Share News

తీరు మార్చుకోకుంటే వేటు తప్పదు: డీఎం

ABN , Publish Date - Dec 27 , 2025 | 12:30 AM

మిల్లు యజ మానులు ధాన్యం తూకంలో దోపిడీని ఆపకపోతే వేటు తప్పదని జిల్లా సివిల్‌ సప్లయిస్‌ డీఎం టి.వేణు గోపాల్‌ హెచ్చరిం చారు.

తీరు మార్చుకోకుంటే వేటు తప్పదు: డీఎం
సమావేశంలో మాట్లాడుతున్న డీఎం వేణుగోపాల్‌

కొత్తూరు, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): మిల్లు యజ మానులు ధాన్యం తూకంలో దోపిడీని ఆపకపోతే వేటు తప్పదని జిల్లా సివిల్‌ సప్లయిస్‌ డీఎం టి.వేణు గోపాల్‌ హెచ్చరిం చారు. శుక్రవారం కొత్తూరు మండలంలో నివగాం, వెంకటాపురం, బమ్మిడి మిల్లులను, వసప ఆర్‌ఎస్‌కే కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో మిల్లు యజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ శివదుర్గా రైసు మిల్లులో రికార్డులు, బిల్లుల కంటే అధికంగా ధాన్యం నిల్వలు ఉన్నాయని... వెంకటాపురంలో తక్కువ నిల్వలు ఉన్నాయని గుర్తించినట్టు చెప్పారు. శివదుర్గా రైసుమిల్లు యజమానికి నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. రైతుల నుంచి తూకంలో 5 నుంచి 8 కేజీలు మిల్లు యజమానులు దోపిడీ చేస్తున్నట్టు రైతుల నుంచి ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. తీరు మార్చుకోకుంటే వేటు తప్పదన్నారు. ఆర్‌ఎస్‌కేలలో ధాన్యం కొనుగోలుపై రైతుల్లో కనీస అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది ప్రయత్నించటం లేదన్నారు. దీనితో రైతులు దళారులకు అమ్ముతున్నట్టు గుర్తించామని తెలిపారు.

పర్యవేక్షణ లేనందునే..

రెవెన్యూ, వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ లేనందునే ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని గుర్తించామన్నారు. జిల్లాలో 6.50 లక్షల క్వింటాల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 3.24 లక్షల క్వింటాల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఆంధ్ర నుంచి ఒడిశాకు బియ్యం అక్రమ రవాణా నివారణకు కొత్తూరు మండలం మాతల, మెళియాపుట్టి వసుంధర, ఇచ్చాపురం మండలం పురుషోత్తపురం వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు.

Updated Date - Dec 27 , 2025 | 12:30 AM