పనిచేయడం ఇష్టంలేకపోతే వెళ్లిపోండి
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:02 AM
GGH Review meeting ‘ఆసుపత్రికి వచ్చే రోగులు ఆనందంగా బయటకు వెళ్లాలి. ఇదే ప్రభుత్వ లక్ష్యం. అన్ని విభాగాల్లో సీనియర్ వైద్యులు సేవలందించాల్సిందే. పని చేయడం ఇష్టంలేకపోతే బయటకు వెళ్లిపోండి’ అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్- రిమ్స్) అధికారులు, వైద్యులు, సిబ్బందిని హెచ్చరించారు.
అన్ని విభాగాల్లో సీనియర్ వైద్యులు సేవలందించాల్సిందే
నిర్లక్ష్యం కనిపిస్తే ఉపేక్షించేది లేదు
ఖాళీల భర్తీకి తక్షణ చర్యలు
24 గంటల్లో లిఫ్ట్‌లు పనిచేయాలి
జీజీహెచ్ సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం
రూ.40 లక్షల వైద్యపరికరాలు ప్రారంభం
అరసవల్లి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ‘ఆసుపత్రికి వచ్చే రోగులు ఆనందంగా బయటకు వెళ్లాలి. ఇదే ప్రభుత్వ లక్ష్యం. అన్ని విభాగాల్లో సీనియర్ వైద్యులు సేవలందించాల్సిందే. పని చేయడం ఇష్టంలేకపోతే బయటకు వెళ్లిపోండి’ అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్- రిమ్స్) అధికారులు, వైద్యులు, సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్, ప్రసూతి విభాగాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తితో కలిసి ఆయన పరిశీలించారు. రూ.40లక్షల విలువైన లాప్రోస్కోపిక్, హిస్టెరోస్కోపిక్ పరికరాలను ప్రారంభించారు. ఈ పరికరాలతో గర్భసంచి లోపల సమస్యలను గుర్తించడం, చికిత్సలు అందించడం సాధ్యపడుతుందని వైద్యులు వివరించారు. తొలుత ఓపీ విభాగానికి చేరుకుని అక్కడ రోగులతో మాట్లాడారు. ఓపీలో రోగులు వేచిఉండే సమయాన్ని తగ్గించేందుకు సిబ్బందికి ట్యాబ్‌లను పంపిణీ చేశారు. అనంతరం వైద్య కళాశాల ఆడిటోరియంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రి అధికారులు, వైద్యులు, సిబ్బంది సేవలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘నేను ఆసుపత్రిలో పర్యటించాను. పారిశుధ్య నిర్వహణ పరిస్థితి బాగాలేదు. నేను వచ్చానని పరిశుభ్రంగా ఉంచారు. సిబ్బంది కొరత లేదు. మరి ప్రతిరోజూ ఎందుకు ఇలా పరిశుభ్రంగా ఉంచడంలేదు. ఆసుపత్రి అధికారిగా చేరి ఆరు నెలలు కావస్తున్నా సరే జాయింట్ డైరెక్టర్ ఇంతవరకు ఏం చేశారో తెలియడం లేదు. ఇలాగేనా పనిచేసేది. ఆసుపత్రి అవసరాలకు సంబంధించి ఇంతవరకూ ఏమీ అడగలేదు. ఇక్కడ సమస్యలేమీ లేవా?. ఇలా పనిచేస్తే ఆసుపత్రి ఎలా అభివృద్ధి చెందుతుంది.? ఏం చేస్తున్నారు మీరంతా. ఆరు నెలలుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ సరిగా విధులకు హాజరు కావడం లేదు. ఎవరైనా సరే సేవలందించాలనుకుంటేనే ఇక్కడ పనిచేయండి. లేదంటే వెళ్లిపోండి. వైద్యులు, సిబ్బంది ఎందుకు రోస్టర్ పాటించడం లేదు. క్యాజువాలిటీ, అత్యవసర విభాగాల్లో జూనియర్ వైద్యులే సేవలందిస్తున్నారు. సీనియర్ వైద్యులు సేవలందించరా?. ఇకనుంచి ఇలా జరగడానికి వీల్లేదు. సీనియర్ వైద్యులు పని చేయాల్సిందే. రిఫరల్ కేసుల సంఖ్య పెరగకుండా తక్షణ చర్యలు తీసుకోండి. ప్రసవాలు, శస్త్రచికిత్సల సంఖ్య పెరగాలి. ఎప్పుడు చూసినా ఆసుపత్రి లిఫ్టులు పనిచేయవు. ఏం చేస్తున్నారు. 24 గంటల్లో లిఫ్టులు పనిచేసేలా చర్యలు తీసుకోండి. మినిట్స్ బుక్ లేకుంటే అభివృద్ధి వివరాలు, గత ఏడాదిగా ఏం చేస్తున్నారో ఎలా తెలుస్తుంది. రోగులకు అందించే ఆహారం మెనూ వివరాలను ప్రతి వార్డులో ప్రదర్శించాలి. గత 18 నెలల్లో రూ.80లక్షల విలువైన పరికరాలు ఆసుపత్రికి అందజేశాం. మరిన్ని అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రణాళికలు తయారుచేసి, వివరాలు అందజేయండి’ అని మంత్రి అచ్చెన్న స్పష్టం చేశారు.
రూ.60కోట్లతో హాస్టల్, లైబ్రరీ భవనాలు పూర్తయ్యాయని, రూ.2కోట్లు విలువైన ఫర్నీచర్ లేక 2023 నుంచి ఈ భవనాలు ప్రారంభానికి నోచుకోలేదని ఆసుపత్రి జేడీ తెలుపగా.. రూ.2కోట్ల నిధుల మంజూరుకు తక్షణ చర్యలు చేపడతామని మంత్రి అన్నారు. ఆసుపత్రిలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఏపీఎంఐడీసీ డీఈని ఆదేశించారు. నిధులను అందజేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఎమర్జెన్సీ విభాగంలో బెడ్లు సరిపోవడం లేదని, సంఖ్యను పెంచాలని విభాగాధిపతి కోరగా.. వెంటనే అందుకు సంబంధించిన వివరాలను అందజేయాలని అచ్చెన్న అన్నారు. సెక్యూరిటీ సిబ్బంది యూనిఫామ్స్ ధరించాలని, సమీక్ష సమావేశాల మినిట్స్‌ను తదుపరి సమావేశంలో అందజేయాలని, వైద్యులు, సిబ్బంది ఖాళీల భర్తీకి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆసుపత్రి జాయింట్ డైరెక్టర్ రాజశేఖర్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పలనాయుడు, వివిధ విభాగాల అధిపతులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.