వరదొస్తే ఆగిపోవాల్సిందే!
ABN , Publish Date - Aug 01 , 2025 | 12:19 AM
భారీ వర్షాలు కురిస్తే చాలు కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలోని సీతన్నపేట గెడ్డ పాత వంతెనపైకి నీరు వచ్చేస్తుంది.
- సీతన్నపేట గెడ్డ పాత వంతెనపైకి ప్రవహిస్తున్న నీరు
- రెండు మండలాలకు నిలిచిపోతున్న రాకపోకలు
- 20 గ్రామాల ప్రజలకు తప్పని తిప్పలు
- కొత్త బ్రిడ్జి కోసం ఎదురుచూపు
కోటబొమ్మాళి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలు కురిస్తే చాలు కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలోని సీతన్నపేట గెడ్డ పాత వంతెనపైకి నీరు వచ్చేస్తుంది. సుమారు 80 ఏళ్ల కిందట నిర్మించిన వంతెన కావడం, ఆక్రమణలతో గెడ్డ కుచించుకుపోవడం వంటి కారణా లతో భారీ వర్షాల సమయంలో వరద వంతెనపై నీరు ప్రవహిస్తుంది. దీంతో కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ఈ సమయంలో సుమారు 20 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. కొత్త వంతెన నిర్మిస్తేనే తమ కష్టాలు తీరుతాయని వారు అంటున్నారు.
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రోడ్డు ఎంతో ప్రధానమైనది. ఈ రోడ్డు గుండా సంతబొమ్మాళి మండలంలోని సంతబొమ్మాళి, గోదాయవలస, శివరాంపురం, నర్సాపురం, యర్నాగులపేట, కోటబొమ్మాళి మండలంలోని దుర్గంపేట, ఉప్పరపేట, సీతన్నపేట, ఊడికలపాడు, వరహాలమ్మపేట తదితర 20 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రహదారి మధ్యలో సీతన్నపేట గెడ్డ వద్ద పురాతన వంతెన ఉంది. ప్రతీ ఏడాది కురిసిన భారీ వర్షాలకు రెండు మూడు రోజుల పాటు ఈ వంతెనపై వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ సమయంలో రెండు మండలాల పరిధిలోని 20 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద కారణంగా మండల కేంద్రాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నిసార్లు ప్రమాదమని తెలిసినా కొందరు విధిలేక వరద నీటిలో ప్రయాణం చేస్తుంటారు. పాత వంతెన స్థానంలో కొత్తది నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. కూటమి పాలనలోనైనా కొత్త వంతెన నిర్మించాలని కోరుతున్నారు.
వంతెన నిర్మించాలి
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారి మధ్యలో ఉన్న సీతన్నపేట గెడ్డ వద్ద కొత్త వంతెన నిర్మించాలి. భారీ వర్షం కురిసిన ప్రతీ సారి పాత వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తుంది. దీనివల్ల కూరగాయలను మార్కెట్‌కు తీసుకువెళ్లడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త వంతెన నిర్మిస్తే ప్రజల కష్టాలు తీరుతాయి.
- హనుమంతు ఆదినారాయణ, రైతు, ఊడికలపాడు.
వెళ్లడానికి వీలు కావడం లేదు
సీతన్నపేట గెడ్డకు వరదొస్తే సుమారు 20 గ్రామాల ప్రజలు ప్రమాదకరంగా ప్రయాణం చేయాల్సిందే. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగించాలి. రైతులు పంటలను మార్కెట్‌కు చేర్చడానికి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లడానికి వీలు కావడం లేదు.
- ఎల్. కరుణాకర్, ఉపాధ్యాయుడు, కోటబొమ్మాళి.