Share News

Hotels and fast food : ఇక్కడ తింటే.. జబ్బులు ఉచితం!

ABN , Publish Date - Sep 08 , 2025 | 11:32 PM

Unseen food safety regulations జిల్లాలో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, హోటళ్లు రెస్టారెంట్లు, కర్రీ పాయింట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. రోడ్డుపక్కనే మురుగు కాలువల చెంతనే ఫాస్ట్‌ఫుడ్‌, టిఫిన్లను విక్రయిస్తున్నారు.

Hotels and fast food : ఇక్కడ తింటే.. జబ్బులు ఉచితం!

పుట్టగొడుగుల్లా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు

మురుగు కాలువల పక్కనే నిర్వహణ

కానరాని ఆహారభద్రతా నిబంధనలు

శ్రీకాకుళం అర్బన్‌, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, హోటళ్లు రెస్టారెంట్లు, కర్రీ పాయింట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. రోడ్డుపక్కనే మురుగు కాలువల చెంతనే ఫాస్ట్‌ఫుడ్‌, టిఫిన్లను విక్రయిస్తున్నారు. ఆహారభద్రతా శాఖ అధికారులు తనిఖీలు చేయకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆహార పదార్థాల తయారీలో వాడిన నూనెను మళ్లీమళ్లీ వాడుతున్నారు. రుచి, వాసన పెరిగేందుకు ప్రమాదకర రసాయనాల మిశ్రమాలను వినియోగిస్తున్నారు. ఇవేవీ తెలియని ప్రజలు వాటిని తిని అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు.

జిల్లాలో రెండువేల వరకు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, టిఫిన్‌ దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆహారభద్రతా అధికారుల లెక్క ప్రకారం 1500 వరకు అనుమతి పొందినవి. మిగతావి అనధికారికంగా ఏర్పాటు చేసినవే. వాస్తవానికి వీటికి లైసెన్స్‌ తప్పనిసరి. ఆహార పదార్థాలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ మార్క్‌తోపాటు నాణ్యతా ప్రమాణాలు, పరిమాణం, తయారీ తేదీ, గడువుతేదీ, ధర ముద్రించి విక్రయించాలి. వంటపాత్రలు శుభ్రం చేసేందుకు ప్రత్యేక గది ఉండాలి. కానీ ఇవేవీ ఎక్కడా అమలు కావడం లేదు. చాలా హోటళ్లు, రెస్టారెంట్‌ల్లో వినియోగించిన పాత్రలు, గ్లాసులను పదే పదే కడిగి తిరిగి వాటిని వాడుతున్నారు. వంట మాస్టార్లు, సర్వర్లు తప్పనిసరిగా ఏప్రాన్స్‌, క్యాప్‌, చేతులకు గ్లౌజులు ధరించాల్సి ఉన్నా.. ఎక్కడా పాటించడం లేదు. కొన్ని రోజులు తరబడి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి దుర్వాసన వచ్చిన వాటిని నూనెలో వేయించి తమదైన శైలిలో ప్రజలకు అంటగడుతున్నారు. బాగా మరిగిన నూనెను మళ్లీ మళ్లీ వినియోగించరాదని వైద్యులు చెబుతున్నా.. పట్టించుకోకుండా ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పాడైపోయిన ఆహార పదార్థాలను వేడిచేసి ఇచ్చేస్తున్నారు. రెస్టారెంట్‌లు, డాబాల్లో మరీ దారుణం. తాగిన మత్తులో వచ్చిన వాడికి కల్తీ ఆహారాన్ని అందించి అధిక ధరతో దోపిడీ చేయడం జిల్లాలో సర్వసాధారణమైంది.

శిక్షణ లేకుండానే..

ఆహార పదార్థాలు తయారు చేసేవారు(కుక్‌లు) తప్పనిసరిగా శిక్షణ పొందాలి. కాని చాలామంది కొద్దిరోజుల పాటు హోటళ్లలో పనిచేస్తున్నారు. కుక్‌లుగా అవతారమెత్తుతున్నారు. కొందరు ఏకంగా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే జిల్లాకేంద్రంతోపాటు అన్ని ముఖ్య పట్టణాల్లో కర్రీ పాయింట్లు వెలుస్తున్నాయి. నాణ్యత లేని కూరలు, పప్పుతో పాటు ఇతర ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు. కొన్ని హోటళ్ల మెస్‌లలో ఉదయం తయారు చేయగా మిగిలిపోయిన ఆహార పదార్థాలను రాత్రిపూట విక్రయిస్తున్నారు. ఇటువంటి వారిపై నిఘా పెంచడంతో పాటు ఆహార తయారీపై అవగాహన కల్పించాల్సి అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు.

సిబ్బంది కొరత..

జిల్లాలో సరిగ్గా తనిఖీ చేపట్టకపోవడానికి ఆహారభద్రతా శాఖలో సిబ్బంది కొరత కారణమని సంబంధిత అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ లక్ష మంది జనాభాకు ఒకరు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 50వేల మందికి ఆక ఆహార భద్రతా అధికారులు ఉండాలి. ఈ లెక్కన ఒక్క జిల్లా కేంద్రంలోనే ఆరుగురు ఉండాలి. ఇచ్ఛాపురం, పలాస, కాశీబుగ్గ, ఆమదాలవలస, రాజాం, పాలకొండ మునిసిపాలిటీల్లో కనీసం ఇద్దరు చొప్పున ఉండాలి. ప్రస్తుతం జిల్లాలో కేవలం ఇద్దరు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు మాత్రమే ఉన్నారు. జిల్లాకు ఆహార కల్తీ నియంత్రణాధికారి కూడా ఇన్‌చార్జిగా విజయనగరం జిల్లా నుంచి వస్తున్నారు. సిబ్బంది కొరత కారణంగా పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టకపోవడంతో ఫాస్ట్‌ఫుడ్‌, హోటళ్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

తనిఖీలు చేస్తున్నాం:

జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నాం. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు నెలాఖరు వరకు జిల్లాలో 85 హోటళ్లపై దాడులు చేశాం. 8 హోటళ్లలో కల్తీ జరిగినట్టు గుర్తించి.. వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశాం. ఆహారంలో రంగులు వేసి వి క్రయిస్తే చర్యలు తప్పవు. ప్రతి ఒక్కరు లైసెన్స్‌తో వ్యాపారాలు చేయాలి.

- లక్ష్మీ, శ్రీకాకుళం డివిజన్‌-1 ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌

Updated Date - Sep 08 , 2025 | 11:32 PM