Share News

ఐబీఎం క్వాంటమ్‌ ఫెస్ట్‌కు సన్నద్ధం

ABN , Publish Date - Oct 20 , 2025 | 12:14 AM

ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌లో ఐబీఎం క్వాంటమ్‌ క్విస్కిట్‌ పాల్‌ ఫెస్ట్‌-2025 మంగళవారం ప్రారంభంకానుంది.

ఐబీఎం క్వాంటమ్‌ ఫెస్ట్‌కు సన్నద్ధం
ఆర్జీయూకేటీ, శ్రీకాకుళం క్యాంపస్‌

- రేపటి నుంచి ఆర్జీయూకేటీ క్యాంపస్‌లో నిర్వహణ

- ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

ఎచ్చెర్ల, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌లో ఐబీఎం క్వాంటమ్‌ క్విస్కిట్‌ పాల్‌ ఫెస్ట్‌-2025 మంగళవారం ప్రారంభంకానుంది. ఈ నెల 27వరకు ఈ ఫెస్ట్‌ జరగనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాకుళం క్యాంపస్‌కు చెందిన విద్యార్థులు కాటం నిఖిల్‌ తేజ, కాసిం వాలి దూదేకుల, ప్రవీణ్‌కుమార్‌ చెరుకూరి, జాన్‌బాబు చదువుల, గుణశ్రీ కిమిడి ఇచ్చిన ప్రజెంటేషన్‌ను అభినందించి ఐబీఎం క్వాంటమ్‌ ఈ ఫెస్ట్‌ నిర్వహణకు ఎంపిక చేసింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా విద్యా సంస్థలు ఈ ఫెస్ట్‌ నిర్వహణ కోసం పోటీపడ్డాయి. ఇందులో కేవలం 55 విశ్వ విద్యాలయాలు మాత్రమే ఎంపికయ్యాయి. రాష్ట్రం నుంచి ఏకైక సంస్థగా ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌ ఎంపిక కావడం విశేషం. ఈ ఫెస్ట్‌ రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ) పరిధిలోని శ్రీకాకుళం, నూజివీడు, ఒంగోలు, ఆర్‌కే వ్యాలీ (ఇడుపులపాయ)లోని నాలుగు క్యాంపస్‌ల్లో జరగనుంది.

తొలి రోజు..

ఐబీఎం క్వాంటమ్‌ ఇండియన్‌ లీడ్‌ ఎల్‌.వెంకట సుబ్రమణ్యం హాజరవుతారు. రెండు రోజుల పాటు హ్యాకఽథాన్‌ నిర్వహిస్తారు. విద్యార్థులు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు ప్రత్యక్షంగా, ఆన్‌లైన్‌ ద్వారా పాల్గొంటారు. ఈ రంగంలోని ఉపాధి అవకాశాలపై వర్క్‌షాపులు, నిపుణుల ఉపన్యాసాలు, క్వాంటం సాంకేతికాభివృద్ధిపై చర్చ ఉంటుంది. క్యాంపస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కేవీజీడీ బాలాజీ ఆధ్వర్యంలో ఏవో డాక్టర్‌ ముని రామకృష్ణ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఫెస్ట్‌కు కన్వీనర్‌గా అకడమిక్స్‌ డీన్‌ డాక్టర్‌ శివరామకృష్ణ వ్యవహరిస్తున్నారు.

ఏర్పాట్లు చేస్తున్నాం..

క్వాంటం ఫెస్ట్‌ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నాం. ఈ నెల 21 నుంచి 27వరకు ఈ ఫెస్ట్‌ జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఫెస్ట్‌తో విద్యార్థులు మరింత సృజనాత్మకంగా, సాంకేతికంగా ఆలోచించే అవకాశం ఉంది.

-డాక్టర్‌ కేవీజీడీ బాలాజీ, డైరెక్టర్‌, ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌

Updated Date - Oct 20 , 2025 | 12:14 AM