ఇంకా ఎన్నేళ్లీ కష్టాలు?
ABN , Publish Date - Oct 14 , 2025 | 11:44 PM
No development in the offshore reservoir colony ఆఫ్‌షోర్ రిజర్వాయర్ నిర్వాసిత కాలనీల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2008లో పలాస మండలం రేగులపాడు వద్ద ఆఫ్‌షోర్ జలాశయం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఆఫ్‌షోర్ రిజర్వాయర్ కాలనీలో కానరాని అభివృద్ధి
మౌలిక సౌకర్యాలు మరచిన అధికారులు
నిత్యం ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు
భూములిచ్చినా.. గౌరవం దక్కలేదని ఆవేదన
పలాస, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): ఆఫ్‌షోర్ రిజర్వాయర్ నిర్వాసిత కాలనీల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2008లో పలాస మండలం రేగులపాడు వద్ద ఆఫ్‌షోర్ జలాశయం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కాగా.. ఆఫ్‌షోర్ జలాశయం కోసం అప్పట్లో భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం మొండిచేయి చూపించింది. నిర్వాసితులకు ఆధునిక హంగులతో లేఅవుట్ వేసి ఇస్తామన్న హామీ నేటికీ అమలు చేయలేదు. కనీసస్థాయిలో కూడా రహదారులు, తాగునీటి వంటి సౌకర్యాలు కల్పించలేదు. రిజర్వాయర్ కోసం భూ సేకరణ చేసి 18 ఏళ్లు పూర్తయినా సమస్యలు మాత్రం అధికారులు పరిష్కరించలేదు. దీంతో నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో సదాశయంతో రిజర్వాయర్‌కు భూములు అప్పగిస్తే తమకు ఇచ్చిన గౌరవం ఇదేనా? అని ప్రశ్నిస్తున్నారు.
ఆఫ్‌షోర్ జలాశయం కోసం పలాస మండలంలో రేగులపాడు, నందిగాం మండలంలో శారదాపురం, చిన్నగురువూరు, మెళియాపుట్టి మండలం చీపురుపల్లి గ్రామాలకు చెందిన రైతులు తమ భూములిచ్చారు. ఈ ప్రాంతం ముంపులో ఉండడంతో అధికారులు అప్పట్లో ఆగమేఘాలపై పంట పొలాలు సేకరించి రైతులకు 2013 చట్టం ప్రకారం ఆర్‌ఆర్ ప్యాకేజీ ప్రకటించారు. దీనిప్రకారం భూములిచ్చిన రైతులకు నష్టపరిహారంతోపాటు ఐదు సెంట్ల నివాసస్థలాలు, గృహ నిర్మాణానికి నిధులు ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం పలాస-కాశీబుగ్గ పురపాలకసంఘం దగ్గరలో ఉన్న రామకష్ణాపురంలో భూములు సేకరించి లేఅవుట్ ప్రకారం 250ఫ్లాట్లు వేసి నిర్వాసితులకు అప్పగించారు. ప్రస్తుతం నిర్వాసిత ప్రాంతంలో శారదాపురానికి చెందిన 109 కుటుంబాలు, చిన్నగురువూరుకు చెందిన 34 కుటుంబాలు, రేగులపాడుకు చెందిన 40 కుటుంబాలు, చీపురుపల్లి గ్రామానికి చెందిన 64 కుటుంబాలు ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చాయి. ఇందులో కొంతమంది గృహాలు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. కాగా అభివృద్ధి పథకాలకు ఏపీడబ్ల్యూఆర్‌ఐడీసీ కింద రూ.5కోట్లు అప్పట్లో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పనులు ప్రారంభించి పదేళ్లవుతున్నా నేటికి ఒక్క ప్రభుత్వ భవనం పూర్తి చేయలేకపోయింది. రహదారులు, తాగునీరు, విద్యుత్‌సౌకర్యం, పాఠశాలలు, అంగన్‌వాడీ భవనాలు, సచివాలయం, డిస్పెన్సరీ, దేవాలయం వంటివి ప్రభుత్వం నిర్మించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకూ అరకొరగా విద్యుత్ సౌకర్యం తప్ప మిగిలినవి ఏవీ పూర్తి చేయలేకపోయారు. పాఠశాల, పట్టణ ఆరోగ్య కేంద్రాల భవనాల పనులు మధ్యలోనే వదిలేశారు. 20వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకును నిర్మించినా.. చుక్కనీరు కూడా ఇంతవరకు ఇవ్వలేకపోయారు. రాత్రయితే చాలు నిర్వాసితులు బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తోంది. కొండలు, చెరువులు ఉన్న ప్రాంతం కావడంతో విష జంతువులు, సర్పాలు సంచరిస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. కాలువలు లేకపోవడంతో మురుగునీటితో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోందని చెబుతున్నారు. నీటి కోసం సొంతంగా బోర్లు వేసుకున్నామని, కనీసం తాగునీరైనా తమకు అందించాలని ప్రజలు వేడుకుంటున్నారు. పాఠశాల లేకపోవడంతో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోసంగిపురం గ్రామానికి తమ పిల్లలకు పంపించాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి..
ఆఫ్‌షోర్ నిర్వాసిత కాలనీలో మౌలిక సదుపాయాల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. నిర్వాసితులను గుర్తించి వారికి స్థలాలు ఇప్పటికే కేటాయించాం. తగిన సౌకర్యాలు ఇంజనీరింగ్ అధికారులు చేపట్టాల్సి ఉంది. దీనిపై చర్యలు తీసుకుంటాం.
- టి.కళ్యాణచక్రవర్తి, తహసీల్దార్, పలాస