Share News

మూడో రైల్వే లైన్‌కు గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - Jun 18 , 2025 | 11:44 PM

ఇక నుంచి ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే భువనేశ్వర్‌ కేంద్రంగా విశాఖపట్నం నుంచి ఖుర్ధారోడ్‌ వరకూ మూడో రైల్వే లైన్‌ ఏర్పాటుకు రైల్వేశాఖ పచ్చ జెండా ఊపింది.

మూడో రైల్వే లైన్‌కు గ్రీన్‌సిగ్నల్‌
పలాస-ఇచ్ఛాపురం మార్గంలో ఉన్న రెండు లైన్లు

- విశాఖపట్నం-ఖుర్ధారోడ్‌ మధ్య ఏర్పాటుకు ఆదేశాలు

- శరవేగంగా భూసేకరణ

- రైళ్ల రాకపోకలకు తప్పనున్న ఇబ్బందులు

  • రెండేళ్ల కిందట ఒడిశాలోని బాలాసూర్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ప్రమాదం జరిగింది. ఫలక్‌నుమాను గూడ్స్‌ రైలు ఢీకొంది. దీంతో మొత్తం అప్‌, డౌన్‌ లైన్లలో పట్టాలన్నీ ధ్వంసమయ్యాయి. దీనివల్ల రోజంతా రైళ్లరాకపోకలు ఆలస్యమయ్యాయి. పట్టాలు సరిచేసిన తరువాతే సాధారణ రైళ్లు నడిచాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేకపోయారు.

పలాస, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): ఇక నుంచి ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే భువనేశ్వర్‌ కేంద్రంగా విశాఖపట్నం నుంచి ఖుర్ధారోడ్‌ వరకూ మూడో రైల్వే లైన్‌ ఏర్పాటుకు రైల్వేశాఖ పచ్చ జెండా ఊపింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఫిబ్రవరిలోనే జరగ్గా, ప్రస్తుతం రెండు డివిజన్‌ పరిధిలో ఉన్న కలెక్టరేట్లకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. కొత్త రైలు మార్గం ఏర్పాటుకు అవసరమ్యే భూ సేకరణ, చెల్లించాల్సిన నష్టపరిహారం, ఆ మార్గంలో రైల్వే స్థలాలు ఉన్నాయా? లేదా? పరిశీలించి నివేదిక సిద్ధం చేయాలని రెవెన్యూశాఖకు ఆదేశాలు అందాయి. ఈ ఏడాది సెప్టెంబరు నెలాఖరు నాటికి భూ సేకరణ పూర్తికావాలని లక్ష్యం పెట్టారు. ఈ మేరకు నెల రోజుల నుంచి ఇచ్ఛాపురం నుంచి పలాస సెక్షన్ల పరిధిలో మొత్తం భూ వివరాలు సేకరించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. రైల్వే, ప్రైవేటు ఆస్తులు గుర్తించే పనిలో తలమునకలయ్యారు. ఇచ్ఛాపురం నుంచి పలాస వరకూ 45 కిలోమీటర్ల పొడవునా ఎక్కువగా రైల్వే ఆస్తులే ఉన్నట్లు గుర్తించారు. సంబంధిత భూములు రైల్వే ఉద్యోగులకే లీజుకు ఇచ్చారు. అయితే, భారీ గోతులతో అవి ఉండడంతో ప్రస్తుతం అందులో వ్యవసాయం ఏవీ చేయడం లేదు. దీంతో రెవెన్యూ అధికారులకు భూ సేకరణ సులువైంది. కొన్ని చోట్ల ప్రైవేటు ఆస్తులు నష్టపోవాల్సి వస్తుంది. దీనిపై ప్రత్యామ్నాయ మార్గం అణ్వేషించడం, లేదా వారికి నష్టపరిహారం చెల్లించి భూములు తీసుకోవడం చేయాల్సి ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. భూ సేకరణ అనుకున్న సమయానికి పూర్తయితే, రెండేళ్లలో కొత్తరైలు మార్గం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే విశాఖ డివిజన్‌లో సంబంధిత పనులు చురుకుగా సాగుతున్నాయి. కొన్నిచోట్ల రైలు పట్టాలకు ఇరువైపులా జంగిల్‌ క్లియరెన్స్‌ చేస్తు మార్గాన్ని చూపిస్తున్నారు. మూడో రైలు మార్గం ఏర్పడితే పూర్తిగా ప్రమాదాలు నివారించడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఒక లైన్‌పై ప్రమాదం జరిగినా మూడో లైను మీదుగా రాకపోకలు సాగించవచ్చు. ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే పరిధిలో కార్గో రైళ్ల సంఖ్య అధికంగా ఉంది. అటువంటి రైళ్లు ఆగకుండా నేరుగా అనుకున్న చోటకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు కూడా ఒకే మార్గం ద్వారా వెళ్లడానికి అవకాశం ఉంటుంది.

Updated Date - Jun 18 , 2025 | 11:44 PM