Grain Price Hike: క్వింటాకు రూ.69
ABN , Publish Date - May 29 , 2025 | 12:11 AM
Farmers' Support కేంద్ర ప్రభుత్వం వివిధ పంటలకు మద్దతు ధర పెంచింది. జిల్లాలో ప్రధానంగా సాగు చేసే వరి పంటకు సంబంధించి క్వింటా ధాన్యానికి రూ.69 పెంచుతూ.. బుధవారం కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
ధాన్యానికి కనీస మద్దతు ధర పెంపు
జిల్లాలో రైతులకు రూ.60.72కోట్ల లబ్ధి
జిల్లాలో ఖరీఫ్‌లో వరి సాగు : లక్షా 54వేల హెక్టార్లు
గత ఖరీఫ్‌లో ధాన్యం దిగుబడి: 8.80 లక్షల మెట్రిక్‌టన్నులు
గతంలో క్వింటా ధాన్యం ధర : రూ.2,300
ప్రస్తుతం పెంచిన మద్దతు ధర : రూ.69
టెక్కలి, మే 28(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం వివిధ పంటలకు మద్దతు ధర పెంచింది. జిల్లాలో ప్రధానంగా సాగు చేసే వరి పంటకు సంబంధించి క్వింటా ధాన్యానికి రూ.69 పెంచుతూ.. బుధవారం కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. అలాగే జొన్న క్వింటాకు రూ.328, రాగులకు రూ.596, వేరుశనగకు రూ.480, మొక్కజొన్నకు రూ.175, కందిపప్పుకు రూ.450, మినుములకు రూ.400, పొద్దుతిరుగుడు రూ.441, పత్తి రూ.589 పెంచినట్టు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవి వెల్లడించారు. కాగా.. ఇతర పంటలతో పోల్చితే.. ధాన్యానికి కనీస మద్దతు ధర చాలా తక్కువని రైతులు పెదవి విరుస్తున్నారు.
జిల్లాలో లక్షా 54వేల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. గతేడాది క్వింటా ధాన్యం రూ.2,300కు విక్రయించగా.. ఈసారి కేంద్ర ప్రభుత్వం దీనికి అదనంగా మద్దతు ధర రూ.69చొప్పున పెంచింది. ఈ మేరకు జిల్లాలో రైతులకు రూ.60.72 కోట్ల మేర అదనపు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో ఈ మద్దతు ధర చాలదని కొంతమంది రైతులు పేర్కొంటున్నారు. ఆదాయ వనరులు అంతంత మాత్రం కావడంతో రానున్న నాలుగేళ్లలో జిల్లాలో వరి పంట విస్తీర్ణం తగ్గించాలని అధికారులు భావిస్తున్నారు. ఉద్యాన పంటలవైపు రైతుల దృష్టి మార్చేలా చర్యలు చేపడుతున్నారు. ఒక మనిషికి రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.2.82లక్షలు ఉండగా, జిల్లాలో రూ.1.47లక్షలకు పరిమితమైంది. జిల్లాలో తలసరి ఆదాయం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. జిల్లాలో రైతులు 95శాతం వరి పండిస్తున్నారు. సుమారుగా ఒక రైతు ఎకరా 20సెంట్లు వరకు వరిని పండిస్తున్నారు. ఎకరాకు 25బస్తాల దిగుబడి రాగా.. రూ.45వేల వరకు ఆదాయం వస్తోంది. కాగా ఖర్చులకే ఇందులో రూ.25వేల వరకు పోతోంది. రైతులకు అంతంతమాత్రంగానే ఆదాయం మిగలడంతో ఉద్యాన పంటలు సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అరటి, బొప్పాయి, కొబ్బరి, జామ, కోకో, పామాయిల్ తదితర పంటలు పెంచాలని అవగాహన కల్పిస్తున్నారు. ఉద్యాన సాగుకు అవసరమైతే సబ్సిడీలు అందించేందుకు సన్నద్ధమవుతున్నారు. వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు.. లాభదాయకమైన ఉద్యాన పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు బీవీ తిరుమలరావు తెలిపారు.
రైతులకు ఊరట
పంటలకు మద్దతు ధర పెంచుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊరట కల్పించింది. ఈ పెంపు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రైతులకు వడ్డీ రాయితీని కూడా ప్రకటించడం హర్షనీయం. రైతుల తరుపున కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
- మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు