డబ్బు ఆశచూపి.. స్మగ్లింగ్‌లోకి దించి
ABN , Publish Date - Oct 09 , 2025 | 12:05 AM
విద్యార్థులు, మహిళలు గంజాయి స్మగ్లర్ల వలలో చిక్కుకుంటున్నారు.
- గంజాయి రవాణా కోసం విద్యార్థులు, మహిళల వినియోగం
- రోడ్డు, రైళ్ల మార్గాల ద్వారా సరుకు తరలింపు
- పోలీసులకు పట్టుబడుతున్న వైనం
- తప్పించుకుంటున్న వ్యాపారులు
ఇచ్ఛాపురం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి):
ఈ నెల 22న ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌లో అజయ్ మునుస్వామి అనే 19 ఏళ్ల యువకుడు గంజాయితో పట్టుబడ్డాడు. ఈయనది తమిళనాడు. గ్రౌండ్‌లో ఆడుతుండగా గంజాయి వ్యాపారి విక్కీతో పరిచయం ఏర్పడింది. విక్కీ అధిక డబ్బులు ఆశచూపి మునుస్వామిని గంజాయి రవాణా ముగ్గులోకి దించాడు. విక్కీతో కలిసి గంజాయి తరలిస్తుండగా ఇచ్ఛాపురం పోలీసులకు పట్టుబడ్డాడు.
ఈ ఏడాది మే 31న మడపాం టోల్‌ప్లాజా వద్ద ఓ మహిళ గంజాయితో పట్టుబడింది. పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఓ వాహనం నుంచి దిగిన కటక్‌కు చెందిన రత్నకర్ జిన్ని బ్యాగుతో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. పర్లాకిమిడికి చెందిన ట్రావెలర్ ముక్తిపరిషా వద్ద గంజాయిని పట్టుకొని పోలీసులు అరెస్టు చేశారు.
జూలై 15న పలాస రైల్వేస్టేషన్‌లో గంజాయితో ముగ్గురు మహిళలు పట్టుబడ్డారు. వీరంతా బిహార్‌లోని హోటల్‌లో కూలీలుగా పనిచేస్తున్నారు. ఒడిశా నుంచి గంజాయి తెచ్చి ఇస్తే రూ.5 వేలు వంతున ఇస్తామని ఆశచూపారు వ్యాపారులు. దీంతో ఒడిశా నుంచి పలాస మీదుగా బిహార్‌కు గంజాయి తరలిస్తుండగా పోలీసులకు దొరికిపోయారు.
విద్యార్థులు, మహిళలు గంజాయి స్మగ్లర్ల వలలో చిక్కుకుంటున్నారు. పేదరికం, కుటుంబ అవసరాలు, వ్యసనాలు వంటివి ఆసరాగా చేసుకొని వారిని గంజాయి దందా కోసం వ్యాపారులు వినియోగించుకుంటున్నారు. డబ్బు ఆశచూపి స్మగ్లింగ్‌లోకి దించుతున్నారు. పోలీసుల తనిఖీల్లో వీరు పట్టుబడుతుండగా, వ్యాపారులు మాత్రం తప్పించుకుంటున్నారు. మైనర్లు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో జిల్లా గంజాయి, నల్లమందు వంటి మాదక ద్రవ్యాలకు అడ్డాగా నిలుస్తుంది.
ఒడిశా నుంచి జిల్లాలోకి..
జిల్లాకు ఒడిశా రాష్ట్రంతో అనుబంధం ఎక్కువ. రోడ్డు, రైలు మార్గం ఉంది. ఇదే ఇప్పుడు మాదక ద్రవ్యాల రవాణా, వినియోగం, విక్రయానికి కారణమవుతోంది. ఒడిశాలోని గజపతి, గంజాం, రాయగడ జిల్లాలకు సంబంధించి అంతర్ రాష్ట్ర రహదారులు ఉన్నాయి. ఈ రహదారులపై కనీస తనిఖీలు లేవు. చెక్ పోస్టులను సైతం అధికారులు ఎత్తేశారు. ప్రత్యేక పోలీసులను విధుల నుంచి తొలగించారు. దీంతో తనిఖీలు మృగ్యమయ్యాయి. గంజాయి ముఠాలు, రవాణాదారులు, ఇష్టారాజ్యంగా జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు. స్థానిక యువతతో ఒప్పందం చేసుకుంటున్నారు. వారితోనే గంజాయిని విక్రయిస్తున్నారు. జిల్లాలో ఇచ్ఛాపురం, సోంపేట, మందస, పలాస, పూండి, నౌపడ, కోటబొమ్మాళి, తిలారు, శ్రీకాకుళం రోడ్డు(ఆమదాలవలస), పొందూరు, జి.సిగడాం రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఇందులో పలాస, శ్రీకాకుళం పెద్దస్టేషన్లు. వాటికి మినహాయించి చిన్నస్టేషన్ల మీదుగా గంజాయిని రవాణా చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పాసింజర్ రైళ్ల ద్వారానే గంజాయిని తరలిస్తున్నట్టు సమాచారం.
యువత, విద్యార్థులే టార్గెట్
యువకులు, విద్యార్థులే గంజాయి ముఠా టార్గెట్. ఇందుకు సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు నడుపుతున్నారు. గంజాయి తాగడాన్ని ఒక ఫ్యాషన్‌గా చెప్పుకొని యువతను ఆకర్షిస్తున్నారు. పలానా చోట గంజాయి దొరకుతుందని కోడ్ సంభాషణ ద్వారా చెప్పుకుంటున్నారు. ప్రధానంగా 20 సంవత్సరాల్లోపు ఉన్నవారినే పక్కా ప్రణాళికతో గంజాయికి అలవాటు చేస్తున్నారు. ప్రతిగ్రామంలో అయిదారుగురు యువకులను ఎంపిక చేసుకొని ముగ్గులోకి దించుతున్నారు. మద్యం కంటే తక్కువ ధరకు లభిస్తుండడం, నిషా ఎక్కువగా ఇస్తుండడంతో ఇట్టే అడిక్టవుతున్నారు. ఇంత జరుగుతున్నా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇటీవల టోల్ ఫ్రీ నెంబర్‌తో పాటు ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అంటూ భారీ స్థాయి బోర్డులను విద్యాసంస్థల వద్ద ఏర్పాటు చేశారు. అంతకు మించి ఎస్‌ఈబీ ఎటువంటి చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేయలేదు. అటు విద్యార్థుల్లో అవగాహన పెంచలేదు. అలాగని గంజాయిని పట్టుకోవడం లేదు. పోలీస్ శాఖే ఎంతోకొంత గంజాయిని పట్టుకుంటుంది.
గంజాయి నివారణకు చర్యలు..
ఇచ్ఛాపురం (ఆంధ్రా)-ఒడిశా పక్కపక్కనే ఉండడంతో ఆ రాష్ట్రం నుంచి వ్యాపారులు గంజాయిని జిల్లాలోకి తీసుకువస్తున్నారు. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెక్‌పోస్టులు, ప్రధాన కూడళ్లు, రైల్వే స్టేషన్ల వద్ద పోలీస్ నిఘా ఉంచాం. ఆంధ్రా మీదుగా గంజాయి వంటి మాదక ద్రవ్యాలు తరలించకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం.
- మీసాల చిన్నంనాయుడు, సీఐ, ఇచ్ఛాపురం