ఆర్జీయూకేటీలో విద్యార్థినులపై వేధింపుల కలకలం
ABN , Publish Date - Dec 16 , 2025 | 11:57 PM
RGUKT campus ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ ఇటీవల వివాదస్పదంగా నిలుస్తోంది. గత నెలలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడగా.. తాజాగా ఇదే క్యాంపస్‌లో ఇంజనీరింగ్ విద్యార్థినులను కొంతమంది అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది వేధిస్తున్నట్టు ఉన్నతాధికారులకు పంపిన ఈ మెయిల్ కలకలం రేపుతోంది.
- నేడు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్, చాన్సలర్ రాక
- నిజానిజాలు తెలుసుకునేందుకు విచారణ
ఎచ్చెర్ల, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ ఇటీవల వివాదస్పదంగా నిలుస్తోంది. గత నెలలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడగా.. తాజాగా ఇదే క్యాంపస్‌లో ఇంజనీరింగ్ విద్యార్థినులను కొంతమంది అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది వేధిస్తున్నట్టు ఉన్నతాధికారులకు పంపిన ఈ మెయిల్ కలకలం రేపుతోంది. విద్యార్థినులపై వేధింపులతోపాటు మరికొన్ని విషయాలపై ఆర్జీయూకేటీ చాన్సలర్, వైస్ చాన్సలర్, డైరెక్టర్‌కు వారం కిందటే ఓ మెయిల్ పంపించారు. అధికారులు ఈ విషయాన్ని తొలుత సీరియస్‌గా తీసుకోలేదు. ఆకతాయిలు చేసేపనిగా కొట్టిపారేసేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత ఈ విషయం బయటకు పొక్కడంతో ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైౖర్‌పర్సన్ రాయపాటి శైలజ, ఆర్జీయూకేటీ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి బుధవారం క్యాంపస్‌ను సందర్శించనున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థినులతో, అధికారులతో, సిబ్బందితో వేర్వేరుగా సమావేశమై వివరాలు సేకరిస్తారు. విద్యార్థినులకు భరోసా ఇచ్చేలా.. వారిలో ధైర్యం నింపేలా చర్యలు తీసుకోనున్నారు. అయితే ఫిర్యాదుపై నిజానిజాలు తెలుసుకునేందుకు ఆర్జీయూకేటీతో సంబంధం లేని వ్యక్తులతో నిష్పక్షపాతంగా విచారణ చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది. మెయిల్ ఎవరు పంపారన్నది కాకుండా దానిలో అంశాలను ఎంతవరకు వాస్తవమో పరిశీలిస్తే క్యాంపస్‌లోని విద్యార్థినులకు పూర్తిస్థాయిలో భద్రత ఏర్పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పారదర్శకంగా విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
నిఘా పెంచాల్సిందే
ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌లో 2017లో ఏర్పాటైంది. ఈ క్యాంపస్‌లో పీయూసీ ప్రథమ సంవత్సరం విద్యార్థులు నూజివీడులో చదువుతుండగా, పీయూసీ రెండో సంవత్సరం, ఇంజనీరింగ్ నాలుగు సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులు ఇదే క్యాంపస్‌లోనే ఉంటున్నారు. సుమారు 5వేల మంది విద్యార్థులు ఉండే ఈ క్యాంపస్‌లో రెగ్యులర్ ఉద్యోగులకన్నా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే అధిక సంఖ్యలో ఉన్నారు. క్యాంపస్‌లో ఏటా ఒకరు ఇద్దరు విద్యార్థులు కారణం ఏదైనప్పటికీ ఆత్మహత్యకు పాల్పడుతుండడంతో కలకలం రేగుతోంది. అప్పుడప్పుడు చిన్నచిన్న ఘటలను జరుగుతున్నా బయటకు రానివ్వకుండా సర్ది చెబుతున్నారు. ఈ క్యాంపస్‌లో నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలి. పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలను అమర్చాల్సి ఉంది. కట్టుదిట్టమైన చర్యలతో క్యాంపస్‌ను నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ కేవీజీడీ బాలాజీ వద్ద ప్రస్తావించగా.. విద్యార్థుల పేరిట వచ్చిన ఈ మెయిల్ ఫిర్యాదుపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.