పాఠశాల వద్ద ఇలా.. చదువులెలా?
ABN , Publish Date - Sep 09 , 2025 | 12:22 AM
ఇదేంటీ...చెరువు ఒడ్డున ఎవరైనా పాఠశాలను నిర్మిస్తారా? అని ఆశ్చర్యపోతున్నారా? మీరు అనుకున్నట్టు చెరువు ఒడ్డున పాఠశాల లేదు.
మెళియాపుట్టి, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఇదేంటీ...చెరువు ఒడ్డున ఎవరైనా పాఠశాలను నిర్మిస్తారా? అని ఆశ్చర్యపోతున్నారా? మీరు అనుకున్నట్టు చెరువు ఒడ్డున పాఠశాల లేదు. పాఠశాల ఆవరణే ఇలా చెరువులా మారిపో యింది. ఈ ఒక్క రోజే కాదు... వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే పరిస్థితి. ఇదీ జాడుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాల వద్ద దుస్థితి. సోమవారం సాయంత్రం వర్షం కురవడంతో పాఠశాల ఆవరణలో ఇలా నీరు నిలిచింది. ఇక్కడ గతంలో నాడు-నేడు పనులు చేశారు. పాఠశాల ప్రాంగణంలో మట్టిని పూర్తిగా వేయకపోవడంతో నీరు ఇలా నిలిచిపోతోంది. సెలవు రోజుల్లోనూ... ఉదయం వేళల్లోనైతే పిల్లలు ఇళ్ల వద్దనే ఉండిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ పాఠశాల పని వేళల్లో వర్షం కురిస్తే విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఉపాధ్యాయులదీ అదే పరిస్థితి. ఆవరణ చెరువులా ఉండడమే కాదు... తరగతి గదుల్లోకీ వర్షం నీరు చేరుతోంది. దీంతో పిల్లల పుస్తకాలు, పాఠశాల రికార్డులు తడిసిపోతున్నాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పాఠశాల పరిసరాలను మెరుగుపరచాలని వారంతా కోరుతున్నారు.