Share News

Foreign birds: విదేశీ పక్షులకు విడిది ఎలా?

ABN , Publish Date - Jul 23 , 2025 | 12:01 AM

Migratory birds.. Habitat arrangements విదేశీ విహంగ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కనుమరుగయ్యాయి. జిల్లాలోని ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి, టెక్కలి మండలం తేలినీలాపురం విదేశీ పక్షుల విడిది కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇవి పర్యాటక కేంద్రాలుగా కూడా భాసిల్లాయి.

Foreign birds: విదేశీ పక్షులకు విడిది ఎలా?
తేలుకుంచిలో విదేశీ పక్షులు

  • వైసీపీ పాలనలో కేంద్రాలపై తీవ్ర నిర్లక్ష్యం

  • కనీస స్థాయిలో మంజూరుకాని నిధులు

  • వసతులు లేక తప్పని ఇబ్బందులు

  • ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వినతులు

  • టెక్కలి రూరల్‌/ ఇచ్ఛాపురం, జూలై 22(ఆంధ్రజ్యోతి): విదేశీ విహంగ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కనుమరుగయ్యాయి. జిల్లాలోని ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి, టెక్కలి మండలం తేలినీలాపురం విదేశీ పక్షుల విడిది కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇవి పర్యాటక కేంద్రాలుగా కూడా భాసిల్లాయి. ఏటా సైబీరియా, జర్మనీ, అస్ర్టేలియా, సింగపూర్‌, మలేషియా, హంగేరి దేశాల నుంచి వేలాది కిలోమీటర్లు ఎగురుకుంటూ పెలికాన్‌, పెయింటెండ్‌, స్టార్క్‌ జాతులకు చెందిన పక్షులు ఇక్కడికి విడిది కోసం వస్తాయి. ఏటా సెప్టెంబరులో వచ్చి సంతానోత్పత్తి చేసి.. వాటి పిల్లలతో తిరిగి ఏప్రిల్‌ పయనమవుతాయి. స్థానికులను, పర్యాటకులను కనువిందు చేస్తాయి. కాగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో పక్షుల విడిది కేంద్రాల నిర్వహణ పట్టించుకోలేదు. దీంతో సంరక్షణ కరువై వందలాది పక్షులు మృత్యువాత చెందాయి. అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపినా మంజూరైన దాఖలాలు లేవు. నిర్వాహకులకు కూడా జీతాలు అందే పరిస్థితి లేదు.

  • తేలినీలాపురంలో ఇలా..

  • 1986లో తేలినీలాపురానికి చెందిన కొంతమంది రైతుల వద్ద మూడు ఎకరాల భూమి తీసుకుని పక్షుల విడిది కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దట్టమైన చెట్లు పెంచి, పక్షులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంతో ఎక్కడ చూసినా సందడిగా కనిపించేవి. వీటిని చూసేందుకు పర్యాటకులు కూడా తరలివచ్చేవారు. ప్రస్తుతం సౌకర్యాలు లేక అటు విదేశీ పక్షులకు, ఇటు పర్యాటకులకు ఇబ్బందులు తప్పడం లేదు. చుట్టూ ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదించినా నిధులు మంజూరు కాలేదు. ప్రస్తుతం ఇనుప కంచెలు వేసినా అవి తెగిపోవడంతో ఇతరులు లోపలకు వచ్చి.. పక్షులను వేటాడే పరిస్థితులు ఉన్నాయి. పక్షులను చూసేందుకు పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన టవర్‌ సైతం శిథిలావస్థకు చేరుకుంది. మరుగుదొడ్లు నిర్మించినా తలుపులు లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. పక్షులు సేదతీరేందుకు ఏర్పాటు చేసిన ఇనుప జాలులు తుప్పుపట్టాయి. పిల్లలు ఆడుకునే పార్క్‌ను సైతం నిర్లక్ష్యంగా వదిలేశారు. పర్యాటకుల కోసం నిర్మించిన విశ్రాంతి షెడ్‌లు పాడైపోయాయి. ఈ కేంద్రం నిర్వహణకు, పక్షుల సంరక్షణ కోసం గ్రామానికి చెందిన ఇద్దరిని నియమించారు. వారికి నెలకు రూ.9వేలు చొప్పన వేతనం అందజేస్తామని ప్రకటించారు. కానీ మూడేళ్లుగా వారికి వేతనాలు ఇవ్వకపోవడంతో అవస్థలు పడుతున్నారు.

  • తెలుకుంచికి విదేశీ అతిథులొచ్చేశాయ్‌

  • విదేశీ విహంగాల రాక ప్రారంభమైంది. ఇచ్ఛాపురం మండలంలోని తేలుకుంచి పరిసర ప్రాంతాల్లో పక్షుల కిలకిలరావాలు వినిపిస్తున్నాయి. సైబీరియా, జర్మనీ, అస్ర్టేలియా, సింగపూర్‌, మలేషియా, హంగేరి దేశాల నుంచి సుమారు 6వేల కిలోమీటర్లు ప్రయాణించి ఏటా సెప్టెంబరు, అక్టోబరులో ఇక్కడకు పక్షులు చేరుతాయి. సుమారు ఆరేడు నెలలపాటు ఇక్కడే ఉండి గుడ్లు పెట్టి సంతానోత్పత్తి జరుపుతాయి. పిల్లలు పెద్దాయ్యాక.. మార్చి, ఏప్రిల్‌లో తిరుగు పయనమవుతాయి. ఈసారి కాస్త ముందుగానే పక్షులు తమ గ్రామానికి చేరుకుంటున్నాయని తేలుకుంచి గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇవి వస్తే పంటలు బాగా పండుతాయని తమ ప్రగాడ నమ్మకమని చెబుతున్నారు.

