రేషన్ కావాలంటే.. 6 కిలోమీటర్లు వెళ్లాల్సిందే
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:29 PM
ration problems రేషన్ సరుకుల కోసం గిరిజనులకు ఇబ్బందులు తప్పడం లేదు. హిరమండలం మండలంలోని లోకొండ గిరిజన పంచాయతీ ప్రజలు రేషన్ సరుకులు కావాలంటే ఆరు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లోకొండ గిరిజన పంచాయతీ ప్రజలకు తప్పని ఇబ్బందులు
గ్రామంలోనే సరుకులు అందజేయాలని డిమాండ్
హిరమండలం, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): రేషన్ సరుకుల కోసం గిరిజనులకు ఇబ్బందులు తప్పడం లేదు. హిరమండలం మండలంలోని లోకొండ గిరిజన పంచాయతీ ప్రజలు రేషన్ సరుకులు కావాలంటే ఆరు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలోనే సరుకులు అందజేయాలంటూ ఆదివారం లోకొండలో గిరిజనులు నిరసన చేపట్టారు. లోకొండ పంచాయతీలో లోకొండ, మామిడిజోల, ముగడపేట, గోడిపాడు, పూలకొండ, తాళ్ళపాడు, లింగుపురం గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకు చెందిన కార్డుదారులు రేషన్ సరుకుల కోసం భగీరథపురం వెళ్లాల్సి వస్తోంది. తమకు ఆరు కిలోమీటర్ల దూరంలో భగీరథపురానికి వెళ్లాలంటే నానా అగచాట్లు పడుతున్నామని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. ఆటోచార్జీల భారం తప్పడం లేదని పేర్కొంటున్నారు. తమ గ్రామాల్లోనే సబ్‌డిపోలు ఏర్పాటు చేసి రేషన్ సరుకులు పంపిణీ చేయాలని అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.