House plan for Rs. 1: రూ.1కే ఇంటి ప్లాన్
ABN , Publish Date - Oct 19 , 2025 | 12:13 AM
housing plan పట్టణాలు, నగరాల్లో పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారం చేసుకునేలా.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయికే ఇంటి నిర్మాణ అనుమతులకు అవకాశం కల్పించింది. 50 చదరపు గజాల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి భారీ రాయితీ ఇచ్చింది.
50 చదరపు గజాల్లో నిర్మించేలా ప్రణాళిక
అవగాహన లేక ముందుకు రాని నిర్మాణదారులు
పట్టించుకోని ప్రైవేటు ప్లానింగ్ నిర్వాహకులు
పలాస, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): పట్టణాలు, నగరాల్లో పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారం చేసుకునేలా.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయికే ఇంటి నిర్మాణ అనుమతులకు అవకాశం కల్పించింది. 50 చదరపు గజాల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి భారీ రాయితీ ఇచ్చింది. కేవలం రూ.1 చెల్లిస్తే చాలు అటువంటి నిర్మాణదారులు.. అనుమతులు తక్షణం పొందవచ్చు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, టౌన్‌ప్లానింగ్ అధికారులు, పట్టణాభివృద్ధి సంస్థ ప్రచారాలు కల్పించినా అవగాహన లేకపోవడంతో భవన నిర్మాణదారులు ప్లాన్ అనుమతులకు ఇప్పటివరకూ దరఖాస్తులు చేసుకోలేకపోయారు. ఇంటిప్లాన్‌లకు అనుమతులిచ్చే లైసెన్స్ టౌన్‌ప్లానర్లు దీనిపై తమకు ఎటువంటి డబ్బులు రావని నిర్మాణదారులకు మొండిచేయి చూపిస్తున్నారు.
గతంలో ఇంటి నిర్మాణానికి సంబంధించి టౌన్‌ప్లానింగ్ సిబ్బంది సహాయంతోపాటు ప్రైవేటు లైసెన్స్ టౌన్‌ప్లానర్ల ద్వారా అనుమతి తీసుకునేవారు. దీనికి కనీసం రూ.20వేల నుంచి రూ.50వేలు, పెద్ద భవనాలయితే రూ.1లక్ష వరకూ ప్రభుత్వానికి చలానా రూపంలో నగదు చెల్లించేవారు. దీనికి తోడుగా టౌన్‌ప్లానింగ్ సిబ్బందికి భారీగా ముడుపులు ఇవ్వనిదే అనుమతి వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో, పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది. కొంతమందికైనా వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ఇటీవల పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కె.నారాయణ మంత్రివర్గంతో చర్చించారు. 50 చదరపు గజాల వ్యాసంలో ఉన్న ఇళ్లకు రూ.1కే ప్లాన్ అనుమతి ఇచ్చేలా ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు ఇంటి నిర్మాణదారులు ప్లానింగ్ కోసం ఇంటిస్థలం పత్రాలు, ఆధార్, రేషన్ కార్డును ఆన్‌లైన్ పోర్టర్‌లో అప్‌లోడ్ చేయాలి. రూ.1 ఫీజు చెల్లిస్తే చాలు..మొత్తం అనుమతులన్నీ సకాలంలో లభిస్తాయి. ఒక్కో నిర్మాణదారుడు జీ ప్లస్(రెండు అంతస్తులు) వరకూ నిర్మాణం చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి కొన్ని మునిసిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో దరఖాస్తు చేసుకోగా వారికి అనుమతులు లభించాయి. జిల్లాలో మాత్రం ఇప్పటివరకూ ఈ పథకాన్ని ఎవరూ ఇంకా వినియోగించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. శ్రీకాకుళం కార్పొరేషన్, ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాలిటీల్లో ఇంకా ఈ పథకం ప్రారంభమే కాలేదు. నిత్యం టెలీకాన్ఫెరెన్స్, వీడియో కాన్ఫరెన్స్‌ల్లో అధికారులు రూ.1కే టౌన్‌ప్లానింగ్ అనుమతిపై ఒత్తిడి చేస్తున్నా.. ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న మాదిరిగా వ్యవహారం నడుస్తోంది. దీనివల్ల శాఖాపరంగా కూడా ఎటువంటి లాభాలు లేకపోవడంతో కొంతమంది ఆసక్తి చూపించడం లేదు. అధికారులు దీనిపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
అవగాహన కల్పిస్తాం
కూటమి ప్రభుత్వం రూ.1కే ఇంటి నిర్మాణ అనుమతులకు ఆదేశించింది. ఇప్పటివరకూ ఒక్క దరఖాస్తు కూడా మాకు రాలేదు. దీనిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తాం. నిర్మాణ అనుమతులకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. లైసెన్స్ టౌన్‌ప్లానర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. సాధారణ ఇళ్లతో పాటు రూపాయికే రిజిస్ట్రేషన్ ఇళ్లను కూడా తప్పనిసరి చేయడానికి చర్యలు తీసుకుంటాం.
- ఎన్.రామారావు, కమిషనర్, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