Rain : జిల్లాకు భారీ వర్షసూచన
ABN , Publish Date - Sep 01 , 2025 | 11:59 PM
Officials should be vigilant ‘బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాల’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. సోమవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో ఆయన సమీక్షించారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): ‘బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాల’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. సోమవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో ఆయన సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ‘వాతావరణ శాఖ సమాచారం మేరకు జిల్లాలో మంగళవారం భారీ వర్షం, బుధ, గురు, శుక్రవారాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల కారణంగా ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే సమాచారం ఇవ్వాలి. కాల్వలు, చెరువులు గండ్లు పడకుండా క్షేత్రస్థాయి సిబ్బంది పర్యవేక్షించాలి. విద్యుత్, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలి. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్‌రూంను ఏర్పాటు చేశామ’ని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. వాతావరణ సూచనలను పాటించాలని తెలిపారు.
జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు
జిల్లాలో రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. ‘జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో వరి, ఇతర పంటలు 3,73,000 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఈ సాగుకుగాను మొదటి, రెండో విడతల్లో కలిపి 20,481 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. రైతుసేవా కేంద్రాలు, వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 11,443 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు డీలర్ల ద్వారా 12,393 మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 23,836 మెట్రిక్ టన్నుల యూరియను రైతులకు సరఫరా చేశాం. ప్రస్తుతం రైతుసేవా కేంద్రాలు, సహకార సంఘాల వద్ద 415.3 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు డీలర్ల వద్ద 123 మెట్రిక్ టన్నులు, బఫర్‌లో 561 మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 1099 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. అదనంగా మరో 589 మెట్రిక్ టన్నులు సరఫరా కానున్నాయి. ఎరువుల సరఫరాపై ఎటువంటి ఇబ్బందులు లేకుండా రెవెన్యూ, విజిలెన్స్ శాఖల సహకారంతో తనిఖీలు నిర్వహిస్తున్నాం. రబీ సీజన్‌కు కావలసిన ఎరువుల నిల్వలు కూడా సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. రైతులు ముందస్తుగా నిల్వ చేసుకోవద్ద’ని కలెక్టర్ తెలిపారు.