సంక్షేమంలేని హాస్టళ్లు
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:15 AM
Problems in hostels జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. సగానికి పైగా హాస్టళ్లకు సొంత భవనాలు లేవు. అద్దె భవనాల్లో, అసౌకర్యాల నడుమ విద్యార్థులు చదువులు సాగించాల్సి వస్తోంది.
వసతి గృహాల్లో సమస్యలు
సొంత భవనాలు లేవు
వార్డెన్లు, సిబ్బంది కొరత
రెగ్యులర్ ఏఎస్‌డబ్ల్యూవో ఒక్కరే
విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
పొందూరు, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. సగానికి పైగా హాస్టళ్లకు సొంత భవనాలు లేవు. అద్దె భవనాల్లో, అసౌకర్యాల నడుమ విద్యార్థులు చదువులు సాగించాల్సి వస్తోంది. సంక్షేమాధికారులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ఒక్కొక్క వార్డెన్ రెండు మూడేసి వసతిగృహాలకు ఇన్‌చార్జిగా వ్యవహరి స్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఖాళీల సంఖ్య పెరిగిపోతుంది. విద్యార్థులకు సరిపడ మరుగుదొడ్లు లేవు. అత్యవసర వేళ ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది.
జిల్లాలో పరిస్థితి..
జిల్లాలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 22 పోస్టుమెట్రిక్, 70 ప్రీమెట్రిక్ వసతిగృహాలు నడుస్తున్నాయి. వీటిల్లో సుమారు 7వేల మంది విద్యార్థులు ఉంటున్నారు. మొత్తం 92 వసతి గృహాలకు 43 మంది సంక్షేమాధికారులు మాత్రమే ఉన్నారు. కనీసం రెండు వసతి గృహాలకు ఒక వార్డెన్ కూడా లేరు. కొందరు వార్డెన్లు రెండు నుంచి మూడు హాస్టళ్ల బాధ్యతను చూస్తున్నారు. సోంపేట, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, రణస్థలం డివిజన్ల పరిధిలోని వసతి గృహాలకు ఐదుగురు సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు (ఏఎస్‌డబ్ల్యూవో) ఉండాలి. కానీ, కేవలం ఒక్క నరసన్నపేటకు మాత్రమే రెగ్యులర్ ఏఎస్‌డబ్ల్యూవో ఉన్నారు. మిగతా చోట్ల సీనియర్ వార్డెన్లకు ఎఫ్‌ఏసీ ఇవ్వడం జిల్లాలో పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటికే రెండు, మూడు వసతి గృహాలు చూస్తున్న వార్డెన్లకు ఏఎస్‌డబ్ల్యూవో బాధ్యతలు అప్పగించడంతో వారు తమ ఉద్యోగానికి తగిన న్యాయం చేయలేకపోతున్నారు. మిగిలిన సిబ్బంది కూడా అంతంత మాత్రమే ఉన్నారు. ప్రతీ వసతి గృహానికి కుక్, నైట్‌వాచ్‌మన్, సహాయకుడితో ముగ్గురు సిబ్బంది అవసరం. ఈ లెక్కన జిల్లాలో సుమారు 280 మంది సిబ్బంది అవసరంకాగా, కేవలం 50 మంది మాత్రమే రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు. 150 మంది ఔట్‌సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నారు. ఇంకా సుమారు 80 మంది సిబ్బంది అవసరం. వార్డెన్లు, సిబ్బంది కొరత కారణంగా హాస్టళ్ల నిర్వహణ కష్టమవుతోంది.
సొంత భవనాలు లేవు..
జిల్లాలో 22 పోస్టుమెట్రిక్ వసతి గృహాలకు గాను కేవలం రెండు హాస్టళ్లకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మిగిలిన 20 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. 70 ప్రీమెట్రిక్ వసతి గృహాలకు సంబంధించి 10 అద్దె భవనాల్లో, 15 ఇతర ప్రభుత్వ భవనాల్లో నడుస్తున్నాయి. 45 వసతి గృహాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న వసతి గృహాల్లో కనీస మౌలిక సౌకర్యాలు ఉండడం లేదు. ఎక్కువ మంది విద్యార్థులు ఉండేందుకు తగిన భవనాలు లేక ఇబ్బందులు తప్పడం లేదు. సరిపడ మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయటకు వెళ్లాల్సివస్తోంది. రాత్రిపూట వారు నిద్రించడానికి స్థలం చాలడంలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి హాస్టళ్లలో సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.
కష్టంగా ఉంది
నేను మురపాక వసతి గృహానికి రెగ్యులర్ వార్డెన్‌గా పని చేస్తున్నా. కింతలి వసతి గృహానికి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నా. రెండు హాస్టళ్ల నిర్వహణపై దృష్టి పెట్టడం కష్టంగా ఉంది. వార్డెన్ల పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.
-బొమ్మాళి దాసు, సంక్షేమాధికారి కింతలి
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం..
బీసీ సంక్షేమ వసతి గృహాల్లో సిబ్బంది కొరత వాస్తవమే. ప్రస్తుతం 92 వసతి గృహాలు ఉండగా 77 పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. కేవలం 43 మంది వార్డెన్‌లు మాత్రమే ఉన్నారు. సహాయ సిబ్బంది కూడా కొరత ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం.
- అనూరాధ, డీఎస్‌డబ్ల్యూవో