Share News

టీడీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడిగా మొదలవలస

ABN , Publish Date - Dec 22 , 2025 | 12:52 AM

టీడీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడిగా మొదలవలస రమేష్‌, ప్రధాన కార్యదర్శిగా పీరుకట్ల విఠల్‌రావును అధిష్ఠానం ఆదివారం నియమించింది.

 టీడీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడిగా మొదలవలస
మొదలవలస రమేష్‌ , పీరుకట్ల విఠల్‌రావు

- ప్రధాన కార్యదర్శిగా విఠల్‌రావు

ఆమదాలవలస/పలాస, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడిగా మొదలవలస రమేష్‌, ప్రధాన కార్యదర్శిగా పీరుకట్ల విఠల్‌రావును అధిష్ఠానం ఆదివారం నియమించింది. ఆమదాలవలస పట్టణానికి చెందిన రమేష్‌.. 1983లో టీడీపీలో క్రియాశీలక సభ్యుడిగా చేరారు. 1984లో తెలుగు విద్యార్థి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు. 1984 నుంచి 87 వరకు జిల్లా తెలుగు విద్యార్థి అధ్యక్షుడిగా పని చేశారు. 1985లో రాష్ట్రస్థాయి టీడీపీ రాజకీయ శిక్షణ శిబిరంలో క్రియాశీలక పాత్ర పోషించారు. 1987-95 మధ్యకాలంలో తెలుగు యువత జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1995లో జరిగిన ఆమదాలవలస నగర పంచాయతీ ఎన్నికల్లో చైర్మన్‌ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. చంద్రబాబు పేరుపెట్టి పిలిచే అతి తక్కువ మందిలో మొదలవలస రమేష్‌ ఒకరు. తన మేనమామ, మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం టీడీపీని విడిచి వెళ్లినప్పటికీ రమేష్‌ మాత్రం పార్టీ వెంటే ఉండి ఎనలేని సేవలు అందించారు. అధిష్ఠానం ఇటీవల నిర్వహించిన ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో రమేష్‌ను ఎక్కువ మంది కార్యకర్తలు బలపర్చారు. దీంతో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆయన పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. రమేష్‌ నియామకంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

టీడీపీ సీనియర్‌ కార్యకర్త, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న పీరుకట్ల విఠల్‌రావు మరోసారి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు పలాస మండలం పెదంచల గ్రామానికి చెందిన విఠల్‌రావు సీనియర్‌ కార్యకర్తగా గుర్తింపు పొందారు. కాపు సామాజికవర్గానికి చెందిన ఈయన మాజీ మంత్రి గౌతు శ్యామసుందరశివాజి, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడులకు కుడిభుజంగా మెలిగేవారు. ప్రస్తుతం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలందరితో సత్సంబంధాలు ఉన్నాయి. పార్టీలో కష్టించి పనిచేసేవారికి గుర్తింపు తధ్యమని ఎమ్మెలే ్య గౌతు శిరీష అన్నారు. ఈ మేరకు విఠల్‌రావును అభినందించారు.

Updated Date - Dec 22 , 2025 | 12:52 AM