Share News

RTC complex.. : నేను మీ ఆర్టీసీ కాంప్లెక్స్‌ను..

ABN , Publish Date - Sep 08 , 2025 | 11:35 PM

Stuck in knee-deep water at compelx నాలుగు దశాబ్దాలుగా మీకు సేవలందిస్తున్నా. కానీ నా గురించి పాలకులు పట్టించుకోవడం లేదు. చిన్నవాన వచ్చినా మునిగిపోతున్నా. నేనే కాదు.. నా వద్దకు వచ్చిన ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మోకాలు లోతు నీళ్లలో ఇక్కట్లు పడుతూ వృద్ధులు, మహిళలు బస్సులు ఎక్కుతుంటే నా ప్రాణం విలవిల్లాడిపోతోంది.

RTC complex.. : నేను మీ ఆర్టీసీ కాంప్లెక్స్‌ను..
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో వరదనీటితో ప్రయాణికుల అవస్థలు (ఫైల్‌)

శ్రీకాకుళం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి):

నాలుగు దశాబ్దాలుగా మీకు సేవలందిస్తున్నా. కానీ నా గురించి పాలకులు పట్టించుకోవడం లేదు. చిన్నవాన వచ్చినా మునిగిపోతున్నా. నేనే కాదు.. నా వద్దకు వచ్చిన ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మోకాలు లోతు నీళ్లలో ఇక్కట్లు పడుతూ వృద్ధులు, మహిళలు బస్సులు ఎక్కుతుంటే నా ప్రాణం విలవిల్లాడిపోతోంది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ నా బాగు కోసం నాయకులు హామీలు ఇస్తున్నారు. గెలవగానే మర్చిపోతున్నారు. నా ద్వారా ప్రభుత్వానికి రోజూ రూ.35లక్షల ఆదాయం వస్తోంది. ఇక పండుగ రోజుల్లో అయితే ఇది మరింత ఎక్కువ. కానీ రూ.65లక్షలు నా కోసం ఖర్చు పెట్టలేక పోతున్నారు. రెండు రోజుల ఆదాయంలో నా రూపురేఖలు కొద్దిగానైనా మారిపోతాయి. నా చెంతకు వచ్చే ప్రయాణికులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. కానీ ఏప్రభుత్వమూ నిధులు ఇవ్వడం లేదు. ఎందుకు నా పట్ల ఈ వివక్ష? నా బాధను పట్టించుకోరా? కనీసం ప్రయాణికుల గోడు అయినా వినరా?

1981లో పట్టణానికి దూరంగా..

45 ఏళ్ల కిందట అంటే.. 1981లో శ్రీకాకుళం పట్టణానికి శివారున ఆర్టీసీ కాంప్లెక్స్‌గా పురుడుపోసుకున్నా. అప్పటికి పట్టణం ఇటుగా లేదు. పాతబస్టాండు నుంచి అటువైపే. ఆ తర్వాత కోర్టు, ఆర్ట్స్‌ కళాశాల వచ్చాయి. ఎస్పీ ఆఫీసు కూడా వచ్చింది. పట్టణం ఇప్పుడు నగరంగా మారి నడిబొడ్డున ఉన్నాను. ఒకప్పుడు చిన్నా పెద్దా.. ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చి దూరాభార ప్రయాణం చేసేవారు. వాళ్లందరూ క్షేమంగా వెళ్లివస్తుంటే నాకు పట్టరాని ఆనందం. ఇప్పుడైతే నా వద్దకు వచ్చేవారూ.. పోయేవారూ.. దూరం నుంచి చూసేవారూ అసహ్యించుకకుంటున్నారు. వర్షాకాలమైతే శాపనార్థాలు పెడుతున్నారు.

ఇదీ నాగురించి..

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌గా నా విస్తీర్ణం 6.5 ఎకరాలు. నాపరిధిలో ఉన్న శ్రీకాకుళం-1, శ్రీకాకుళం-2 డిపోలు పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. జిల్లా కేంద్రం కావడంతో వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు మూడొందలు వరకు బస్సులు వచ్చి వెళ్తుంటాయి. రోజుకి 80వేల మంది ప్రయాణికులు వస్తుంటారు.. వెళ్తుంటారు. ఇక్కడ ఉన్న రెండు డిపోల నుంచి ఆదాయం రోజుకు సుమారు రూ.35 లక్షల వరకు వస్తోంది. ఇంత ఆదాయాన్ని అందిస్తున్నా.. వేలాది మంది ప్రయాణికులు వచ్చి వెళ్తున్నా.. వందల బస్సులకు ఆశ్రయం కల్పిస్తున్నా.. ప్రజాప్రతినిధులు నన్ను పట్టించుకోవడం లేదు. పట్టణం నగరంగా మార్పు చెందాక.. నా చుట్టూ భవనాలు, ఇళ్లు, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు, ప్రైవేటు భవనాలు వెలిశాయి. ఆఖరుకు రోడ్డు కూడా వెడల్పు అయింది. అప్పటి నిర్మాణం గనుక.. రోడ్డు కంటే తక్కువ ఎత్తులో ఉన్నా. అంటే రెండు అడుగుల లోతున ఉన్నా. దీనివల్ల వర్షం కురిస్తే.. నా ముందర ఉన్న డ్రెయిన్‌లో మురుగునీరు ఉప్పొంగి.. నేను మునిగిపోతున్నా. బస్సులు నిలిపే ప్రాంతమంతా నిండిపోయి సరస్సులా మారిపోతున్నా. నగరం అభివృద్ధి చెందుతున్న రీతిగానే.. అంచెలంచెలుగా నన్ను కూడా ఎత్తు పెంచితే బాగుండేది. దీన్ని ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. ప్రయాణికులు మోకాలు లోతులో నడవాల్సి వస్తోంది. అదేనీటిలో బస్సులు ఎక్కాల్సి వస్తోంది. ఈ సమయంలో వారి బాధలు చూసి నా మనసు చివుక్కుమంటోంది.

ఇలా చేయండి ప్లీజ్‌

రోడ్డుకు ఆనుకుని ఉన్న భారీకాలువ నుంచి మురుగునీరు రాకుండా నన్ను నాలుగు అడుగుల ఎత్తు చేయాల్సి ఉంది. ఈ ప్రజాప్రతినిధులు, అధికారులకు తెలుసు. నా ప్రాంగణాన్ని ఎత్తు చేసేందుకు రూ. 60లక్షలు అవసరమని ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విషయమై శ్రద్ధ చూపాలని కోరుకుంటున్నా. ప్రజలు కూడా ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకురావాలని విన్నవించుకుంటున్నా. ఈ ప్రభుత్వ హయాంలోనైనా నన్ను అభివృద్ధి చేసే చర్యలు తీసుకోవాలని ప్రార్థిస్తున్నా.

- వేనువేల నమస్కారాలతో..

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌

Updated Date - Sep 08 , 2025 | 11:35 PM