చేపలు దొరికేచోట వేట వద్దంటే ఎలా?
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:23 AM
How about hunting సముద్రంలో చేపలు దొరికేచోట వేట సాగించొద్దని పోర్టు అధికారులు ఆంక్షలు విధిస్తే తాము ఎలా బతికేదని పలువురు మత్స్యకారులు నిలదీశారు. శుక్రవారం భావనపాడులో మత్స్యకారులు, పోర్టు అధికారులతో మత్స్యశాఖ అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు.
అధికారులను నిలదీసిన మత్స్యకారులు
సంతబొమ్మాళి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): సముద్రంలో చేపలు దొరికేచోట వేట సాగించొద్దని పోర్టు అధికారులు ఆంక్షలు విధిస్తే తాము ఎలా బతికేదని పలువురు మత్స్యకారులు నిలదీశారు. శుక్రవారం భావనపాడులో మత్స్యకారులు, పోర్టు అధికారులతో మత్స్యశాఖ అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి భావనపాడు, గెద్దలపాడు, మరువాడ, ఎం.సున్నాపల్లి, దేవునల్తాడ, కొత్తపేట, మంచినీళ్లుపేట తదితర గ్రామాలకు చెందిన మత్స్యకారులు హాజరయ్యారు. పలువురు మత్స్యకారులు మాట్లాడుతూ.. పోర్టు సమీపంలో వేట చేయొద్దని పోర్టు అధికారులు ఆంక్షలు విధిస్తున్నారని, ఆ ప్రాంతంలోనే సముద్రం బురదగా.. నాచు పేరుకుపోయి ఉండడం వల్ల వాటిని తినేందుకు చేపలు ఎక్కువగా వస్తాయని, అక్కడ వేట చేయొద్దంటే తాము ఎలా బతికేది అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోర్టు జీఎం రతన్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం పోర్టులో డెజ్జర్‌తో ఇసుక తొలిగింపు పనులు చేపడుతున్నాం. అక్కడ చేపల వేట సాగిస్తే వలలు, తెప్పలు డెజ్జర్ షిఫ్‌నకు చిక్కుకొని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. అందుకే అక్కడ వేట వద్దని కోరుతున్నామ’న్నారు. దీనికి స్పందించిన మత్స్యకారులు తాము పోర్టులో డెజ్జింగ్ పనులు చేపడుతున్న చోట వేట చేయడం లేదని, అటుపోటుల వల్ల తాము వేసిన వలలు అటువైపు వచ్చి ఉండవచ్చన్నారు. తమకు ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు పనులు నిలిపేసి.. వేట సాగించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. కాగా డెజ్జింగ్ పనులు నిలుపుదల చేసే అధికారం తనకు లేదని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానన్నారు. దీంతో సముద్రంలో చేపల వేటే తమకు జీవనాధారమని, భావనపాడులో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టాలని, తద్వారా ఉపాధి పొంది వలసలు తగ్గుతాయని మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు గొరకల ఆదినారాయణ, టీడీపీ నాయకుడు తులసీదాసు కోరారు. మత్స్యకారుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతామని జిల్లా మత్స్యశాఖ జేడీ సత్యనారాయణ అన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ ఎఫ్‌డీవో ధర్శరాజు పాత్రో, సాగరమిత్ర శ్రీకాంత్, భావనపాడు మెరైన్ సీఐ రాము, నౌపడ ఎస్‌ఐ నారాయణస్వామి, వివిధ శాఖల అధికారులు కోరారు.