా కేసులు ఉన్నట్టు ఫిర్యాదు చేస్తే సంబంధిత యజమానిపై, ప్లానర్‌పై కేసులు నమోదు చేస్తారు. అయినా సరే అ క్రమాలకు చెక్ పడకపోవడం గమనార్హం.
దృష్టి సారించాం
శ్రీకాకుళంలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించాం. టౌన్‌ప్లానింగ్ అధికారులను సైతం అప్రమత్తం చేశాం. ఎటువంటి అ క్రమాలు జరగకుండా చూస్తాం. అవసరమైతే కేసులు నమోదు చేస్తాం. అపరాధ రుసుంను వసూలు చేస్తాం. ఈ విషయంలో అవసరమైతే రెవెన్యూ అధికారుల సహకారం తీసుకుంటాం.
- పీవీవీడీ ప్రసాదరావు, కమిషనర్, శ్రీకాకుళం నగరపాలక సంస్థ