Potti sriramulu: ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి
ABN , Publish Date - Mar 16 , 2025 | 11:57 PM
Jayanthi Celebration తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రసాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు.

శ్రీకాకుళం కలెక్టరేట్, మార్చి 16(ఆంధ్రజ్యోతి): తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రసాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం శ్రీకాకుళం నగరం పాతబస్టాండ్ కూడలిలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఆమదాలవలస, నరసన్నపేట ఎమ్మెల్యేలు కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శమని తెలిపారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ తెలుగువారి క్షేమం, అభివృద్ధి కోసం తన జీవితాన్ని అర్పించిన త్యాగమూర్తి అని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, విభూది సూరిబాబు, కొమ్మనాపల్లి వెంకటరామరాజు, చిట్టి నాగభూషణరావు, కవ్వాడి సుశీల, ఇతర నాయకులు పాల్గొన్నారు.