eggs: ఈ గుడ్లు తినేదెలా?
ABN , Publish Date - Jun 03 , 2025 | 11:07 PM
eggs: మండలంలోని పోలూరు అంగన్‌వాడీ కేంద్రానికి మంగళవారం కుళ్లిన కోడి గుడ్లను సరఫరా చేశారు.
- అంగన్‌వాడీ కేంద్రాలకు కుళ్లిన కోడిగుడ్ల సరఫరా
- కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామన్న ఐసీడీఎస్ సీడీపీవో
మెళియాపుట్టి, జూన్ 3(ఆంధ్రజ్యోతి): మండలంలోని పోలూరు అంగన్‌వాడీ కేంద్రానికి మంగళవారం కుళ్లిన కోడి గుడ్లను సరఫరా చేశారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ గుడ్లను పిల్లలకు ఎలా తినేపించేదని ప్రశ్నిస్తున్నారు. పోలూరు అంగన్‌వాడీ కేంద్రంలో 15 మంది చిన్నారులు ఉన్నారు. గ్రామానికి చెందిన గేదెల సంతోష్‌కు రెండేళ్ల పాప ఉంది. దీంతో అంగన్‌వాడీ కేంద్రం నుంచి గుడ్లను అందించారు. ఈ గుడ్లలో అధికంగా కుళ్లిపోయి ఉన్నాయి. గుడ్లను ఉడకబెట్టడానికి నీటిలో వేసిన వెంటనే పగిలిపోయాయి. ఇటువంటి గుడ్లు పిల్లలు తింటే అనారోగ్యానికి గురికావడం కాయమని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి నెల కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు కుళ్లిన గుడ్లను సరఫరా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కేంద్రాలకు సంబంధిత కాంట్రాక్టర్ నెలకు నాలుగు సార్లు గుడ్లు సరఫరా చేయవలసి ఉంటుంది. అయితే, వాటిని ఒకేసారి అందిస్తున్నాడు. దీంతో ఎక్కువ కాలం నిల్వ ఉండడంతో కుళ్లిపోతున్నాయి. దీనిపై ఐసీడీఎస్ సీడీపీవో విమలరాణి మాట్లాడుతూ.. సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. ‘ప్రతి నెల అంగన్‌వాడీ కేంద్రాలకు నాలుగు సార్లు గుడ్లు సరఫరా చేయాలి. అలాకాకుండా రెండు సార్లు సరఫరా చేస్తున్నారు. వాటిని కేంద్రంలో నిల్వ ఉంచుతుండడంతో కుళ్లిపోతున్నాయి. దీనిపై అంగన్‌వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పిస్తాం.’ అని తెలిపారు.