Rehabilitation problems: పునరావాసంలో ఎలా బతకాలి?
ABN , Publish Date - Jun 23 , 2025 | 12:04 AM
Displacement Livelihood issues పోర్టు కోసం ఇళ్లు, భూములు ఇచ్చిన తమకు కనీస సౌకర్యాలు కల్పించకుండానే పునరావాస కేంద్రానికి తరలించారంటూ విష్ణుచక్రం గ్రామానికి చెందిన నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సౌకర్యాలు కల్పించకుండానే తరలించేశారు
నౌపడలో సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నాం
విష్ణుచక్రం గ్రామస్థుల ఆవేదన
సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి
సంతబొమ్మాళి, జూన్ 22(ఆంధ్రజ్యోతి): పోర్టు కోసం ఇళ్లు, భూములు ఇచ్చిన తమకు కనీస సౌకర్యాలు కల్పించకుండానే పునరావాస కేంద్రానికి తరలించారంటూ విష్ణుచక్రం గ్రామానికి చెందిన నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంతబొమ్మాళి మండలం మూలపేటలో పోర్టు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. భూ సేకరణలో భాగంగా విష్ణుచక్రం గ్రామాన్ని అధికారులు ఇటీవల ఖాళీ చేయించారు. వారికి కొంతమేర నష్ట పరిహారం అందజేశారు. అలాగే నౌపడలో పునరావాస కేంద్రం కేటాయించారు. కాగా పునరావాస కేంద్రంలో కనీస సౌకర్యాలు లేవని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. సమస్యల నడుమ ఇక్కడ ఎలా బతకాలని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ‘విష్ణుపురంలో 57 కుటుంబాలు ఉండగా.. నౌపడలో 45 మందికి మాత్రమే తాత్కాలిక షెడ్లు ఇచ్చారు. మిగిలిన వారికి షెడ్లు నిర్మించలేదు. అధికారులు మమ్మల్ని దౌర్జన్యంగా పునరావాస కేంద్రానికి తరలించారు. పాత గ్రామం నుంచి కొత్తచోటుకు వెళ్లేందుకు ముహూర్తం చూసి వస్తామన్నా పట్టించుకోలేదు. ప్రొక్లెయినర్లతో ఇళ్లు కూల్చేసి.. బలవంతంగా గ్రామాన్ని ఖాళీ చేయించారు. నౌపడలో కనీసం కాలువలు లేవు. సిమెంట్ రోడ్లు లేక వర్షం కురిస్తే.. నరకం చూస్తున్నాం. పునరావాస కాలనీ నుంచి నౌపడ మూడురోడ్ల కూడలి వరకు రహదారి నిర్మిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకూ పనులు చేపట్టలేదు. సామూహిక మరుగుదొడ్లు నిర్మించినా.. ఇంతవరకూ ప్రారంభించలేదు. పాత గ్రామంలో ఆలయానికి అంచనా వేసిన రూ.16లక్షలు కూడా మంజూరు చేయలేదు. గ్యాప్ ఏరియాలో ఉండిపోయిన వారి భూముల డబ్బులు ఇంకా చెల్లించాల్సి ఉంది. సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరించకుండానే పునరావాస గ్రామానికి తరలించడం ఎంతవరకు సబబు’ అని విష్ణుచక్రం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని, సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
సదుపాయాలు కల్పించాలి
పునరావస గ్రామమైన నౌపడలో కనీస సౌకర్యాలు కల్పించకుండా అధికారులు దౌర్జన్యంగా మమ్మల్ని విష్ణుచక్రం నుంచి తరలించారు. కనీసం కాలువలు లేక ఇబ్బందులు పడుతున్నాం. మౌలిక సదుపాయాలు కల్పించాలి
- గిన్ని శ్యామసుందరావు, నిర్వాసితుడు
కనీస సౌకర్యాలు లేవు
పునరావస కాలనీలో కనీస సౌకర్యాలు లేవు. చాలా చోట్ల మట్టితో కప్పకపోవడం వల్ల.. గోతుల్లో నీరు చేరిపోతోంది. పూర్తిస్థాయిలో పరిహారం కూడా అందజేయలేదు. హడావుడిగా గ్రామాన్ని ఖాళీ చేయించేశారు.
- గిన్ని రమణ నిర్వాసితుడు
మంచి రోజు వస్తామన్నా..
పూర్వీకుల కాలం నుంచి గ్రామంలో నివసిస్తున్నాం. నిర్వాసిత గ్రామానికి ముహుర్తం చూసి.. మంచి రోజు వస్తామని చెప్పినా.. అధికారులు పట్టించుకోలేదు. ఇళ్లు దౌర్జన్యంగా ఖాళీ చేయించి.. మమ్మల్ని పునరావాస గ్రామానికి తరలించారు.
- గిన్ని ముత్తమ్మ, నిర్వాసితురాలు
సమస్యలు పరిష్కరిస్తాం
మూలపేట పోర్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం. విష్ణుచక్రం గ్రామస్థులకు పునరావస కేంద్రమైన నౌపడలో విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించాం. సామూహిక మరుగుదొడ్లు త్వరలో అందుబాటులోకి తెస్తాం. త్వరలో కాలువల పనులు ప్రారంభిస్తాం. నిర్వాసితులకు తగిన సమయం ఇచ్చిన తర్వాతే గ్రామం నుంచి ఖాళీ చేయించాం. ఎవరినీ బలవంతంగా తరలించలేదు.
- హేమసుందర్, తహసీల్దార్,సంతబొమ్మాళి