జిల్లాకు భారీ వర్ష సూచన
ABN , Publish Date - Oct 02 , 2025 | 12:20 AM
జిల్లాలో రానున్న రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
- యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రానున్న రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జిల్లా అధికార యంత్రాంగంతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వంశధార, నాగావళి నదీ తీర పరివాహక ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉందని అన్నారు. ఈ నదుల్లోని నీటిమట్టాలు శుక్రవారం ప్రమాదకర స్థాయిని దాటే అవకాశం ఉందని, మూడో ప్రమాదకర స్థాయికి చేరితే శ్రీకాకుళం, గార, కొత్తూరు, పోలాకి, జలుమూరు, నరసన్నపేట మండలాల్లోని సుమారు 48 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని అన్నారు. నాగావళి పరివాహక ప్రాంతాలైన ఆముదాలవలస, ఎచ్చెర్ల, బూర్జ మండలాల్లోని 11 గ్రామాలకు ముంపు హెచ్చరిక ఉండవచ్చని తెలిపారు. యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు, నదీతీర ప్రాంతాల్లోని ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని, రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులు వారికి కేటాయించిన స్థానాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలు అత్యవసర సమయంలో 08942-240557 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు. సహాయక బృందాలు విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు.