Heart attack: గుండె.. దడ!
ABN , Publish Date - Sep 10 , 2025 | 12:09 AM
Heart attack deaths on the rise ప్రస్తుతం ఎక్కడ చూసినా వయసుతో సంబంధం లేకుండానే గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. సాధారణ మరణాల్లో మూడొంతులు అవే ఉంటున్నాయి. ఇటీవల కేంద్ర జనగణన విభాగానికి చెందిన శాంపిల్ రిజిస్ర్టేషన్ సర్వేలో ఇదే తేలింది.
పెరుగుతున్న గుండెపోటు మృతులు
సాధారణ మరణాల్లో అవే 31శాతం
తేల్చిన కేంద్ర గణన సంస్థ నివేదిక
ముందే మేల్కొనకపోతే ముప్పే
రణస్థలం, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి):
తెలంగాణలోని సింగరేణిలో డీజీఎం చిరంజీవులు ఈ ఏడాది ఏప్రిల్ 16న గుండెపోటుతో మృతిచెందారు. కొత్తూరు మండలానికి చెందిన ఈయన గత 50 సంవత్సరాలుగా సింగరేణిలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఇంట్లో రాత్రి భోజనం అనంతరం విశ్రాంతి తీసుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు గమనించేసరికి చనిపోయారు.
జూన్ 5న కంచిలిలో గ్రామదేవత సంబరాలకు హాజరైన సప్ప కళ్యాణ్ గుండెపోటుతో మృతిచెందారు. విశాఖకు చెందిన ఆయన సినిమా హీరోలకు డూప్‌గా వేషాలు వేస్తుంటారు. గ్రామదేవత పండుగకుగాను బృందంతో వచ్చారు. సమీప చెరువులో స్నానానికి దిగుతుండగా గుండెపోటుకు గురై అక్కడే ప్రాణాలు వదిలారు.
జూన్ 30న జలుమూరు మండలం కూడంపాడు గ్రామానికి చెందిన వాన రాజగోపాలరావు అనే యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు. సీఐఎస్‌ఎఫ్‌లో పనిచేస్తున్న ఆయన రాయచూర్‌లో గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. సహచరులు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.
జూన్ 1న శ్రీకాకుళం సానావీధిలో సచివాలయ ఉద్యోగి దాలినాయుడు అనే యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు. రాత్రి గుండెపోటు రాగా.. ఉదయం కుటుంబసభ్యులు గమనించారు. వైద్యసేవలు అందించినా ఫలితం లేకపోయింది.
జూన్ 4న ఆమదాలవలసకు చెందిన యువ వైద్యుడు హర్షవర్థన్ గుండెపోటుతో చనిపోయారు. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మంచి డాక్టర్‌గా గుర్తింపు పొందారు. కానీ గుండెపోటుతో అకాల మరణం చెందారు.
శ్రీకాకుళం మండలం గోపీనగర్ పాఠశాల హెచ్‌ఎం స్వప్న ఆగస్టు 16న గుండెపోటుతో మృతిచెందారు. ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు నిర్థారించారు.
ఆగస్టు 10న మందస మండలం అంబుగాం గ్రామానికి చెందిన కదంబాల నాగేశ్వరరావు గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబసభ్యులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు.
.......
ప్రస్తుతం ఎక్కడ చూసినా వయసుతో సంబంధం లేకుండానే గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. సాధారణ మరణాల్లో మూడొంతులు అవే ఉంటున్నాయి. ఇటీవల కేంద్ర జనగణన విభాగానికి చెందిన శాంపిల్ రిజిస్ర్టేషన్ సర్వేలో ఇదే తేలింది. దేశంలోని మరణాల్లో 31శాతం గుండెపోటు వల్లే సంభవిస్తున్నాయని తాజా నివేదికలో వెల్లడించింది. అయితే 30 ఏళ్ల వయసులోనే గుండెపోటు మరణాలు అధికంగా ఉన్నాయని ఈ నివేదిక చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో కూడా గుండెపోటు మరణాలు పెరగడం చర్చనీయాంశమవుతోంది. జిల్లావాసులు శ్రమజీవులు. గతంలో ఇటువంటి రుగ్మతలు అరుదు. కానీ ఇటీవల మారిన పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, మద్యం, పొగ తాగడం తదితర దురలవాట్ల మూలంగా వ్యాధులు చుట్టుముడుతున్నాయి. కొందరిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి కూడా గుండెపోటుకు దారి తీస్తోంది.
రక్తప్రసరణే కీలకం
గుండెపోటు అనేది తీవ్ర సమస్యగా మారుతోంది. మిగతా రుగ్మతలు కొంత సమయమిస్తాయి. కానీ గుండెపోటు అలాకాదు. వచ్చిన కొద్దిసేపటికే వైద్యసేవలు అందాలి. అన్నింటికీ మించి గుండెపోటు సంకేతాలు అందిన వెంటనే మనమే మేలుకోవాలి. వైద్యనిపుణులను సంప్రదించాలి. గుండెకు రక్తం సరఫరా చేసే నరాలు పూడికపోతాయి. అప్పుడు నరాలు చిట్లి రక్తం గడ్డ కడుతుంది. గుండెకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. అప్పుడే గుండెపోటుకు దారితీసే అవకాశం ఉంటుంది. ముందస్తుగానే గుర్తించే చాలా పరీక్షలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ప్రధానంగా కరోనరీ కాల్షియం స్కోర్ తెలుసుకోవడం ద్వారా గుండెపోటును నియంత్రించవచ్చు. కార్డియాక్ సిటీ స్కాన్ ద్వారా పరీక్షించుకోవచ్చు. ఇది రక్తనాళాల్లోని కాల్షియం మోతాదును లెక్కించి స్కోర్‌ను తెలియజేస్తుంది. ఇది 0 నుంచి 1000కిపైగా అగట్‌స్టన్ యూనిట్ల వరకూ ఉండొచ్చు. దీని ద్వారా గుండెపోటు ముప్పును ముందుగానే అంచనా వేయవచ్చు. ఉదాహరణకు కాల్షియం స్కోర్ 0 ఉన్నవారికి పదేళ్లలో గుండెపోటు వచ్చే అవకాశం 1 నుంచి 6 శాతం మాత్రమే. 300 కంటే ఎక్కువ ఉన్నవారికి 13 నుంచి 26శాతం వరకూ గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది.
ఆ పరీక్షలు చేసుకోవాల్సిందే..
గుండె కాల్షియం స్కోర్ పరీక్ష చాలా ఉపయోగపడుతుంది. షుగర్, హైబీపీ, అధిక కొలెస్ర్టాల్, శారీరక శ్రమ లేనివారు, కుటుంబంలో అప్పటికే గుండెపోటు వచ్చినవారు, పొగతాగేవారు, ఉబకాయం ఉన్నవారు ఈ పరీక్షలు చేసుకుంటే చాలా మేలు. 35 నుంచి 40 ఏళ్ల వయసులో ఒకసారైనా కాల్షియం స్కోర్ పరీక్ష చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో గర్భిణులు మాత్రం చేయించుకోకూడదు. మూడు నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి కాల్షియం స్కోర్ పరీక్ష చేయించుకోవడం చాలా ఉత్తమం. ఒకవేళ కాల్షియం స్కోరు ఎక్కువగా ఉంటే కొలెస్ర్టాల్ తగ్గించే స్టాటిన్లు వేసుకోవడం, మరింత వ్యాయామం చేయడం, ఆహారంలో మార్పులు చేసుకోవడం, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం, తరచూ డాక్టర్లను సంప్రదించడం వంటి జాగ్రత్తలతో పెద్ద ప్రమాదం నుంచి కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ముందు జాగ్రత్త అవసరం
గుండెపోటు అనేది తీవ్ర రుగ్మత. కానీ ముందుగా గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదు. షుగర్, హైబీపీ ఉన్నవారు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఈసీజీ, టీఎంటీ, ఎకో వంటి వైద్య పరీక్షల ద్వారా గుండె సమస్యలు తెలుసుకోవచ్చు. కాల్షియం స్కోరు పరీక్ష చేసుకోవడం చాలా ఉత్తమం. శరీరానికి అవసరమైన వ్యాయామం, ఆరోగ్య సూత్రాలు పాటించాలి.
- ముద్దాడ యుంగధర్, ఎండీ జనరల్ మెడిసిన్, కొండములగాం సీహెచ్‌సీ, రణస్థలం