ఇలాగైతే పాలన ఎలా?
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:11 AM
:పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో పూర్తిస్థాయి సిబ్బంది లేరు. కేవలం జూనియర్ అసిస్టెంట్లు, తాత్కాలిక సిబ్బంది, సచివాలయ సిబ్బందితో పాలన నెట్టుకొస్తున్నారు.
- పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో కీలకమైన పోస్టులు ఖాళీ
- జూనియర్ అసిస్టెంట్లు, తాత్కాలిక సిబ్బందితోనే నెట్టుకొస్తున్న వైనం
పలాస, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి):పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో పూర్తిస్థాయి సిబ్బంది లేరు. కేవలం జూనియర్ అసిస్టెంట్లు, తాత్కాలిక సిబ్బంది, సచివాలయ సిబ్బందితో పాలన నెట్టుకొస్తున్నారు. కొత్త నియామకాలు చేపట్టాల్సింది పోయి ఉన్న సిబ్బందిని డిప్యూటేషన్ పేరుతో పొరుగు మున్సిపాలిటీలకు పంపిస్తుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ కొత్తగా సిబ్బందిని నియమిస్తున్నా వివిధ కారణాలతో ఇక్కడకు వచ్చేందుకు వారు ఇష్టపడడం లేదు. గ్రేడ్-2 మున్సిపాలిటీగా జిల్లాలోనే పలాస-కాశీబుగ్గ అగ్రస్థానం పొందింది. సుమారు లక్షకు పైగా జనాభా ఉన్న పురపాలకసంఘంలో పనిచేయడానికి తగినంతగా ఉద్యోగులు లేరు. మున్సిపాలిటీకి గుండెకాయలాంటి టౌన్ ప్లానింగ్, రెవెన్యూ కార్యాలయాల్లో ప్రధాన అధికారులు లేరు. ఎంతో ముఖ్యమైన మేనేజర్ పోస్టు సైతం ఖాళీగా ఉంది. ఇద్దరు టౌన్‌ప్లానింగ్ అధికారులు, నలుగురు టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ అధికారులు ఉండాలి. కానీ, ఒక్కరు కూడా లేకపోవడంతో తాత్కాలిక సిబ్బంది, సచివాలయ టౌన్‌ప్లానర్లతో పాలన కొనసాగించాల్సి వస్తోంది. ఫలితంగా కొత్త భవనాలకు అనుమతులు తీసుకోవడానికి నిర్మాణదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండు రోజుల్లో కావాల్సిన పని 15 రోజులవుతుందని వారు ఆవేదన చెందుతున్నారు. మేనేజర్, రెవెన్యూ అధికారి, శానటరీ ఇన్‌స్పెక్టర్, ముగ్గురు ఇంజనీర్లు, ఇద్దరు అకౌంటెంట్లు, జూనియర్ అకౌంట్ అధికారి మొత్తం కలిపి 15 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. ప్రస్తుతం జూనియర్ అసిస్టెంట్లనే డిప్యుటేషన్‌పై నియమించి పనులు చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పారిశుధ్య సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. వందమందికి పైగా సిబ్బంది ఉండాల్సిన స్థానంలో కేవలం 67 మందితో పని చేయిస్తున్నారు. కొత్తగా నియమకాలు చేపట్టాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
భర్తీ ఎప్పుడో?
గత వైసీపీ ప్రభుత్వంలో పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో ఎలాంటి కొత్త నియామకాలు చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతైనా పరిస్థితి మారుతుందని అంతా భావించారు. అయితే, ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినా ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదు. పైగా ప్రధాన శాఖల్లోని పలువురి సిబ్బంది వివిధ కారణాలతో బయటకు వెళ్లిపోతున్నారు. మరోపక్క మునిసిపాలిటీలో జరిగే అభివృద్ధి పనులపై స్థానికులు ఫిర్యాదులు చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఇక్కడ అభివృద్ధిపై పొరుగు రాష్ట్రం తెలంగాణకు చెందిన వారు కూడా ఫిర్యాదు చేస్తుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఫలితంగా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోగా, కొత్తగా విధుల్లో చేరడానికి సిబ్బంది సైతం ముఖం చాటేస్తున్నారు. ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితిపై ఎమ్మెల్యే గౌతు శిరీష ఇటీవల ఉన్నతాధికారులను కలిసి మాట్లాడారు. ఫిర్యాదులు పక్కన ఉంచి కొత్త నియామకాలు, పనులు జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరినా ఫలితం శూన్యం. ఇప్పటికైనా మునిసిపాలిటీని గాడిన పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.