భూములు అమ్ముకునేదెలా?
ABN , Publish Date - Oct 23 , 2025 | 12:21 AM
అధికారుల నిర్లక్ష్యం పొందూరు పట్టణవాసుల పాలిట శాపంగా మారింది.
- 22-ఏ జాబితాలోకి 64.5 ఎకరాలు
- 40 సెంట్ల కోసం వాటిని నిషేధిత జాబితాలో చేర్చిన వైనం
- అధికారుల నిర్లక్ష్యంతో నిలిచిన రిజిస్ట్రేషన్లు
- పొందూరు పట్టణ ప్రజల ఇబ్బందులు
పొందూరు, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): అధికారుల నిర్లక్ష్యం పొందూరు పట్టణవాసుల పాలిట శాపంగా మారింది. 40 సెంట్ల స్థలం కోసం దేవదాయశాఖ అధికారుల సూచనలతో రెవెన్యూ అధికారులు పొందూరులో ఉన్న మొత్తం భూములను 22-ఏ పరిధిలోకి చేర్చారు. దీంతో ఆ భూముల రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. తమ అవసరాల కోసం భూములను విక్రయించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పట్టణ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఆరేళ్లుగా ఇదే పరిస్థితి ఉందని, ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని వాపోతున్నారు.
ఇదీ పరిస్థితి..
పొందూరు పట్టణంలో సర్వే నెంబరు 163-1లో 64.5 ఎకరాల జిరాయితీ భూములు, ఇళ్ల స్థలాలతో పాటు ఓగ్రామ కంఠం కూడా ఉంది. 2019కు ముందు టీడీపీ ప్రభుత్వంలో 163-1 సర్వేనెంబరులో రిజిస్ట్రేషన్లు జరగడంతో కయ్రవిక్రయాలు జరిగేవి. ఈ సర్వే నెంబరులో దేవదాయశాఖకు 40 సెంట్ల స్థలం ఉందని ఆ శాఖాధికారులు వైసీపీ ప్రభుత్వంలో 2020లో రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారు ఎటువంటి ఆలోచన చేయకుండా 163-1 సర్వేనెంబరులో 64.5 ఎకరాల భూమిని, ఇళ్లస్థలాలను 22-ఏ జాబితాలోకి చేర్చేశారు. అప్పటి నుంచి ఆ సర్వేనెంబర్‌లోని భూములు, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. 40 సెంట్ల స్థలం కోసం మొత్తం భూములన్నీ నిషేధిత జాబితాలోకి ఎలా చేర్చారని అధికారులను పట్టణవాసులు నిలదీస్తున్నారు. ఈ భూములు దేవదాయశాఖ జాబితాలోకి వెళ్లిపోయాయని, ఆ శాఖ కమిషనర్ తొలగిస్తేనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని రెవెన్యూ అధికారులు అంటున్నారు. ఈ సమస్యను అప్పటి ఆమదాలవలస ఎమ్మెల్యే, స్పీకర్ తమ్మినేని సీతారాం దృష్టికి పొందూరు ప్రజలు తీసుకువెళ్లారు. అయినప్పటికీ పరిష్కారం కాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎమ్మెల్యే కూన రవికుమార్ దృష్టికి సమస్యను బాధితులు తీసుకువెళ్లారు. ఆయన సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. కాగా, గత వైసీపీ ప్రభుత్వంలో పొందూరు పట్టణానికి చెందిన కీలక నాయకులు సమస్య పరిష్కారం కాకుండా మోకాలడ్డగా, ప్రస్తుత అధికారపార్టీ నాయకులు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనిపై పట్టణ ప్రజలు పోరాటానికి సిద్ధమవుతున్నారు.
మా బాధలు పట్టడంలేదు
మా బాధలు అధికారులకు ఏ మాత్రం పట్టడంలేదు. పొందూరు పట్టణ పరిధిలో ఇళ్లు, స్థలాలు ఉన్నా అవసరాలకు అమ్ముకోలేకపోతున్నాం. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. మా భూములను 22-ఏ జాబితా నుంచి తొలగించాలి.
- జి.సాయిరాజ్, వ్యాపారి, పొందూరు
ఆదేశాలు వచ్చాకే రిజిస్ట్రేషన్లు
163-1 సర్వేనెంబరులోని భూములు 22-ఏ జాబితాలో ఉండడంతోనే రిజిస్ట్రేషన్లు జరగడంలేదు. 22-ఏ జాబితా నుంచి తొలగించినట్లు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాకే ఆ భూములకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.
-రవిశంకర్, సబ్‌రిజిస్ట్రార్, పొందూరు