  • ముందస్తు చర్యలు చేపడితేనే..

  • ప్రస్తుతం తేలుకుంచిలో విదేశీ పక్షుల రాక ప్రారంభమైంది. మరో నెలరోజుల్లో తేలినీలాపురానికి కూడా రానున్నాయి. సంతోనోత్పత్తి చేసే క్రమంలో గుడ్లుతో పాటు పక్షులు చెట్లపై నుంచి జారిపడి మృత్యువాత చెందుతుంటాయి. అందుకే ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కనీసం చెట్లకు వలలు ఏర్పాటు చేసినా కొంతవరకూ పక్షుల మృత్యువాత అడ్డుకోవచ్చు. దీనికితోడు కోతులతో పక్షులకు కష్టాలు తప్పడం లేదు. కేంద్రం నిర్వహణ సక్రమంగా లేక వాటి మలమూత్ర విసర్జనతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. కనీసం చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులను అభివృద్ధి చేస్తే పక్షులకు కొంతవరకూ ఉపయోగపడే అవకాశముంది. ఆ దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

  • పర్యాటకాభివృద్ధికి అవకాశం

  • టీడీపీ ప్రభుత్వ హయాంలో తేలుకుంచి కేంద్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. వైసీపీ పాలనలో పర్యాటకశాఖకు ఎటువంటి నిధులు కేటాయించలేదు. అటవీ, పర్యాటక శాఖ సంయుక్తంగా చర్యలు చేపడితే విదేశీ పక్షుల విడిదికేంద్రాలు అభివృద్ధి చెందే అవకాశముంది. దీనిపై కూటమి ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేయాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

    ఎంతో నమ్మకం..

  • విదేశీ పక్షులు వస్తే ఈ ప్రాంతంలో సమృద్ధిగా పంటలు పండుతాయని ప్రగాడ నమ్మకం. కానీ ఈ కేంద్రంలో పక్షులు పడే బాధలు వర్ణనాతీతం. సరైన ఏర్పాట్లు లేకపోవడంతో చెట్లపై నుంచి జారిపడి సంతానోత్పత్తి గుడ్లు పగిలిపోతుంటాయి. పక్షులు సైతం మృత్యువాత పడుతుంటాయి. ఆ సమయంలో చాలా బాధేస్తోంది.

    - మేరుగు సూర్యనారాయణ, తేలుకుంచి

  • ప్రభుత్వం దృష్టిపెట్టాలి

  • విదేశీపక్షుల విడిది కేంద్రంపై టీడీపీ ప్రభుత్వ హయాంలో కనీసం పర్యవేక్షణ అయినా ఉండేది. వైసీపీ పాలనలో కనీసస్థాయిలో విదేశీ పక్షులకు సంరక్షణ లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం ఈ విదేశీ పక్షుల కేంద్రంపై దృష్టిపెట్టాలి.

    - నారాయణ, తేలుకుంచి

  • భద్రతకు చర్యలు

  • తేలుకుంచి విదేశీ పక్షుల విడిది కేంద్రంపై ప్రత్యేక దృష్టిపెట్టాం. అటవీ శాఖపరంగా మొక్కలు కూడా నాటి సంరక్షిస్తున్నాం. పక్షుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నాం. శాశ్వత నిర్మాణాలకు సంబంధించి ప్రతిపాదనలు చేశాం. త్వరలో వాటికి మోక్షం కలుగుతుందని ఆశిస్తున్నాం.

    - ఏ మురళీకృష్ణ నాయుడు, అటవీరేంజ్‌ అధికారి, కాశీబుగ్గ

  • వసతులు లేవు

  • పక్షుల విడిది కేంద్రంలో వసతులు లేక పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయాలి.

    - వై.రాజారావు, తేలినీలాపురం

  • జీతం ఇవ్వడం లేదు

  • రెండేళ్లు నుంచి జీతం లేక ఇబ్బందులు పడుతున్నాను. వసతిగృహం నిర్మాణానికి 70 సెంట్ల భూమి ఇచ్చాను. ఉపాధి కోసం ప్రతి నెల జీతం ఇస్తామని చెప్పారు. కానీ రెండేళ్ల నుంచి జీతం అందడం లేదు.

    - ఉప్పాడ భీమారావు, నిర్వాహుకుడు, తేలినీలాపురం

  • ప్రతిపాదనలు పంపించాం

  • తేలినీలాపురం అబివృద్ధికి ప్రతిపాదనలు పంపాం. నిర్వాహకుల జీతాల కోసం మా పై అధికారులకు తెలియజేస్తున్నాం. పక్షులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.

    - కృష్ణారావు, అటవీశాఖ సెక్షన్‌ అధికారి, టెక్కలి

Updated Date - Jul 23 , 2025 | 12:01 AM