జిల్లాలో హై అలర్ట్
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:25 AM
Inspection of vehicles దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం రాత్రి బాంబు పేలింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా.. 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా.. విశాఖపట్నంలో పారిశ్రామిక సదస్సు.. ‘సమ్మిట్’ మంగళవారం నిర్వహించనున్న నేపథ్యంలో అంతటా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఆదేశించారు. సోమవారం ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాలని స్పష్టం చేశారు. దీంతో జిల్లా అంతటా హైఅలర్ట్ నెలకొంది.
ఢిల్లీలో బ్లాస్టింగ్ ఘటనతో ముమ్మరంగా తనిఖీలు
విశాఖ సమ్మిట్ నేపథ్యంలో మరింత అప్రమత్తం
శ్రీకాకుళం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం రాత్రి బాంబు పేలింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా.. 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా.. విశాఖపట్నంలో పారిశ్రామిక సదస్సు.. ‘సమ్మిట్’ మంగళవారం నిర్వహించనున్న నేపథ్యంలో అంతటా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఆదేశించారు. సోమవారం ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాలని స్పష్టం చేశారు. దీంతో జిల్లా అంతటా హైఅలర్ట్ నెలకొంది. డీజీపీ ఆదేశాల మేరకు ఎస్పీ మహేశ్వరరెడ్డి జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. శనివారం రాత్రి నుంచి డీఎస్పీల నుంచి కానిస్టేబుల్ వరకు రోడ్లపైనే ఉన్నారు. శ్రీకాకుళం నగరంలో ఉన్న అన్ని లాడ్జీలను బృందాలుగా వెళ్లి తనిఖీచేశారు. లాడ్జీలలో ఎవరెవరు ఉంటున్నారు.. ఏయే ప్రాంతాలకు చెందినవారు ఉంటున్నారన్నదీ ఆరా తీశారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్, నిర్మానుష్య ప్రాంతాలు, రైల్వేస్టేషన్లు, కార్తీక సోమవారం సందర్భంగా రాత్రి కూడా భక్తులతో నిండి ఉన్న శివాలయాల వద్ద.. ప్రార్థనా స్థలాల వద్దనూ పోలీసులు మోహరించారు. నాగావళి నదీ తీరాన్ని పరిశీలించారు. బృందాలుగా విడిపోయి.. శ్రీకాకుళంతో పాటు ఆమదాలవలస, నరసన్నపేట, ఇచ్ఛాపురం, టెక్కలి, పలాస-కాశీబుగ్గ, పాతపట్నం, రణస్థలం తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. కొత్తవ్యక్తులు.. ఈ జిల్లాతో సంబంధంలేని వ్యక్తులు తారసపడితే క్షుణ్నంగా వివరాలను నమోదు చేస్తున్నారు. శ్రీకాకుళం-ఒడిశా సరిహద్దుల నుంచి వచ్చిపోయే వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. చెక్‌పోస్టుల వద్ద హైవే పెట్రోలింగ్, ఏపీఎస్పీ సిబ్బంది తనిఖీలు ముమ్మరం చేశారు. రాత్రివేళ ప్రయాణం చేస్తున్న వాహనదారులు.. ప్రయాణీకులు ... ఒక్కసారిగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారేంటనుకుని ఆశ్చర్యపోతున్నారు. పలు ప్రాంతాల్లో తనిఖీలను ఎస్పీ, డీఎస్పీలు పర్యవేక్షించారు. అనుమానాస్పద వ్యక్తులెవరైనా తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.
మంత్రి అచ్చెన్నాయుడు దిగ్ర్భాంతి
ఢిల్లీలో భారీ పేలుడు ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన మానసికంగా తనను కలచివేసిందన్నారు. పేలుడు ధాటికి పలువురు మృతి చెందడం, కొందరికి గాయాలు కావడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు వేగంగా స్పందించిన సహాయక సిబ్బందిని అభినందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు.