Share News

కావాలంటే ఒకే ప్రభుత్వం కొనసాగాలి

ABN , Publish Date - Dec 02 , 2025 | 12:13 AM

రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలంటే ఒకే ప్రభుత్వాన్ని ప్రజలు రెండుమూడుసార్లు అధికారంలోకి తీసుకురావాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

 కావాలంటే ఒకే ప్రభుత్వం కొనసాగాలి
కొల్లిపాడులో మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

సంతబొమ్మాళి, డిసెంబరు1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలంటే ఒకే ప్రభుత్వాన్ని ప్రజలు రెండుమూడుసార్లు అధికారంలోకి తీసుకురావాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం కొల్లిపాడు గ్రామంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను పంపిణీ చేయడంతో పాటు పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంతో స్వర్ణయుగం నడిచిందన్నారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని 25ఏళ్లు వెనక్కినెట్టిందన్నారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుందన్నారు. దీనికోసం సీఎం చంద్రబాబు నేత్వత్వంలో అందరం కష్టపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో రూ.4వేల కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. వచ్చేఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. మూలపేట పోర్టు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు సముద్రతీరం వెంబడి ఎనిమిది లైన్ల కోస్టల్‌ కారిడర్‌ నిర్మిస్తామని తెలిపారు. ఈ రహదారి నిర్మాణంతో ఎన్నో పరిశ్రమలు ఈ ప్రాంతానికి వచ్చి ఎంతోమంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో దిక్చూచిగా నిలుస్తుందన్నారు. తుఫాన్‌ పరిహారం కింద మత్స్యకార గ్రామాల్లోని ప్రజలందరికీ రేషన్‌కార్డుకు 50కేజీల బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. టెక్కలి నియోజకవర్గంలో రూ.600కోట్లతో ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని సమస్యలపై కనీస పరిజ్ఞానం లేని ప్రతిపక్ష పార్టీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా హార్టికల్చర్‌, రొయ్యల సాగు వైపు దృష్టి పెట్టాలని సూచించారు. రొయ్యల సాగుకు విద్యుత్‌ను యూనిట్‌ 1.50పైసలకే అందిస్తామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలి, విక్రయించిన నాలుగు గంటల్లోపే రైతుల అకౌంట్‌లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, కోటబొమ్మాళి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ బాడాన రమణమ్మ, పీఏసీఎస్‌ చైర్మన్‌ కూచెట్టి కాంతారావు, నాయకులు జీరు భీమారావు, రెడ్డి అప్పన్న, మార్కెట్‌ డైరెక్టర్లు సూరాడ ధనరాజ్‌, కర్రి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2025 | 12:13 AM