Share News

Rain fall : ఆగస్టు ఆదుకుంది

ABN , Publish Date - Sep 02 , 2025 | 11:36 PM

formers happyness జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. జూన్‌, జూలై నెలల్లో లోటు వర్షపాతంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. కానీ ఆగస్టులో మాత్రం వరుణుడు కరుణించాడు. లోటును అధిగమించి భారీ వర్షాలు కురవడంతో ప్రస్తుతం జిల్లాలో జలకళ ఉట్టిపడుతోంది.

Rain fall : ఆగస్టు ఆదుకుంది

గత నెలలో లోటును అధిగమించి వర్షం

ఈ నెలలోనూ అదేరీతిన కురిసే అవకాశం

అన్నదాతల్లో ఆనందోత్సాహాలు

శ్రీకాకుళం, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. జూన్‌, జూలై నెలల్లో లోటు వర్షపాతంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. కానీ ఆగస్టులో మాత్రం వరుణుడు కరుణించాడు. లోటును అధిగమించి భారీ వర్షాలు కురవడంతో ప్రస్తుతం జిల్లాలో జలకళ ఉట్టిపడుతోంది. రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వాతావరణ గణాంకాల ప్రకారం జిల్లాలో జూన్‌లో 116.67 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉంది. కానీ 96.97 మిల్లీమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదైంది. జూలైలో 184.41 మిల్లీమీటర్ల వర్షపాతానికిగానూ 157.61 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఈ రెండు నెలల్లో లోటు వర్షపాతం కారణంగా చెరువులు ఎండిపోయాయి. భూగర్భ జలాలు కాస్త అడుగంటాయి. వర్షాకాలంలోనూ జిల్లాప్రజలు వేసవితాపాన్ని చవిచూశారు. ఖరీఫ్‌ సాగు ప్రారంభ దశలో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వర్షాలు అనుకూలించకపోవడంతో శివారు భూముల్లో ఈ ఏడాది పంటలు పండవేమోనని ఆందోళన చెందారు. కాగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాలతో ఆగస్టులో భారీ వర్షాలు కురిశాయి. పంట పొలాలు చెరువుల్లా మారిపోయాయి. ఎటు చూసినా జలమయం కనిపించింది. ఆగస్టులో గణాంకాల ప్రకారం 181.94 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా... ఏకంగా 229.56 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. లోటు వర్షపాతాన్ని అధిగమించింది.

ఈ నెల 1న 13.23 మిల్లీమీటర్లు వర్షపాతం కురవాల్సి ఉండగా... 17.63 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం కూడా జిల్లాఅంతటా భారీ వర్షం కురిసింది. మరో మూడు రోజులపాటుభారీ వర్షాలు కురిసే అవకాశముందని.. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈ నెలలో కూడా జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశముందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటికి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు.

---------------------------------------------------------

జిల్లాలో ఆగస్టులో నమోదైన వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో)

-------------------------------------------------------------------

మండలం కురవాల్సినది కురిసినది

-------------------------------------------------------------------

ఆమదాలవలస 184.2 277.8

బూర్జ 193.5 277.1

ఎచ్చెర్ల 170 295.35

జి.సిగడాం 182.6 276.04

గార 152.2 262.91

హిరమండలం 168.6 232.2

ఇచ్ఛాపురం 196.8 183.72

జలుమూరు 151 242.85

కంచిలి 205.1 177.96

కవిటి 204.9 179.68

కోటబొమ్మాళి 188.8 227.09

కొత్తూరు 205.2 231.32

లావేరు 164.2 290.32

ఎల్‌.ఎన్‌.పేట 167.7 255.87

మందస 198.9 183.53

మెళియాపుట్టి 197.3 189.75

నందిగాం 196 183.54

నరసన్నపేట 165.2 252.58

పలాస 200.9 184.87

పాతపట్నం 162.1 202.39

పోలాకి 169.1 243.08

పొందూరు 180.6 286.9

రణస్థలం 171.9 279.53

సంతబొమ్మాళి 192.6 213.91

సారవకోట 201.4 220.12

సరుబుజ్జిలి 167.7 259.97

సోంపేట 169.8 178.64

శ్రీకాకుళం 159.5 279.31

టెక్కలి 210.5 199.08

వజ్రపుకొత్తూరు 179.8 182.35

-----------------------------------------------------------------

మొత్తం 181.94 229.56

-----------------------------------------------------------------

Updated Date - Sep 02 , 2025 | 11:36 PM