బిల్లు అడిగారని.. తొక్కించి చంపేశాడు
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:13 AM
Drunk lorry driver killed మద్యం మత్తులో ఓ లారీడ్రైవర్ దాబాలో భోజనం చేసి.. బిల్లు చెల్లించకుండా ఆ యాజమానితో ఘర్షణకు దిగాడు. ఆపై లారీలో వెళ్లిపోతుండగా.. దాబా యజమాని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయినా వాహనాన్ని ఆపకుండా దాబా యజమాని పైనుంచి నడిపాడు. దీంతో యజమాని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో లారీని అడ్డుకునేందుకు వచ్చిన మరో వ్యక్తి కూడా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
దాబా యజమాని, అడ్డొచ్చిన వ్యక్తి హత్య
మద్యం మత్తులో లారీ డ్రైవరు ఘాతుకం
కంచిలి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో ఓ లారీడ్రైవర్ దాబాలో భోజనం చేసి.. బిల్లు చెల్లించకుండా ఆ యాజమానితో ఘర్షణకు దిగాడు. ఆపై లారీలో వెళ్లిపోతుండగా.. దాబా యజమాని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయినా వాహనాన్ని ఆపకుండా దాబా యజమాని పైనుంచి నడిపాడు. దీంతో యజమాని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో లారీని అడ్డుకునేందుకు వచ్చిన మరో వ్యక్తి కూడా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కంచిలి మండలం జలంత్రకోట సమీపాన రఫీక్ (స్టార్) దాబా వద్ద బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన చోటుకుంది. మృతుల కుటుంబ సభ్యుల్లో విషాదాన్ని నింపింది. ఇందుకు సంబంధించి కంచిలి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఝార్కండ్‌లోని కొడర్మా ప్రాంతానికి చెందిన లారీడ్రైవర్ ఇబ్రార్ ఖాన్ పలాస వైపు వెళ్తూ.. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో జలంత్రకోటలోని స్టార్ దాబా వద్ద ఆగాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్నాడు. దాబాలో భోజనం చేస్తూ కొంతమంది వ్యక్తులతో వాగ్వాదానికి దిగాడు. దీంతో దాబా యజమాని ఆయూబ్(55).. లారీ డ్రైవర్‌ను వారించాడు. కొద్దిసేపటి తర్వాత 12గంటల సమయంలో ఇబ్రార్ బిల్లు చెల్లించకుండా వెళ్లిపోతుండడంతో ఆయూబ్ అడ్డుకున్నాడు. భోజనం డబ్బులు చెల్లించాలని కోరాడు. అయినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడంతో ఆయూబ్‌పై నుంచి లారీ చక్రాలు వెళ్లిపోయాయి. దీంతో అక్కడికక్కడే ఆయూబ్ మృతి చెందాడు. ఈ ఘటన దూరం నుంచి గమనించిన మధుపురం గ్రామానికి చెందిన డొక్కరి దండాసి(65) లారీని ఆపేందుకు ప్రయత్నించాడు. లారీడ్రైవర్ అతడిపై నుంచి కూడా వాహనాన్ని దూసుకెళ్లడంతో దండాసి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటికీ లారీని ఆపలేదు. స్థానికులు వెళ్లి.. బూరగాం గ్రామ సమీపంలో లారీని నిలుపుదల చేయించారు. తీవ్రంగా గాయపడిన దండాసిని సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందాడు. సోంపేట సీఐ మంగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. లారీడ్రైవర్‌ను అరెస్టు చేశామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని కంచిలి ఎస్‌ఐ పారినాయుడు తెలిపారు.
ఉపాధి కోసం వలస వచ్చి
దాబా యజమాని ఆయూబ్‌ది ఝార్గండ్ రాష్ట్రం. ఉపాధి కోసం 28 ఏళ్ల కిందట ఆయూబ్ సోదరులు ముగ్గురు సోంపేట ప్రాంతానికి కుటుంబాలతో కలిసి వలస వచ్చారు. సోంపేట పట్టణ శివార్లలోను, ఇతర చోట్ల దాబాలు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయూబ్‌కు భార్య నజీమా బేగం, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయూబ్ మృతితో కుటంబ సభ్యులంతా భోరున విలపించారు.
ఘర్షణ ఆపేందుకు వచ్చి..
డొక్కరి దండాసి.. సామాన్య కుటుంబానికి చెందిన పాడి రైతు. ఇతడికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. ఒక కుమారుడు ఆర్మీలో పని చేస్తుండగా, మరో కుమారుడు జలంత్రకోట పంచాయతీ సర్పంచ్. గురువారం రాత్రి దాబాకు పాలను విక్రయించేందుకు వచ్చి, తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నాడు. ఆ సమయంలో ఘర్షణ జరుగుతుండడంతో.. దానిని ఆపేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.