Share News

ఇక్కడా.. ఆకాశహర్మ్యాలు

ABN , Publish Date - Sep 14 , 2025 | 11:44 PM

Plan to increase the height of buildings జిల్లాలోని పట్టణాల్లో భవనాల ఎత్తు పెరగనుంది. అవసరమైతే ఎత్తు పెంచుకునేలా, కొత్తవి మరింత ఎత్తులో నిర్మించుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. రాష్ట్రంలో భవనాల గరిష్ఠ ఎత్తు పరిమితిని 18 మీటర్ల నుంచి 24 మీటర్ల పెంచనున్నట్లు రాష్ట్ర హౌసింగ్‌, ఐ అండ్‌ పీఆర్‌ మంత్రి కొలుసు పార్థసారథి ఇటీవల ప్రకటించారు.

ఇక్కడా.. ఆకాశహర్మ్యాలు

జిల్లాలో భవన నిర్మాణాల ఎత్తు 24 మీటర్లకు పెంచే యోచన

ప్రస్తుతం ఐదంతస్తులే.. 18మీటర్లకే అనుమతి

ఇక ఏడంతస్తుల మేడలు.. అన్నీ హైరైజ్డ్‌ భవనాలే

త్వరలో శాసనసభలో చర్చ

పట్టణాభివృద్ధికి దోహదం

శ్రీకాకుళం, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పట్టణాల్లో భవనాల ఎత్తు పెరగనుంది. అవసరమైతే ఎత్తు పెంచుకునేలా, కొత్తవి మరింత ఎత్తులో నిర్మించుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. రాష్ట్రంలో భవనాల గరిష్ఠ ఎత్తు పరిమితిని 18 మీటర్ల నుంచి 24 మీటర్ల పెంచనున్నట్లు రాష్ట్ర హౌసింగ్‌, ఐ అండ్‌ పీఆర్‌ మంత్రి కొలుసు పార్థసారథి ఇటీవల ప్రకటించారు. దీనిపై అసెంబ్లీలో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పెరుగుతున్న జనాభా అవసరాలు, పట్టణాభివృద్ధి దృష్ట్యా ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఇక అపార్ట్‌మెంట్లు.. ఆకాశహర్మ్యాలు కానున్నాయి.

ఐదు కాదు.. ఏడంతస్తులు

విశాఖపట్నం, హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఇప్పటికే ఆకాశహర్మ్యాలు నిర్మించారు. 150 మీటర్ల ఎత్తు వరకూ అనుమతి ఇస్తున్నారు. 35నుంచి 40 అంతస్తులు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మన ప్రాంతాల్లో అంత ఎత్తులో భవనాలు నిర్మించడానికి అనుమతులు లేవు. సాధారణ అపార్ట్‌మెంట్లను ఐదంతస్తుల వరకే పరిమితం చేశారు. అంటే 18మీటర్ల కంటే ఎత్తుదాటి అపార్టుమెంట్లు, ఇతర భవనాలు నిర్మించకూడదు. 18 మీటర్ల ఎత్తు దాటితే వాటిని హైరైజ్డ్‌ భవనాలు కింద పరిగణిస్తారు. వాటి నిబంధనలను కూటమి ప్రభుత్వం ఈ నిబంధన సడలించనుంది. సాధారణ అపార్ట్‌మెంట్ల ఎత్తు 24 మీటర్ల వరకూ పెంచనుంది. సాధారణ అపార్ట్‌మెంట్లను ఏడంతస్తుల వరకూ నిర్మించుకునే అవకాశం కల్పించనుంది. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు విడుదల చేయనుంది. భూమి విలువ పెరగడం వల్ల హైరైజ్డ్‌ భవన నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. దీంతో తక్కువ భూమిలో ఎక్కువ మంది నివసించే అపార్టుమెంట్‌ కల్చర్‌ మరింత పెరగనుంది. ఇంతవరకు సుమారు 400 గజాల్లో నాలుగంతస్తులు, 600గజాల్లో ఐదంతస్తులు కట్టుకునేందుకు అనుమతి ఉంది. భవనాల ఎత్తును 24 మీటర్లకు పెంచడం వల్ల ఏడంతస్తులు కట్టుకోవచ్చు. స్థలం ఎక్కువ ఉంటే హైరైజ్డ్‌ భవనాలు నిర్మించుకోవచ్చు. హైరైజ్డ్‌ నిర్మాణాలకు అదనంగా సిటీ ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌, అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీలు, రేలా అనుమతులతోపాటు ఎయిర్‌పోర్టు, ఫైర్‌ డిపార్ట్‌మెంట్ల అనుమతులు తీసుకోవాలి.

కీలక మలుపు...

భవనాల గరిష్ఠ ఎత్తు పరిమితిని 18 మీటర్ల నుంచి 24 మీటర్లకు పెంచే నిర్ణయం.. రాష్ట్ర పట్టణాభివృద్ధిలో కీలక మలుపుగా భావించవచ్చు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం కార్పొరేషన్‌తోపాటు ఇచ్ఛాపురం, పలాస కాశీబుగ్గ, ఆమదాలవలస, పాలకొండ, రాజాం మునిసిపాల్టీలు ఉన్నాయి. తాజా నిర్ణయంతో పట్టణాల్లో మౌలిక వసతుల విస్తరణతో పాటు నివాస, వాణిజ్య అవసరాలకు సమతుల్యత కలుగుతుంది. బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన వెంటనే రాష్ట్రనిర్మాణ రంగం కొత్త దిశగా పయనించే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. శ్రీకాకుళం నగరంలో ఇప్పటివరకు ఐదంతస్తుల భవనాలే ఎక్కువగా నిర్మించారు. ఇకపై ఏడంతస్తుల భవనాలు వచ్చే అవకాశాలున్నాయి. ఎత్తు మార్పు నిర్ణయం వల్ల కార్పొరేషన్‌తోపాటు.. మునిసిపాలిటీల్లో పట్టణ ప్రణాళికలో మార్పులు తప్పనిసరి కానున్నాయి. భవన సముదాయాల ఎత్తు పెరగనుండడంతో ట్రాఫిక్‌, పార్కింగ్‌తోపాటు నీరు, విద్యుత్‌ సరఫరా, మౌలిక వసతుల పెంపు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది.

Updated Date - Sep 14 , 2025 | 11:44 PM