రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:08 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుండడంతో రానున్న నాలుగు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు.
- జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుండడంతో రానున్న నాలుగు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ నెల 26 నాటికి అల్పపీడనం వాయుగుండంగా బలపడి, అదే రోజు దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటుతుందని వాతావారణశాఖ అంచనా వేస్తుందన్నారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్య్సకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదన్నారు. ‘వర్షాల కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ప్రతీ మండలంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. కలెక్టరేట్‌లో 08942-240557 నెంబర్ అందుబాటులో ఉంటుంది. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి. రోడ్లకు నష్టం జరిగితే వెంటనే మరమ్మతులు చేపట్టాలి. మట్టి గోడల ఇళ్లల్లో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. విద్యుత్తుకు అంతరాయం లేకుండా చూడాలి. వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలి.’ అని కలెక్టర్ ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై వచ్చిన ప్రజాభిప్రాయ సర్వే నివేదికలపై కూడా సమీక్షించారు. పీజీఆర్‌ఎస్ పెండింగ్ ఫిర్యాదులు, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, ఉప కలెక్టర్ పద్మావతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.