Rain: కుండపోత
ABN , Publish Date - May 28 , 2025 | 12:06 AM
rain fall జిల్లాలో మంగళవారం రాత్రి కుండపోతగా వర్షం కురిసింది. పోలాకి మండలంలో అత్యధికంగా 91.75 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది.
జిల్లా అంతటా వర్షం
శ్రీకాకుళం నగరం జలమయం
శ్రీకాకుళం, మే 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళవారం రాత్రి కుండపోతగా వర్షం కురిసింది. పోలాకి మండలంలో అత్యధికంగా 91.75 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. కోటబొమ్మాళి 89.0, సంతబొమ్మాళి 86.25, నందిగాం 84.5, శ్రీకాకుళం రూరల్ 77.0, శ్రీకాకుళం సిటీ 64.5, గార 60.75, పలాస 43.75, ఆమదాలవలస 20.0, రణస్థలం 18.0, వజ్రపుకొత్తూరు 16.0, ఎచ్చెర్ల 15.0, కొత్తూరు 13.5, లావేరు 11.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళంలో భారీవర్షం కారణంగా ప్రధాన జంక్షన్లు జలమయమయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఎప్పటిలానే మూడు అడుగుల ఎత్తున నీరు చేరిపోయింది. ప్రయాణికుల రిజర్వేషన్ కౌంటర్ వద్ద వర్షపు నీటిలోనే సిబ్బంది విధులు నిర్వహించారు. అలాగే డేఅండ్‌నైట్ జంక్షన్, బొందిలీపురం జంక్షన్, కృష్ణాపార్క్, బలగ మెట్టు, అటవీశాఖ కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డు చెరువులను తలపించాయి. వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రెండు గంటలపాటు వర్షం కురవడం.. ఆపై ఈదురుగాలుల బీభత్సం... ఇటు పిడుగుల మోతతో జనం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ సరఫరా సుమారు రెండు గంటలపైగా నిలిచిపోయింది.
వంశధార కార్యాలయంలోకి నీరు
టెక్కలి, మే 27(ఆంధ్రజ్యోతి): టెక్కలిలోని వంశధార కార్యాలయంలోకి వరదనీరు చేరిపోయింది. కార్యాలయంలోని ఫైళ్లు, సామగ్రి తడిచిపోవడంతో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మొదలుకొని సిబ్బంది వరకు నానా అవస్థలు పడ్డారు. వంశధార ఈఈ కార్యాలయానికి ముందు జిల్లా కేంద్రాసుపత్రికి సీసీ రోడ్డు వేసి ఎత్తుచేశారు. దీంతో వరదనీరంతా వంశధార కార్యాలయంలోకి చేరింది. పంచాయరాజ్ ఇంజనీరింగ్ అధికారులు అనాలోచిత నిర్ణయంతో వంశధార ఈఈ కార్యాలయానికి శాపంగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. డ్రైనేజ్ నిర్మాణం లేకుండా ీసీసీ రోడ్డు వేయడంతో ఈ దుస్థితి దాపురించిందని పేర్కొంటున్నారు.
