Share News

ఇలాచేస్తే.. ప్లాస్టిక్‌ నిర్మూలన సాధ్యమే

ABN , Publish Date - Dec 25 , 2025 | 12:11 AM

ప్లాస్టిక్‌ను నిర్మూలించడం సాధ్యమేనా? అంటే సాధ్యమేనని అంటున్నారు నిపుణులు.

ఇలాచేస్తే.. ప్లాస్టిక్‌ నిర్మూలన సాధ్యమే
పలాస-కాశీబుగ్గ ప్రధాన రహదారిపై చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలు

- ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలి

- ఇంటికి వచ్చే పారిశుధ్య సిబ్బందికి చెత్తను అందించాలి

-ప్లాస్టిక్‌ తయారీ, అమ్మకాలు, వినియోగం తగిస్తేనే ఫలితాలు

- జనవరి 26 నాటికి ఇక రోడ్లపై చెత్త కనిపించకూడదు. ఫ్రీ ప్లాస్టిక్‌ ఏపీగా చేయడమే ముఖ్య లక్ష్యంగా పనిచేస్తాం. ఇళ్లల్లో కూడా వర్మీ కంపోస్టు తయారు చేసుకొని ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాల నుంచి కూడా సంపద సృష్టించుకోవాలి.

- ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన ప్రకటన ఇది.

పలాస, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్‌ను నిర్మూలించడం సాధ్యమేనా? అంటే సాధ్యమేనని అంటున్నారు నిపుణులు. విచ్చలవిడిగా తయారీ, అమ్మకాలు, వినియోగం తగ్గిస్తే ప్లాస్టిక్‌ను పూర్తిగా అరికట్టవచ్చని అభిప్రాయపడుతున్నారు. జిల్లాలోని పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలస మునిసిపాలిటీలతో శ్రీకాకుళం నగరపాలక సంస్థ నుంచి ప్రతిరోజూ సేకరిస్తున్న చెత్త 200 టన్నుల వరకూ ఉంటుంది. అందులో ఒక్క ప్లాస్టికే 20 టన్నుల వరకూ ఉంటుందంటే వాటి వినియోగం ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల ద్వారా ప్రతినెలా మూడో శనివారం అధికారులు, సిబ్బంది ర్యాలీలు నిర్వహించడంతో పాటు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్లాస్టిక్‌తో కలిగే అనర్థాలను వివరిస్తున్నారు. ఇవి చాలాచోట్ల సత్ఫలితాలు ఇస్తున్నాయి. కానీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్లాస్టిక్‌ లేకుంటే పనే జరగదనట్లు కొందరు వ్యవహరిస్తుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

లక్ష్యం నెరవేరేనా?

2026 జనవరి 26 నాటికి రోడ్లపై చెత్త అనేది కనిపించకూడదనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ, ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. మునిసిపాలిటీల్లో పేరుకుపోతున్న చెత్తకు పరిష్కారమార్గం కనిపించడం లేదు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చెత్తను తరలించాల్సి వస్తోంది. వాస్తవానికి చెత్త నుంచి సంపద సృష్టించాలని గతంలో అనేకమార్లు అధికారులు ప్రకటించినా అది కార్యరూపం దాల్చడం లేదు. సంపద సృష్టి అటుంచితో రోడ్లపై చెత్త నిల్వలు పేరుకుపోతుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో చెత్తనుంచి సంపదను సృష్టించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం వద్ద ఉన్న జిందాల్‌ కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ కంపెనీ చెత్తనుంచి వ్యర్థాలను వేరు చేసి విద్యుత్‌ తయారీకి వినియోగించే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. దీంతో అనేక మునిసిపాలిటీలు చెత్తను ఉదారంగా ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందులో పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ ముందంజలో ఉంది. కోసంగిపురం డంపింగ్‌ యార్డు వద్ద చెత్త నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను వేరు చేసే యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ యంత్రం ద్వారా టన్నుల కొద్ది చెత్తను తొలగించి జిందాల్‌ కంపెనీకి అవసరమయ్యే వ్యర్థాలను తరలించారు. మునిసిపాలిటీలు, పెద్ద పంచాయతీల్లో ఇప్పటికే ఇంటింటా చెత్తను సేకరిస్తున్నారు. ప్రభుత్వం నుంచే కాకుండా ఇళ్లల్లో కూడా వర్మీ కంపోస్టు తయారు చేసుకొని ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాల నుంచి కూడా సంపద సృష్టించుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని పట్టణాలు, గ్రామాల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తోంది. వచ్చే ఏడాది జనవరి నాటికి రాష్ట్రంలో ప్రతి ఇంటిలో ఇటువంటివి ఏర్పాటు చేసి చెత్త నుంచి విముక్తి పొందాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం మునిసిపాలిటీల్లో కొత్తగా చెత్త సంపద కేంద్రాలను ఏర్పాటు చేసింది. తడి-పొడి చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్‌ వ్యర్థాలను వేరు చేసి వాటిని అమ్మకం ద్వారా ఆదాయం పొందడంపై దృష్టి సారించింది. కొన్ని పట్టణాల్లో డ్వాక్రా సంఘాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. సంచార షాపులకు ప్లాస్టిక్‌ వ్యర్థాలను ప్రజలు అందిస్తే వారి ఇంటికి కావాల్సిన సామాగ్రి ఇవ్వడం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల్లో ఆలోచన విధానం మారాల్సి ఉంది. కాలువలు, రోడ్లపై చెత్త వేయకుండా ఇంటికి వచ్చే పారిశుధ ్య కార్మికులకు వాటిని అందిస్తే ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది.

ప్రతిరోజూ సేకరించే చెత్త, ప్లాస్టిక్‌ (టన్నుల్లో)

మునిసిపాలిటీ చెత్త ప్లాస్టిక్‌

పలాస-కాశీబుగ్గ 30 10

ఇచ్ఛాపురం 18 4

ఆమదాలవలస 15 3

శ్రీకాకుళం కార్పొరేషన్‌ 100 35

ప్లాస్టిక్‌ రహిత సమాజానికి కృషి

చెత్త రహిత మునిసిపాలిటీగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే రహదారులు, కాలువల్లో చెత్తను ఏరివేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇంటింటా చెత్త సేకరణకు ప్రత్యేక సిబ్బందిని నియమించాం. పర్యవేక్షులుగా సచివాలయ పారిశుధ్య సిబ్బందిని ఏర్పాటు చేశాం. ఇంటింటికీ వచ్చే చెత్త వాహనాలకు స్వచ్ఛందంగా చెత్తను ఇవ్వాలని ప్రజలకు మనవి చేస్తున్నాం. ప్లాస్టిక్‌ అమ్మకాలు, వినియోగం అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్లాస్టిక్‌ రహిత సమాజానికి కృషి చేస్తాం.

ఇ.శ్రీనివాసులు, కమిషనర్‌, పలాస-కాశీబుగ్గ

Updated Date - Dec 25 , 2025 | 12:11 AM