పెట్రోల్ బంక్‌లో భారీ మోసం
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:32 AM
మెళియాపుట్టి మండలం జలగలింగుపురం గ్రామానికి చెందిన నడుమింటి సోమేశ్వరావుకు కోత యంత్రం ఉంది.
- లీటర్ డీజిల్‌పై రూ.10కిపైగా అదనం
- వినియోగదారుల ఆందోళన
- అనేకచోట్ల అదే తంతు
- తనిఖీల ఊసెత్తని అధికారులు
మెళియాపుట్టి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): మెళియాపుట్టి మండలం జలగలింగుపురం గ్రామానికి చెందిన నడుమింటి సోమేశ్వరావుకు కోత యంత్రం ఉంది. బుధవారం చాపరలో గల రాధాకృష్ణ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో రూ.3,800 చెల్లించి.. డీజిల్ కొనుగోలు చేశాడు. ఈ రోజు డీజిల్ ధర రూ.98.3 పైసలు ఉండగా... రూ.110.20 తీసుకోవడంతో సిబ్బందిని ప్రశ్నించాడు. దీంతో బంక్ యజమాని, సిబ్బంది ఎదురుదాడికి దిగారు. సుమారు 4 లీటర్ల వరకు తేడా రావడంతో వాహనదారులు ఆందోళనకు దిగారు. దీంతో ఎస్‌ఐ పిన్నింటి ర మేష్‌బాబు వచ్చి వివాదం సద్దుమణిగేలా చేశారు. గత నెలలో అదే బంక్‌లో మెళియాపుట్టికి చెందిన ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంలో రెండు లీటర్ల పెట్రోలు వేయించారు. రెండు లీటర్లు 50 కిలోమీటర్లు కూడా రాకపోవడంతో ఆందోళనకు దిగాడు. దీంతో మళ్లీ పెట్రోలు ఇచ్చి...వివాదం బయటకు రాకుండా సిబ్బంది చూసుకున్నారు. ఇలా ఎప్పటికప్పుడు ఇక్కడ మోసాలు జరుగుతూనే ఉన్నాయి.
జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలో 139 పెట్రోలు బంక్‌లు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు సుమారు 5 లక్షల 30 వేల లీటర్ల పెట్రోలును వాహనదారులు వినియోగిస్తున్నారు. డీజిల్ 7 లక్షల 60 వేల లీటర్లు వరకు వినియోగిస్తున్నారు. పెట్రోలు బంకుల్లో వివిధ రకాలుగా మోసాలు జరుగుతున్నా పట్టించుకోనే నాథుడు కనిపించడం లేదు. అత్యధికంగా రాజకీయ నేతలు బంకులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. వారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే వారి చెంతకు చేరడంతో సంబంధిత అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. కొన్నిచోట్ల కొలతల్లో తేడాలు ఉంటుండగా...మరికొన్ని చోట్ల కల్తీ జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సరిహద్దు మండలాల్లో అధికంగా మోసాలు జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో మోసాలు మూడు పువ్వులు..ఆరుకాయలుగా సాగుతున్నాయి.
ఇలా చూసుకోవచ్చు
పెట్రోలు, డీజిల్ ఫిల్లింగ్ యంత్రంపై డెన్సిటీ అని రాసి ఉంటుంది. పెట్రోలు 717-770 మధ్య, డీజిల్ 820-860 మఽధ్యలో ఇది ఉండాలి. ఇవి వాతావరణాన్ని అనుసరించి మారుతుంటాయి. ఉదయం, రాత్రి వేళల్లో మంచి సాంద్రత ఉంటుంది. ఆ సమయాల్లో ఇం ధనం వేయిస్తే మేలు. ఇంధనలం వేయించే సమయంలో 0 (సున్నా)ను మనకు చూపిస్తారు. దీంతో అంతా సవ్యంగా ఉందని అనుకుంటాం. ఇక్కడే జంప్ ట్రిక్ పద్ధతిలో బురిడీ కొట్టిస్తున్నారు. మీటర్ మధ్యలో 4-5 కాకుండా 10-20 నుంచి మొదలైనా... ధార వేగంగా ఉన్నా అనుమానించాల్సిందే.
ఇలా పరీక్షించుకోవాలి
రీడింగ్‌పై అనుమానం ఉంటే నిర్వాహకుల వద్ద ఉండే ఐదు లీటర్ల కొలమానం ద్వారా పరీక్షించుకోవాలి. ప్రతి బంకులో ఫిల్టర్ పేపర్ పరీక్ష ఉంటుంది. పేపర్‌పై పెట్రోల్ చుక్కలు వేసి...నిమిషం పాటు గాలిలో తిప్పితే తొలుత ఎలా ఉందో అలానే ఉండాలి. అలా ఉంటే నాణ్యంగా ఉన్నట్టు లెక్క.
ఫిర్యాదు ఎలాగంటే...
బంకు యజమాన్యం పరీక్షించి... చూపకపోయినా... మోసం జరిగినట్లు గుర్తించినా ఫిర్యాదు చేయొచ్చు. ఆ పుస్తకాన్ని ఇవ్వడానికి అంగీకరించకపోతే సంబంధిత ఆయిల్ కంపెనీ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు. తూనికలు, కొలతలు, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.
చర్యలు తీసుకుంటాం
చాపరలోగల ఇండియన్ ఆయిల్ బంక్‌పై ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిని పరిశీలిస్తాం. తూనికలు-కొలతల అధికారులకు తెలియజేసి..చర్యలు తీసుకుంటాం. జలగలింగుపురం గ్రామానికి చెందిన సోమేష్ నుంచి వివరాలు తీసుకున్నాం. తప్పని తేలితే బంక్‌ను సీజ్ చేస్తాం.
- బి.పాపారావు, తహశీల్దార్, మెళియాపుట్టి
మోసం చేస్తున్నారు
నాకు రెండు టాక్టర్లతో పాటు కోత యంత్రం ఉంది. రోజూ డీజిల్ కొనుగోలు చేస్తుంటాను. ఈ రోజు రేటు రూ.98.3 ఉండగా.. రూ.110.29 తీసుకున్నారు. దీనిపై ప్రశ్నిస్తే దాడికి దిగారు. బంక్ యజమానిపై చర్యలు తీసుకోవాలి.
- నడిమిండి సోమేశ్వరావు, జలగలింగుపురం 19 ఎంఎల్‌పి 6
అధికారుల పరిశీలన
ఇదిలా ఉండగా.. బాధితుల ఫిర్యాదు మేరకు.. తూనికలు-కొలతల అధికారి చిన్మమ్మి, ఇండియన్ ఆయిల్ సేల్స్ మేనేజర్ రాజు చాపరలోని పెట్రోల్ బంకును పరిశీలించారు. టెక్కలి ఆర్డీవోకు నివేదికను అందిస్తామని తెలిపారు. అంతవరకు తాత్కాలికంగా అమ్మకాలు నిలిపివేయాలని బంకు నిర్వాహకులను ఆదేశించారు.