Share News

వ్యాపారం చేయలేకుంటే మిల్లులను మూసేయండి

ABN , Publish Date - Dec 23 , 2025 | 11:58 PM

Bank guarantee is mandatory within 48 hours. ‘ధాన్యం సేకరణకు ముందస్తుగా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసుకోవాలి. వ్యాపారం చేయలేమనుకుంటే మిల్లులను మూసేయాల’ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మిల్లర్లను హెచ్చరించారు.

వ్యాపారం చేయలేకుంటే మిల్లులను మూసేయండి
మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

48 గంటల్లో బ్యాంకు గ్యారెంటీ తప్పనిసరి

లేదంటే ధాన్యం కేటాయింపులు నిలిపివేత

మంత్రి కె.అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి) : ‘ధాన్యం సేకరణకు ముందస్తుగా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసుకోవాలి. వ్యాపారం చేయలేమనుకుంటే మిల్లులను మూసేయాల’ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మిల్లర్లను హెచ్చరించారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో రైస్‌ మిల్లర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఈ మేరకు కఠిన ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో మొత్తం 269 రైస్‌ మిల్లులు ఉండగా.. వాటిలో 211 మిల్లులు ఇప్పటికీ బ్యాంకు గ్యారంటీలు సమర్పించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. 48 గంటల్లోగా బ్యాంకు గ్యారెంటీ సమర్పించని మిల్లులకు ధాన్యం అలాట్‌మెంట్‌ నిలిపివేస్తామని హెచ్చరించారు. ‘వ్యాపారం చేయలేమనుకుంటే మిల్లులు మూసేయండి. నష్టం వస్తుందంటే ధాన్యం కొనుగోలు చేయకండి. కానీ రైతులను మాత్రం ఇబ్బంది పెట్టొద్దు. రైతుల సంక్షేమమే ప్రభుత్వానికి ప్రాధాన్యం. ధాన్యం సేకరణ ప్రక్రియలో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు. బ్యాంకు గ్యారెంటీ లేకుంటే ఆన్‌లైన్‌లో ధాన్యం కేటాయింపులు కనిపించవు. రైతుల నుంచి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉండదు. రైతులకు 24 గంటల్లోగా ధాన్యం నగదు చెల్లింపుల కోసం ప్రభుత్వం రూ.12 వేల కోట్లను సిద్ధం చేసింది. మిల్లర్ల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రక్రియకు ఆటంకం కలగకూడద’ని మంత్రి అచ్చెన్న సూచించారు.

తూకంలో మోసాలు చేస్తే కఠినచర్యలు..

రైతుల నుంచి ధాన్యం కొనుగోలు సమయంలో క్వింటాల్‌కు 7-8 కిలోల వరకు తరుగు పేరుతో కోత జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు మొత్తం వ్యవస్థకే మచ్చ తెస్తాయన్నారు. ధాన్యం సేకరణలో అవకతవకలను అరికట్టేందుకు మూడు డివిజన్‌ కేంద్రాల్లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తూకంలో తేడాలు ఉంటే రైతులు నేరుగా ఆర్డీవో కార్యాలయాల్లోని టోల్‌ ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. 24 గంటల్లో తనిఖీ చేసి తప్పు తేలితే సంబంధిత మిల్లులపై కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ.. బ్యాంకు గ్యారెంటీల సమర్పణలో ఏమైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని మిల్లర్లకు సూచించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ కొన్ని మండలాల నుంచి ఇంకా గ్యారెంటీలు రాకపోవడాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యే గొండు శంకర్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ పృథ్వీరాజ్‌కుమార్‌, సివిల్‌ సప్లయ్‌ డీఎం వేణుగోపాల్‌, ఆర్డీవోలు సాయిప్రత్యూష, కృష్ణమూర్తి, వెంకటేష్‌, ఎల్‌డీఎం శ్రీనివాస్‌, రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 11:58 PM