Share News

గేటు పడితే నరకమే

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:28 PM

No.. Railway flyover works జిల్లాలో రైల్వేఫ్లైఓవర్‌ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 12 చోట్ల వంతెన నిర్మాణానికి రైల్వే అధికారులు ఈ ఏడాది మార్చిలో సన్నాహాలు చేశారు. కానీ, తర్వాత వాటి ఊసే మరచిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

గేటు పడితే నరకమే
ఇచ్ఛాపురం రైల్వే ఎల్‌సీ గేటు వద్ద వాహనదారుల ఇబ్బందులు

  • ప్రారంభానికి నోచుకోని రైల్వే ఫ్లైఓవర్ల పనులు

  • పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలకు తప్పని ఇబ్బందులు

  • ఇచ్ఛాపురం, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైల్వేఫ్లైఓవర్‌ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 12 చోట్ల వంతెన నిర్మాణానికి రైల్వే అధికారులు ఈ ఏడాది మార్చిలో సన్నాహాలు చేశారు. కానీ, తర్వాత వాటి ఊసే మరచిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. రైల్వే గేటు పడితే చాలు.. నిరీక్షణతోపాటు ట్రాఫిక్‌ నిలిచిపోయి అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల ప్రజలకు రైల్వేగేట్లు నరకయాతన చూపిస్తున్నాయి. ఇచ్ఛాపురం పట్టణాన్ని వేరుచేస్తూ ఉంటుంది రైల్వేలైన్‌. సగం పట్టణం రైల్వేలైన్‌ అవతల ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇచ్ఛాపురంలో రైల్వేగేటు పడిందంటే చాలు ట్రాఫిక్‌ నిలిచిపోతుంది. ముఖ్యంగా రత్తకన్న గేటు నరకం చూపిస్తోంది. రైల్వేస్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉండడంతో నిత్యం ఈ గేటు వేసి ఉంటుంది. దీంతో అటువైపుగా రాకపోకలు సాగించేవారు పడే బాధలు అన్నీఇన్నీకావు. పురుషోత్తపురం, జగన్నాథపురం గేట్లు కూడా నరకయాతన చూపిస్తుంటాయి.

  • పలాస-కాశీబుగ్గ పట్టణ ప్రజలు వెళ్లాలంటే కాశీబుగ్గ సమీపంలోని ఎల్‌సీ గేటును దాటాల్సి ఉంటుంది. అటు వజ్రపుకొత్తూరు వెళ్లాలంటే తాళ్లభద్ర ఎల్‌సీ గేటు దాటాలి. ఈ రెండు గేట్లు పలాస రైల్వేస్టేషన్‌కు అటు ఇటుగా ఉంటాయి. దీంతో రైలు నిలిచినా.. గేటు అలానే మూసి వేసి ఉంటోంది. ఇప్పుడు కాశీబుగ్గ గేటు వద్ద వంతెన పనులు ప్రారంభం కావడంతో కొంతమ ఉపశమనం కలుగనుంది.

  • మందస మండల ప్రజలకు కొర్రాయిగేటు, బాలిగాం, కొత్తపల్లి గేట్లు నరకయాతన చూపిస్తుంటాయి. సోంపేట మండలంలో పాలవలస, కొర్లాం గేట్ల వద్ద నిత్యం అదే పరిస్థితి. కంచిలి మండలానికి సంబంధించి బూరగాం, అంపురం, గొల్ల కంచిలి రైల్వేగేటు నిత్యం ప్రజలకు యాతన తప్పదు.

  • రైల్వేజోన్‌లో అన్యాయం..

  • ఇటీవల రైల్వేశాఖ విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్‌ ప్రకటించింది. ఉత్తరాంధ్ర ప్రాంతమంతా ఈ జోన్‌ పరిధిలోకి వచ్చింది. కానీ పలాస-ఇచ్ఛాపురం స్టేషన్ల మధ్య ఉన్న 49 కిలోమీటర్లను మాత్రం భువనేశ్వర్‌ కేంద్రంగా ఉన్న ఈస్టుకోస్టు రైల్వేజోన్‌లో వదిలేసింది. దీంతో రెండు నియోజకవర్గాల ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారు. వాస్తవానికి హైవేల ఆధునికీకరణ ప్రక్రియ పూర్తయింది. ప్రధాన పట్టణాలను తప్పిస్తూ హైవేల నిర్మాణం జరిగింది. హైవే ఆధునికీకరణలో భాగంగా రైల్వేలైన్‌ ఉన్నచోట ఫ్లైఓవర్‌ నిర్మించారు. పట్టణాలకు ఉన్న రోడ్లలో మాత్రం రైల్వేగేట్లు ఉండిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పటికైనా ఫ్లైఓవర్ల పనుల విషయమై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రైల్వేశాఖ ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరముంది.

  • ఇబ్బందులే

  • రైల్వేగేట్లతో నరకయాతన పడుతున్నాం. ఇచ్ఛాపురం పట్టణానికి వెళ్లాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. దశాబ్దాలుగా వంతెన నిర్మాణం కలగానే మిగులుతోంది. ఆ మధ్యన ఫ్లైఓవర్‌ అంటూ హడావుడి చేశారు. కానీ తరువాత దాని గురించి మరిచిపోయారు. దీనిపై పాలకులు చొరవచూపాలి.

    - సాలిన డిల్లీ, ఇచ్ఛాపురం

  • చాలా అన్యాయం

  • ఇటీవల విశాఖ రైల్వేజోన్‌లో ఈ ప్రాంతాన్ని కలపకుండా చాలా అన్యాయం చేశారు. కనీసం ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడితే ట్రాఫిక్‌ ఇబ్బందులు తీరుతాయి. ఈ విషయంలో రైల్వేశాఖపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి పెంచాలి.

    - సాలిన గాంధీ, ఇచ్ఛాపురం

Updated Date - Nov 16 , 2025 | 11:28 PM