ఒక్కోటి రూ.4 లక్షలు
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:52 PM
‘Jagananna House Plots’ for sale వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల పేరిట అధికంగా లేఅవుట్లు వేశారు. కొన్నిచోట్ల ప్రభుత్వ స్థలాల్లో వేయగా, మరికొన్ని చోట్ల వైసీపీ నాయకుల భూములను అధిక ధరకు కోనుగోలు చేసి లేఅవుట్లు ఏర్పాటు చేశారు. అయితే చాలా లేఅవుట్లు గ్రామాలకు దూరంగా కొండల సమీపంలో, ఎలాంటి సదుపాయాలు లేనిచోట ఉండడంతో ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకు రాలేదు.
అమ్మకానికి ‘జగనన్న ఇళ్ల స్థలాలు’
బాండు పేపర్లపై సంతకాలు
కొందరు రెవెన్యూ అధికారుల సహకారం
మెళియాపుట్టి మండల కేంద్రంలో ఉన్న కొండ ప్రాంతంలో గత వైసీపీ ప్రభుత్వం జగనన్న లేఅవుట్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ 181 ఇళ్ల స్థలాలు ఉండగా, 150 మందికి మాత్రమే పట్టాలు ఇచ్చింది. వీరిలో 135 మంది మాత్రమే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించగా అవి వివిధ దశల్లో ఉన్నాయి. ఇళ్ల పట్టాలు పొందిన వారిలో చాలామందికి సొంత ఇళ్లు ఉన్నాయి. దీంతో వారు తమ పట్టాలను ఇతరులకు అమ్మేస్తున్నారు. ఒక్కొక్క ఇంటి పట్టాను రూ.3.50లక్షల నుంచి రూ.4లక్షలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
............
మెళియాపుట్టి మండలం కరజాడ గ్రామంలో జగనన్న లేఅవుట్ కోసం గత ప్రభుత్వం ఓ వ్యక్తి వద్ద అధిక ధరకు భూమిని కొనుగోలు చేసింది. గ్రామానికి దూరంగా కొండ సమీపంలో ఉన్న ఈ స్థలంలో 44 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఈ లేఅవుట్‌లో ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో ఇళ్ల నిర్మాణాలకు ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. కొంతమంది తమ ఇళ్ల పట్టాలను వేరేవారికి విక్రయిస్తున్నారు.
మెళియాపుట్టి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల పేరిట అధికంగా లేఅవుట్లు వేశారు. కొన్నిచోట్ల ప్రభుత్వ స్థలాల్లో వేయగా, మరికొన్ని చోట్ల వైసీపీ నాయకుల భూములను అధిక ధరకు కోనుగోలు చేసి లేఅవుట్లు ఏర్పాటు చేశారు. అయితే చాలా లేఅవుట్లు గ్రామాలకు దూరంగా కొండల సమీపంలో, ఎలాంటి సదుపాయాలు లేనిచోట ఉండడంతో ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకు రాలేదు. పట్టాలు అందుకున్న వారిలో చాలామందికి సొంత గృహాలు ఉండడంతో వారు జగనన్న కాలనీల్లోని ఇళ్ల స్థలాలను ఇతరులకు విక్రయిస్తున్నారు. కొంతమంది పేదలు మాత్రం ఇళ్లు కట్టుకోవడానికి డబ్బులు లేక పట్టాలను అమ్మేస్తున్నారు. అధికంగా టెక్కలి, మెళియాపుట్టి, పలాస, పాతపట్నం, నరసన్నపేట, కొత్తూరు, శ్రీకాకుళం, మందస తదితర ప్రాంతాల్లో జగనన్న ఇళ్ల పట్టాలను అమ్మకాలకు పెడుతున్నారు. ప్రాంతాన్ని బట్టి ఒక్కో ఇంటి పట్టాను రూ.3.లక్షల నుంచి రూ.4లక్షలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది రెవెన్యూ అధికారుల ద్వారా ఈ వ్యవహారం సాగిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు నిజమైన పట్టాదారులతో బాండ్‌పేపర్లపై సంతకాలు చేయించుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణాలు అసలు పట్టాదారుడి పేరుపై జరుగుతున్నా.. వాటి యజమానులు మాత్రం వేరేవాళ్లు ఉంటున్నారు. టెక్కలిలో కొందరికి రెండు, మూడు పట్టాలు ఉన్నట్లు ఇటీవల అధికారుల విచారణలో తేలినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన రికార్డులను రెవెన్యూ అధికారులు మాయం చేసినట్లు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.
790 లేఅవుట్లు..
జిల్లాలో జగనన్న లేఅవుట్లు 790 ఉన్నాయి. 33,265 మందికి ఇళ్ల పట్టాలు అందించారు. సుమారు 11,364 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో అధికంగా 1300 ఇళ్ల నిర్మాణం పూర్తికాగా, పాతపట్నం నియోజకవర్గ్గంలో అత్యల్పంగా 400 ఇళ్ల నిర్మాణం జరిగింది. 20,951 వరకు వివిధ దశల్లో ఉన్నాయి. మరికొన్ని చోట్ల నిర్మాణాలే జరగడం లేదు. గతంలో జగనన్న కాలనీల్లో సీసీ రోడ్లు, కాలువలు, తాగునీటి కోసం రూ.8.74 కోట్లు మంజూరయ్యాయి. కాలువలకు రూ.1.47 కోట్లు, తాగునీటికి రూ.31.5 లక్షలు, సీసీ రోడ్లకు రూ.6.02 కోట్లు, అంతర్గతదారులకు రూ.30 లక్షలు, భూసేకరణకు రూ.13కోట్లు పైగా చెల్లించినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. కానీ, ఎక్కడా ఈ పనులు పూర్తి చేసిన పరిస్థితి లేదు. నిధులు మాత్రం ఖర్చయినట్లు లెక్కలు చూపించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొందరు వైసీపీ నాయకులు తమ బంధువులకు అధికంగా పట్టాలు ఇప్పించుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. పలువురు రెవెన్యూ అధికారులు సైతం తమ వాళ్ల పేర్లతో పట్టాలు పొందారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగనన్న ఇళ్ల పట్టాలపై విచారణ చేస్తామని హడావుడి చేసి వదిలేసింది. దీంతో గతంలో పట్టాలు పొందిన కొంతమంది వైసీపీ నాయకులు వాటిని అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
మా దృష్టికి రాలేదు
జగనన్న లేఅవుట్‌లో ఇళ్ల పట్టాలు పొంది ఇప్పటివరకు నిర్మాణం చేపట్టని వారి వివరాలు సేకరిస్తాం. అటువంటి లబ్ధిదారుల పట్టాలను రద్దు చేసి, ఇళ్లు లేని వారికి వాటిని అందజేస్తాం. ఇళ్ల పట్టాలు అమ్మకాలు జరుగుతున్నట్లు మా దృష్టికి రాలేదు.
- బి.పాపారావు, తహసీల్దార్, మెళియాపుట్టి